LB Nagar Murder Case: టెన్త్ క్లాస్ నుంచే వేధింపులు! మా అక్కను శివ చంపేస్తాడని భయంగా ఉంది - ఆందోళనలో సంఘవి తమ్ముడు
LB Nagar Murder Case: ఎల్బీనగర్ ప్రేమోన్మాది దాడి కేసులో తీవ్రంగా గాయపడిన సంఘవి ప్రాణాలతో బతికొచ్చినా.. మళ్లీ శివ చంపేస్తాడనే భయం తమను వెంటాడుతుందని ఆమె తమ్ముడు రోహిత్ ఆవేదన చెందుతున్నాడు.
LB Nagar Murder Case: ఎల్బీ నగర్ ప్రేమోన్మాది దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో సంఘవి తీవ్రంగా గాయపడడం, ఆమె సోదరుడు పృథ్వీ తేజ్ (చింటూ) అక్కడికక్కడే చనిపోవడం వారి కుటుంబ సభ్యులకు తీరని శోఖాన్ని నింపింది. అయితే ఈ దారుణానికి పాల్పడిన నిందితుడు శివని పోలీసులు ఆ వెంటనే అరెస్ట్ చేశారు. అయితే అతడి గత చరిత్ర, ఆదివారం నాటి దారుణానికి సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సంఘవిని మెరుగైన వైద్యం కోసం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అయితే సంఘవిపై దాడి చేసిన, పృథ్వీ తేజ్ ను అన్యాయంగా, అతి కిరాతకంగా నరికి చంపిన శివ కుమార్ ను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
ముఖ్యంగా సంఘవి సోదరులు శ్రీనివాస్, రోహిత్ లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సోదరి ప్రాణాలతో బయటకు వస్తుందో లేదో అని ఒకవేళ వచ్చినా ఆ శివ కుమార్ మళ్లీ దాడి చేసి చంపేస్తాడనే భయం తమని వెంటాడుతుందని వివరించారు. గతంలోనే తమ సోదరిని శివ కుమార్ వేధిస్తున్నాడని తెలిసి హెచ్చరించామని సంఘవి తమ్ముడు రోహిత్ తెలిపారుడ. ఇలాంటి ఘటన తమ ఇంట్లో జరుగుతుందని అస్సలే ఊహించలేదని, శివ కుమార్ పదో తరగతి నుంచే తమ సోదరిని వేధిస్తున్నాడని చెప్పుకొచ్చారు. ఘటన జరిగన తర్వాత స్థానికులు, స్నేహితులు ఫోన్ చేస్తే ఇంటికి వెళ్లానని.. అప్పటికే తమ సోదురుడు చనిపోయాడని, సోదరి తీవ్ర గాయాలతో రక్తపుమడుగులో పడి ఉందని కన్నీరు పెట్టుకున్నాడు. శివ కుమార్ తో పాటు అతడి సోదరి కూడా తమ తమ్ముడిని పెళ్లి చేసుకోవాలంటూ... సంఘవిని వేధించినట్లు రోహిత్ తెలిపాడు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని రోహిత్ డిమాండ్ చేశాడు.
మరో సోదరుడు శ్రీనివాస్ మాట్లాడుతూ... శివ కుమార్ పదో తరగతి నుంచే సంఘవిని వేధిస్తున్నా, ఇంట్లో వాళ్లు భయపడి చదివంచరేమోనన్న భయంతో ఆమె కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదని గుర్తు చేశారు. అయినా విషయం తెలిసిన మేము శివ కుమార్ ను హెచ్చరించామని.. అయినా వేధింపులు ఆపకుండా అన్యాయంగా మా తమ్ముడిని చంపేశాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సంఘవి కూడా చాలా తీవ్రంగా గాయపడిందంటూ కన్నీరు పెట్టుకున్నాడు.
అసలేం జరిగిందంటే..?
ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఆర్టీసీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. 26 ఎళ్ల వయసుున్న శివ కుమార్ రామాంతపూర్ కు చెందిన సంఘవి గౌడ్ ను పదో తరగతి నుంచి ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. అయితే ఆదివారం రోజు మధ్యాహ్నం 2.45 గంటలకు శివ కుమార్ తన ప్రేమ గురించి సంఘవితో చర్చించేందుకు ఆమె ఇంటికి వచ్చాడు. అదే సమయంలో సంఘవి సోదరుడు పృథ్వీ తేజ్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. అయితే ఎప్పటి నుంచో సంఘవి సోదరుడు చింటూకు, శివ కుమార్ కు మధ్య గొడవ జరుగుతోంది. ఈక్రమంలోనే ఇంటికి వచ్చిన శివ కుమార్.. సంఘవితో పాటు, చింటూను కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో సంఘవి తీవ్రంగా గాయపడగా.. ఆమె సోదరుడు చింటూ అక్కడికక్కడే చనిపోయాడు.
ఆమె వేసిన కేకలతో అప్రమత్తమైన స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. సంఘవిని బయటకు తీసుకొచ్చి నిందితుడు అయిన శివ కుమార్ ను గదిలో వేసి తాళం వేశారు. వెంటనే విషయాన్ని 100 డయల్ ద్వారా పోలీసులకు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. యువతిని ఆస్పత్రికి తరలించారు. అలాగే రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.