Banjara Hills Drugs Case : రాడిసన్ హోటల్ కు భారీ షాక్, ఆ రెండింటి లైసెన్స్ రద్దు
Banjara Hills Drugs Case : బంజారాహిల్స్ రాడిసన్ హోటల్ లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్, బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ ను ఎక్సైజ్ శాఖ రద్దు చేసింది.
Banjara Hills Drugs Case : హైదరాబాద్ బంజారాహిల్స్ రాడిసన్ హోటల్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాడిసన్ హోటల్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్, బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్‌ను ఎక్సైజ్ శాఖ రద్దుచేసింది. రాడిసన్ బ్లూప్లాజా హోటల్ ఘటనపై ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు సోమవారం సమీక్ష నిర్వహించారు. పోలీసుల దాడిలో కొకైన్‌తో పాటు ఇతర మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీంతో ఎక్సైజ్ శాఖ పబ్, బార్ అండ్ రెస్టారెంట్ నిబంధనలు ఉల్లంఘించాయని నిర్ణయించాయి. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వివరాలు తెలిపారు. పబ్, బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు చేయాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ను మంత్రి ఆదేశించారు. పబ్, బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు చేయాలని హైదరాబాద్ ఇంఛార్జ్ డీసీ అజయ్‌రావ్‌ను ఆయన ఆదేశించారు. దీంతో లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు పేర్కొన్నారు.
24 గంటలపాటు లిక్కర్ సప్లైకు అనుమతి
రాడిసన్ హోటల్ 24 గంటలపాటు లిక్కర్ సప్లై చేసేందుకు అనుమతి తీసుకుంది. జనవరి 7న లిక్కర్ లైసెన్స్‌కి అనుమతి తీసుకుని, రూ.56 లక్షల బార్ ట్యాక్స్ చెల్లించి లైసెన్స్ పొందింది. 2బీ బార్ అండ్ రెస్టారెంట్ పేరుతో లైసెన్స్ పొందింది. పబ్‌లో డ్రగ్స్ వాడుతున్నారని తేలడంతో ప్రభుత్వం తాజాగా లైసెన్స్‌ను రద్దు చేసింది. బంజారాహిల్స్ రోడ్ నం.6లో ఉన్న ర్యాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌కు చెందిన ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో ఆదివారం తెల్లవారుజామున నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పబ్ సిబ్బంది సహా 148 మందిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇందులో 90 మంది యువకులు, 38 మంది యువతులు, 18 మంది స్టాఫ్, ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.
నలుగురిపై కేసు నమోదు
హైదరాబాద్‌లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన బంజారాహిల్స్ పబ్‌లో లేట్ నైట్ పార్టీ వ్యవహారంలో కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. హోటల్ రాడిసన్ బ్లూ ప్లాజాలోని పుడింగ్ ఇన్ మింక్ పబ్ కేసు ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు నలుగురు నిందితుల పేర్లను చేర్చారు. వీరు లేట్ నైట్ పార్టీలు చేస్తూ, పబ్‌లో డ్రగ్స్ సప్లై చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో నిందితులుగా మహదారం అనిల్ కుమార్ (35), పార్టనర్ అభిషేక్ ఉప్పాల (35), అర్జున్ వీరమాచినేని అనే పేర్లు నమోదయ్యాయి. ప్రస్తుతం వీరిలో ఇద్దరు మాత్రమే పోలీసుల అదుపులో ఉన్నారు. అర్జున్ విరమాచినేని పరారీలో ఉన్నారు. అనంతరం ఎఫ్ఐఆర్‌లో పోలీసులు కిరణ్ రాజ్ అనే వ్యక్తి పేరు కూడా చేర్చగా.. ఇతను కూడా పరారీలో ఉన్నారు. వీరిద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. సోమవారం మధ్యాహ్నం అరెస్టయిన ఇద్దరిని పోలీసులు రిమాండ్‌కు తరలించనున్నారు. వీరిలో ఏ1గా అనిల్ కుమార్, ఏ2గా అభిషేక్, ఏ3గా అర్జున్, ఏ4గా కిరణ్‌ను చేర్చారు. పబ్‌లో టిష్యూ పేపర్లు, స్ట్రాలు, వెయింగ్ మెషిన్, ప్యాకింగ్ మెటీరియల్ వంటి వాటిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.