Hanumakonda Murder Case: హనుమకొండలో దారుణం, నడిరోడ్డుపై వ్యక్తి దారుణహత్య - వివాహేతర సంబంధమే కారణమా?
Telangana News | హనుమకొండలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై ఇద్దరు వ్యక్తులు గొడవ పడగా చివరికి ఓ వ్యక్తి దారుణహత్యకు దారితీసింది. వివాహేతర సంబంధమే కారణమని ప్రచారం జరుగుతోంది.

Auto driver murdered in Hanumakonda | హనుమకొండలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు ఆటోడ్రైవర్ల మధ్య తలెత్తిన వివాదం కత్తి దాడికి దారితీసింది. ఈ క్రమంలో కత్తిపోట్లకు గురై తీవ్ర రక్తస్రావంతో ఓ ఆటో డ్రైవర్ నడిరోడ్డుపైనే దారుణహత్యకు గురయ్యాడు. సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
హనుమకొండ పోలిస్ డివిజన్ సుబేదారి పీఎస్ పరిధిలో ఉన్న డీమార్ట్ ఎదురుగా ఘటన జరిగింది. ఆటో స్టాండ్ పక్కన ఇద్దరు ఆటో డ్రైవర్లు గొడవ పడుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. మడికొండకు చెందిన రాజ్ కుమార్‌పై మరో ఆటోడ్రైవర్ కత్తితో దాడి చేస్తుండగా.. విడిపించేందుకు ఓ వ్యక్తి తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పట్టపగలే నడిరోడ్డుపై హత్యకు గురైన వ్యక్తిని ఆటోడ్రైవర్ రాజ్‌కుమార్‌గా పోలీసులు గుర్తించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న సుబేదారి పీఎస్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు.
వివాహేతర సంబంధమే కారణమా?
హనుమకొండలో సుబేదారి డీమార్ట్ ఎదురుగా వ్యక్తి దారుణ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. ఓ మహిళతో రాజ్ కుమార్, వెంకటేశ్వర్లు వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. మహిళ విషయంలో బుధవారం వీరి మధ్య మాటామాటా పెరిగి గొడవ జరిగింది. ఈ క్రమంలో రాజ్ కుమార్ అనే వ్యక్తిని తోటి ఆటోడ్రైవర్ ఏనుగు వెంకటేశ్వర్లు కత్తితో దాడిచేసి హత్య చేశాడు. మాటామాటా పెరగడంతో ఆవేశానికి లోనైన వెంకటేశ్వర్లు, తోటి ఆటోడ్రైవర్ రాజ్ కుమార్ పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేయగా తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం రాజ్ కుమార్ మృతదేహాన్ని ఎంజీఎం కు తరలించారు.
వివాహేతర సంబంధాలతో ఒక్కరి జీవితం కాదు కుటుంబాలకు కుటుంబాలే నాశనం అవుతున్నాయి. గతంలోనూ ఎన్నో ఘటనలు చూశాం. తాజాగా ఓ మహిళతో వివాహేతర సంబంధం కోసం మరొకరి ప్రాణం తీసి ఆటోడ్రైవర్ జైలుకు వెళ్లనున్నాడు. మరో ఆటోడ్రైవర్ చనిపోవడంతో అతడి కుటుంబం రోడ్డున పడుతుంది.
Also Read: KTR: ‘పేరుకే ప్రజాపాలన కానీ దివ్యాంగుడైన మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదు.. కాంగ్రెస్‌పై మండిపడ్డ కేటీఆర్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

