Viveka Murder Case : వివేకా హత్య వెనక కుట్రకోణం, హైకోర్టులో సీబీఐ వాదన
Viveka Murder Case : వివేకా హత్య కేసు నిందితుల బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. బెయిల్ ఇవ్వొద్దని, సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ వాదించింది. ఆంక్షలతోనైనా బెయిల్ ఇవ్వాలని నిందితులు తరఫు లాయర్లు కోరారు.
Viveka Murder Case : మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల బెయిల్ పిటిషన్‌పై గురువారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో నిందితులు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, గజ్జల ఉమామహేశ్వర్ రెడ్డి, సునీల్ యాదవ్‌కు బెయిల్ ఇవ్వాలని నిందితుల తరపు లాయర్లు కోర్టును కోరారు. సీబీఐ, నిందితుల తరపు న్యాయవాదుల తమ వాదనలను హైకోర్టుకు వినిపించారు. అయితే వివేకా హత్య వెనక కుట్రకోణం ఉందని సీబీఐ న్యాయవాది వాదించారు. జైలు నుంచే నిందితులు సాక్షులను బెదిరిస్తున్నారని కోర్టుకు తెలిపారు. దస్తగిరి వాగ్మూలం ఆధారంగా ఏ5 పాత్రపై నిర్ధారణ అయిందని సీబీఐ న్యాయవాది కోర్టుకు వివరించారు. సీబీఐ ఇప్పటికే ఈ కేసులో రెండు ఛార్జ్‌షీట్లు దాఖలు చేసిందని న్యాయవాది పేర్కొన్నారు. ఏ4 కన్ఫెషన్ స్టేట్‌మెంట్ మినహా వేరే సాక్ష్యం లేదని సీబీఐ తెలిపింది. కనీసం ఆంక్షలతోనైనా బెయిల్ ఇవ్వాలని నిందితుల తరఫు న్యాయవాదులు కోరారు. అయితే నిందితులకు బెయిల్ మంజూరు చెయ్యొద్దని సీబీఐ న్యాయవాదులు వాదించారు. నిందితులు బయటకు వస్తే సాక్షులను బెదిరించే ప్రమాదం ఉందని కోర్టుకు వివరించారు. సీబీఐ విచారణ ఎప్పుడు పూర్తవుతుందని హైకోర్టు న్యాయవాదులను ప్రశ్నించింది. అధికారులతో మాట్లాడి తెలుపుతామని న్యాయవాదులు పేర్కొ్న్నారు. దీంతో కేసు విచారణ వచ్చే గురువారానికి వాయిదా వేసింది.
సీబీఐ అధికారులకు బెదిరింపులు
కడపలో సీబీఐ అధికారుల్ని దుండగులు బెదిరించిన ఘటన కలకలం రేపుతోంది. ఈ అంశంపై సీబీఐ అధికారుల కారు డ్రైవర్ ఫిర్యాదు చేయడంతో చిన్నచౌక్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. కడప సెంట్రల్ జైల్ నుంచి వెళుతున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వాహనాన్ని అడ్డగించారని, కడప నుంచి వెళ్లిపోవాలంటూ బెదిరించారని, వాహనంలో ఉన్న డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. అధికారులను కూడా బెదిరించారని తెలిపారు. దీనిపై స్పందించిన జిల్లా పోలీసు యంత్రాంగం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. వారిని ఎవరు బెదిరించారనే విషయంపై సీసీ ఫుటేజ్ పరిశీలన చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఛేదించేందుకు సీబీఐ అధికారులు చాలా కాలంగా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు ప్రస్తుతం కీలక దశలో ఉంది. కొద్ది రోజులుగా వైఎస్ వివేకా హత్య కేసులో అనుమానితులుగా ఉన్న వారు సీబీఐ అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు. తమపై తప్పుడు ఫిర్యాదులు చేయమని .. తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అనంతపురం, కడప జిల్లాల ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. దిగువ కోర్టు ఆదే్శంతో చిన్న చౌక్ పోలీస్ స్టేషన్‌లోనే సీబీఐ దర్యాప్తు అధికారి రాంసింగ్‌పై కేసు నమోదయింది. అయితే సీబీఐ అధికారులు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఈ క్రమంలో కొంత మంది ఇప్పుడు నేరుగా సీబీఐ అధికారులకే బెదిరింపులకు పాల్పడటం కలకలం రేపుతోంది. గతంలో వైఎస్ వివేకా కుమార్తె సునీత ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన అంశం కూడా వివాదాస్పదం అయింది. తాజా సీబీఐ అధికారులు అసలు కడపలో ఉండొద్దని బెదిరించారు. ఈ బెదిరింపుల వెనుక ఎవరున్నారనేది పోలీసులు తేల్చాల్సి ఉంది. సీసీ కెమెరాలు పని చేస్తూంటే.. ఆ దృశ్యాలను విశ్లేషించి కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. నిందితుల్ని గుర్తు పట్టలేకపోతే ఈ బెదిరింపులు కేసు ముందుకు సాగే చాన్స్ లేదని భావిస్తున్నారు.