Anantapur News : అక్రమ ఆయుధాల కేసులో పురోగతి, 9 తయారీ కేంద్రాలపై దాడులు
Anantapur News : అక్రమ ఆయుధాల కేసులో అనంతపురం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల సమాచారంతో మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గోవాలో తనిఖీలు చేశారు.
Anantapur News : అనంతపురం అక్రమ ఆయుధాల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప మీడియాకు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసిన ఆరుగురు నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారించారు. వారం రోజులు పాటు నిందితుల విచారణ సాగింది. నిందితుల ఇచ్చిన సమాచారంతో మధ్యప్రదేశ్ లో పోలీసులు దాడులు చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాలలో అక్రమ ఆయుధాల తయారీ కేంద్రాలను పోలీసులు గుర్తించారు. మొత్తం 9 అక్రమ ఆయుధాల తయారీ కేంద్రాలపై అనంతపురం పోలీసుల దాడులు చేశారు. ఈ తయారీ కేంద్రాల్లో 4 పిస్తోల్స్, 2 తూటాలు, 2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. ఈ కేసు విచారణకు కేంద్ర దర్యాప్తు సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 22 తుపాకులు, 97 తూటాలు, 31 కేజీల గంజాయి, 2 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. కేసులో పురోగతి సాధించిన జిల్లా పోలీసులను డీజీపీ అభినందించారని, రూ.25 వేల రివార్డ్ ప్రకటించారన్నారు.
"డిసెంబర్ 25న ఆరుగురు నిందితులను అరెస్టు చేశాం. వారి వద్ద అక్రమ ఆయుధాలు ఉన్నట్లు గుర్తించాం. నిందితులను పోలీసు కస్టడీకి తీసుకుని విచారించాం. దర్యాప్తులో కీలక సమాచారం రాబట్టాం"- ఎస్పీ ఫక్కీరప్ప
బళ్లారి కేంద్రంగా
ఈ అక్రమ ఆయుధాలు కొందరు సంఘ విద్రోహ శక్తులకు చేరినట్లు సమాచారం ఉందని అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఈ కేసును విచారణ చేయాలని కోరుతున్నామన్నారు. నిందితులు దేశవ్యాప్తంగా ఆయుధాలు అమ్మినట్లు సమాచారం ఉందన్నారు. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు 22 తుపాకులు, 97 తూటాలు, 31 కేజీల గంజాయి, 2 కార్లు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నామని ప్రకటించారు. ఈ గన్స్ లో బుల్లెట్స్ పుణేలోని కిరికిలో తయారుచేసినట్లు గుర్తించామని వెల్లడించారు. బెంగళూరుకు చెందిన ఆయుధాల ముఠా అనంతపురం బళ్లారి కేంద్రంగా కొంతకాలంగా ఈ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్రమ ఆయుధాలతో పాటు నకలీ నోట్ల దందా నిర్వహిస్తున్నట్లు సమాచారం. చాలా కాలంగా ఈ ముఠా దందా నడుపుతున్నట్లు తెలుస్తోంది. అక్రమ ఆయుధాల తయారీదారులు, డీలర్లతో కలిపి మొత్తం 6 మందిని అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు.
అక్రమ ఆయుధాల దందా
బళ్లారి - అనంతపురం కేంద్రంగా బెంగుళూరుకు చెందిన కొందరు రౌడీ షీటర్లు, కిరాయి హంతకులు గత కొంత కాలంగా.. నకిలీ కరెన్సీ నోట్లను, ఆయుధాలను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని సిర్పూర్ నుంచి గంజాయి, మధ్యప్రదేశ్‌లోని అక్రమ తయారీ కేంద్రాల నుండి ఆయుధాలను కొనుగోలు చేస్తున్నట్లుగా అందిన సమాచారంతో బర్వానీ జిల్లా ఉమర్తి గ్రామం తయారీ యూనిట్ పై స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ ఇటీవల దాడి జరిపింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం అక్రమాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను (నలుగురు తయారీ దారులు, ఒక డీలర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ తో పాటు ఆయుధాల సరఫరాదారుడిని) పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం వీరి వద్ద నుంచి 18 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆరుగురు నిందితులు జంషీద్ ఖాన్, జీషన్ ముబారక్, అమీర్ పాషా, రియాజ్ అబ్దుల్ షేక్ లపై ఇప్పటికే నిందితులపైన ఏపీ, కర్ణాటక, మధ్య ప్రదేశ్, గోవాలో కేసులు ఉన్నట్లు గుర్తించారు.