Gorantla Madhav Issue : వీడియోలో ఉన్నది గోరంట్ల మాధవో కాదో చెప్పలేం - ఒరిజినల్ వీడియో ఉంటేనే ఫోరెన్సిక్‌కు పంపుతామన్న అనంతపురం ఎస్పీ !
న్యూడ్ వీడియో వివాదంలో అనంతపురం పోలీసులు కీలక ప్రకటన చేశారు. అది ఒరిజినల్ వీడియో కాదని అందువల్ల మార్ఫింగ్, ఎడిటింగ్ జరిగి ఉండవచ్చన్నారు.
Gorantla Madhav Issue : సంచలనం సృష్టించిన ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వివాదంలో అనంతపురం జిల్లా ఎస్పీ కీలక ప్రకటన చేశారు. ఆ వీడియోలో ఉన్నది గోరంట్ల మాధవో కాదో స్పష్టంగా చెప్పలేమని అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ప్రకటించారు. ఎంపీ గోరంట్ల మాధవ్ అభిమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాము దర్యాప్తు జరిపామని అది ఒరిజినల్ వీడియో కాదని గుర్తించామన్నారు. ఒకరు వీడియో చూస్తూంటే.. మరొకరు ఆ వీడియోను ఫోన్‌లో చిత్రీకరించారన్నారు. ఆ తర్వాత ఆ వీడియోను అనేక సార్లుగా ఫార్వార్డ్ చేయడం వల్ల అది ఒరిజినలో కాదో గుర్తించలేకపోతున్నామన్నారు. ఆ వీడియో మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ జరిగి ఉండవచ్చని ఎస్పీ ఫక్కీరప్ప అనుమానం వ్యక్తం చేశారు.
ఐటీడీపీ వాట్సాప్ గ్రూప్‌లో మొదటి సారి పోస్ట్ చేశారు !
ఒరిజినల్ వీడియో ఇంత వరకూ లభించలేదన్నారు. ఒరిజినల్ వీడియో సోర్స్ ఉంటనే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించగలమన్నారు. పైగా ఈ వీడియో వ్యవహారంపై బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. మొదట ఈ వీడియో ఆగస్టు నాలుగో తేదీన తెల్లవారుజామున రెండు గంటలకు ఐ టీడీపీ అఫీషియల్ అనే వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ అయిందన్నారు. అంతకు కొద్ది సేపటి ముందే ఆ గ్రూప్‌లో యాడ్ చేసిన యూకే నెంబర్ ద్వారా ఆ వీడియో పోస్ట్ చేశారు. అది విదేశాలకు చెందిన నెంబర్ కనుక.. ఆ వ్యక్తి ఎవరో కనుగొనేందుకు తదుపరి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ ప్రకటించారు. వీడియోలో ఉన్నది ఎవరన్నది కూడా చెప్పలేమని ఎస్పీ తేల్చేశారు. ఎంపీ మాధవ్ ఇంత వరకూ తమకు ఫిర్యాదు ఇవ్వలేదన్నారు.
బాధితులు ఫిర్యాదు చేస్తేనే ఎంపీ మొబైల్ ఫోన్ విశ్లేషణ
ఇంత సీరియస్ వివాదం జరిగినందున ఎంపీ మొబైల్ ఫోన్ తీసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణ చేియిస్తే మొత్తం నిజం వెలుగు చూస్తుంది కదా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఎస్పీ ఫక్కీరప్ప దాటవేత సమాధానం చెప్పారు. బాధితులు ఎవరైనా ముందుకు వచ్చి ఆ వీడియో సమర్పించి.. ఫిర్యాదు చేస్తే అప్పుడు ఎంపీ మొబైల్ ఫోన్‌ను పరిశీలిస్తామన్నారు. అయితే ఎంపీ అలాంటి న్యూడ్ కాల్ చేయకపోతే.. వెంటనే తెలిసిపోయే దగ్గరి దారి ఉండగా.. ఇలా గుర్తించలేకమని.. ఫోరెన్సిక్ ల్యాబ్ టెస్టులు చేయించలేమని చెప్పడం వివాదాస్పదమయ్యే అవకాశం కనిపిస్తోంది.
రాజకీయ వివాదంగా మారిన న్యూడ్ వీడియో అంశం
ఐదు రోజుల కిందట ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ కాల్ వీడియో లీక్ కావడంతో సోషల్ మీడియాలో దుమారం రేగింది. దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఎంపీ మాధవ్ గత చరిత్ర కూడా ఎంతో వివాదాస్పదమని.. ఆయనపై అత్యాచారం కేసులు కూడా ఉన్నాయని మండిపడ్డారు. ఈ అంశంపై వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ కూడా స్పందించింది. వీడియో నిజం అయితే.. మార్ఫింగ్ కాదని తేలితే కఠినాతి కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అయితే ఆ తర్వాత అది ఎంపీ వ్యక్తిగత వ్యవహారమని.. సమర్థించడంతో కలకలం బయలుదేరింది. ఇప్పుడు అనంతపురం పోలీసులు కూడా ఎంపీ వీడియోను ఒరిజినల్ అని నిర్ధారించలేమని చెప్పడంతో ఎంపీ గోరంట్ల మాధవ్‌కు రిలీఫ్ లభించినట్లయింది.
ఒరిజినల్ వీడియో దొరికితేనే ఫోరెన్సిక్ టెస్టులన్న పోలీసులు
అయితే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు టెస్టులకు పంపించడానికి పోలీసులు ప్రయత్నించకపోవడం వివాదాస్పదమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒరిజినల్ వీడియో లభించలేదని.. సర్క్యూలేట్ చేసిన వారు కూడా ఒరిజినల్ వీడియో కాదని.. వేరే వారు చూస్తూండగా ఫోన్‌లో రికార్డు చేశారన్నారు. అయితే ఎలాంటి వీడియో అయినా ఎనాలసిస్ చేసే సాంకేతిక సామర్థ్యం ఫోరెన్సిక్‌కు ఉంటుంది. అయితే ఒరిజినల్ వీడియో లభించే వరకూ ... తాము ఏమీ చెప్పలేమని.. ఫోరెన్సిక్‌కు పంపలేమని ఎస్పీ ప్రకటించడంతో ఈ కేసులో ఇక కొత్తగా తేలే విషయాలేమీ ఉండవన్న వాదన వినిపిస్తోంది.