Anantapur: జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం, జూనియర్లతో అర్ధనగ్న డ్యాన్సులు!
అనంతపురం జేఎన్టీయూ హాస్టల్లో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. సీనియర్ విద్యార్థుల తమతో అర్ధనగ్నంగా డాన్సులు చేయించారని జూనియర్లు అధికారులకు ఫిర్యాదు చేశారు.
అనంతరం జిల్లాలో మళ్లీ ర్యాగింగ్ భూతం వెలుగుచూసింది. జేఎన్టీయూ కళాశాల హాస్టల్ ర్యాగింగ్ కలకలం రేపుతోంది. సీనియర్ విద్యార్థుల హాస్టల్ కు జూనియర్ విద్యార్థులను పిలిపించుకొని అర్ధరాత్రి వరకు జూనియర్ విద్యార్తులతో అర్ధనగ్న డ్యాన్సులు చేయించినట్లు తెలుస్తోంది. సీనియర్ విద్యార్థుల వేధింపులు తాళలేక జూనియర్ విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ర్యాగింగ్ చేసిన 18 మంది సీనియర్ విద్యార్థులను ప్రిన్సిపాల్ సుజాత సస్పెండ్ చేశారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
ప్రిన్సిపాల్ ఏమన్నారంటే
'మూడు రోజుల క్రితం ఒకరిద్దరూ జూనియర్ విద్యార్థులు కనిపించలేదని వార్డెన్లు చెప్పారు. వాళ్ల కోసం హాస్టల్లో చూశాం. ఎక్కడా కనిపించేదు. సీనియర్ విద్యార్థుల హాస్టల్లో కూడా లేరు. కానీ రాత్రి 10 గంటల తర్వాత విద్యార్థులు తిరిగి హాస్టల్ కి వచ్చారు. ఈ ఘటనపై విచారణకు ఓ కమిటీ వేశాం. ఆ కమిటీలో విద్యార్థులు నిజంగా ర్యాగింగ్ చేశారా లేదా అనేది తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం మేరకు జూనియర్లతో మాట్లాడడానికి సీనియర్లు పిలిచారని అంటున్నారు. అది కూడా సరికాదు. అందుకు ఓ 18 మంది విద్యార్థులను గుర్తించాం. వాళ్లను సస్పెండ్ చేశాం.' - ప్రిన్సిపాల్ సుజాత
బోధన్ లో విద్యార్థిపై యాజమాన్యం దాడి
నిజామాబాద్ జిల్లా బోధన్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఫీజు రిసిప్ట్ అడిగినందుకు విద్యార్థిపై బోధన్ లోని ఉషోదయ కళాశాల యాజమాన్యం దాడి చేసింది. ఫీజు రశీదు అడిగినందుకే విద్యార్థిని చితకబాదినట్లు బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు. విద్యార్థి లోకేశ్ బోధన్ ఉషోదయ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. యాజమాన్యం కొట్టిన దెబ్బలకి విద్యార్థి లోకేష్ స్పృహ కోల్పోయాడు. ప్రాణాపాయ స్థితిలో నిజామాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో విద్యార్థి లోకేశ్ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని బోధన్ పోలీసులు అంటున్నారు.
ఎలాంటి ఫిర్యాదు అందలేదు : పోలీసులు
నిజామాబాద్ జిల్లా బోధన్ లోని ఉషోదయ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న లోకేష్ అనే విద్యార్థిని చితక బాధారు కాలేజీ యాజమాన్యం. కళాశాల ఫీజు కట్టిన లోకేష్ ఫీజు రశీదు అడిగినందుకు రూమ్ లో వేసి కొట్టారని లోకేష్ చెబుతున్నాడు. మొత్తం ఐదుగురు కలిసి తనను ఇష్టం వచ్చినట్లు కొట్టారని విద్యార్థి లోకేష్ ఆరోపిస్తున్నాడు. దెబ్బలకి లోకేష్ కాసేపు స్పృహ కోల్పోయాడు. ప్రస్తుతం లోకేష్ నిజామాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ విషయంపై పోలీసులకు ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.