Medchal News: పెళ్లి చేసుకుని బిడ్డను కని భార్యను వదిలేశాడు - 2 రోజులుగా భర్త ఇంటి ముందే బాధితురాలి మౌన పోరాటం
Wife Protest: తన భర్త తనకు అకారణంగా విడాకులు ఇస్తున్నారంటూ ఓ వివాహిత అతని ఇంటి ముందు ఆందోళనకు దిగారు. బిడ్డను కని తనను వదిలేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. మేడ్చల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
Wife Protest Infront Of Husband's House In Medchal District: కట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నాడు. ఓ బిడ్డను కనేందుకు భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలోనే ఆమెకు విడాకుల నోటీసులు ఇచ్చాడు. ఇది చూసి షాకైన భార్య.. అతని ఇంటికి వచ్చి నిలదీసింది. అత్తింటి వారు పట్టించుకోకపోవడంతో కాలనీవాసుల మద్దతుతో భర్త ఇంటి ముందు గత 2 రోజులుగా ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా (Medchal District) కుత్బుల్లాపూర్ మండలం సూరారం లక్ష్మీనగర్‌లో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీనగర్‌కు చెందిన మైనం భాస్కరరావు, విజయలక్ష్మి దంపతుల కొడుకుతో రమ్య అనే మహిళకు వివాహం జరిగింది.
కొద్ది రోజులు కాపురం సజావుగానే సాగిందని.. గర్భవతి అయిన తనను అబార్షన్ చేయించుకోవాలని తన భర్త ఒత్తిడి తెచ్చినట్లు బాధితురాలు రమ్య వాపోయారు. దీనికి తాను అంగీకరించకపోవడంతో ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లిన తనతో ప్రేమగా ఉంటూనే పథకం ప్రకారం విడాకులకు అప్లై చేసినట్లు తెలిపారు. తన బాబును చూసేందుకు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన 9 నెలల బాబు, తల్లిదండ్రులతో భర్త ఇంటికి రాగా.. అత్తమామలు బయటకు గెంటేసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారని చెప్పారు. దీంతో ఆమె తన గోడును కాలనీవాసులకు చెప్పి భర్త ఇంటి ముందు మౌన పోరాటానికి దిగారు. తనకు, తన కొడుకుకు న్యాయం చేయాలంటూ మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు.