(Source: ECI/ABP News/ABP Majha)
Kolkata Doctor Case: ట్రెయినీ డాక్టర్ హత్యాచారం కేసులో ఊహించని ట్విస్ట్, పోలీసుల వెర్షన్ ఇదీ
Kolkata Doctor Abused Case | కోల్‌కత్తాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ ట్రెయినీ డాక్టర్ అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసును కలకత్తా హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.
Kolkata doctor Murder Case | కోల్‌కత్తా: పశ్చిమబెంగాల్ లోని కోల్‌కతాలో ట్రెయినీ డాక్టర్ పై జరిగిన హత్యాచారం ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసన, ఆందోళన కొనసాగుతోంది. తమకు ప్రభుత్వాలు, పోలీసులు రక్షణ కల్పించాలని, దాంతోపాటు దారుణ హత్యకు గురైన డాక్టర్ కేసులో నిందితుడ్ని ఉరి తీయాలని వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ఆందోళన కొనసాగిస్తున్నారు. 31 ఏళ్ల డాక్టర్ మెడ విరిచేశాడని, శరీరంలో పలుచోట్ల ఎముకలు విరిగేలా దాడి చేసి, ఆపై అఘాయిత్యం జరిగిందని, ఆమె శరీరంలో 150 గ్రాముల స్పెర్మ్ ఉందని ప్రచారం జరిగింది. అంటే ఆమెపై జరిగింది అత్యాచారం కాదని, సామూహిక అత్యాచారం అని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు.
జూనియర్ డాక్టర్ పై ఘటనలో ప్రచారం అవుతున్న విషయాలపై పోలీసులు స్పందించారు. సోషల్ మీడియాలో, ప్రధాన మీడియాల్లో ప్రచారం అవుతున్న విషయాల్లో చాలా వరకు నిజం కాదని, ఆ వదంతుల్లో వాస్తవం లేదని కోల్‌కతా పోలీసులు కొట్టిపారేశారు. డాక్టర్ పోస్టుమార్టం ప్రక్రియ మేజిస్ట్రేట్ ఎదుట జరగగా, వీడియో తీశారు. అయితే ఆమె శరీరంలో ఎక్కడా ఎముకలు విరిగినట్లు పోస్టుమార్టం రిపోర్టులో లేదన్నారు కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినేశ్ గోయల్.. సామూహిక అత్యాచారం జరిగిందని, శరీరంలో దాదాపు 150 మిల్లీగ్రాముల వీర్యం ఉందన్న ప్రచారంలో నిజం లేదన్నారు. డాక్టర్ తల్లిదండ్రులు కోర్టులో వేసిన పిటిషన్ వల్లే చాలా వరకు వదంతులు పుట్టుకొచ్చాయన్నారు. వినేశ్ గోయల్ మాట్లాడుతూ.. ట్రెయినీ డాక్టర్ శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం గుర్తించారనేది నిజం కాదన్నారు. కొందరు ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ఈ కేసు వివరాలపై దుష్ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
ట్రెయినీ డాక్టర్ ది "అసహజ మరణం"గా పోలీసులు కేసు నమోదు చేయడం సైతం వివాదాస్పదమైంది. ఆసుపత్రి నుంచి పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై కలకత్తా హైకోర్టు ప్రశ్నించింది. ఎలాంటి ఫిర్యాదు రానప్పుడు అసహజ మరణం కేసు నమోదు చేయడం సాధారణ ప్రక్రియ అన్నారు. కేసు ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని తమపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
ఆమె తల్లిదండ్రులు కొందరు అనుమానితుల పేర్లను సీబీఐకి ఇచ్చారని, కొన్ని సోషల్ మీడియా పోస్టులతో సహచర డాక్టర్లను అనుమానితులుగా ప్రచారం జరిగింది. కానీ వాస్తవం ఏంటంటే.. ఇప్పటివరకూ ఒక్క వాలంటీర్ సంజయ్ రాయ్ పేరు మినహా ఏ ఇతర అనుమానితుల పేర్లను రికార్డుల్లో పేర్కొనలేదు. నిందితుడైన వాలంటీర్ ను పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
రాత్రివేళ ప్రభుత్వ ఆసుపత్రిలో పీజీ సెకండియర్ చదువుతున్న జూనియర్ డాక్టర్ విధుల్లో ఉన్నారు. కానీ అనూహ్యంగా మరుసటి రోజు ఉదయం 10 గంటలకు హాస్పిటల్ సెమినార్ హాలులో ఆమె అర్ధనగ్న స్థితిలో చనిపోయి కనిపించారు. దేశ వ్యాప్తంగా నిరసన, ఆందోళన జరగడంతో ఈ కేసును కలకత్తా హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది. నిందితుడికి ఉరిశిక్ష వేయాలంటూ సీఎం మమతా బెనర్జీ సైతం ర్యాలీలో పాల్గొన్నారు. కేసు దర్యాప్తు ఆదివారం లోపు పూర్తి చేయాలని సీబీఐకి, పోలీసులకు ఆమె అల్టిమేటం ఇచ్చారు.
Also Read: Kolkata Doctor Case: దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్, కోల్‌కత్తా ఘటనపై లక్షలాది మంది డాక్టర్ల నిరసన