Road Accident: ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్ - 12 మందికి గాయాలు, కి.మీ మేర నిలిచిన వాహనాలు
Telangana News: కొత్తగూడెం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం సమీపంలో ఆర్టీసీ బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Oil Tanker Collided RTC Bus In Kothagudem District: భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లాలో ఆర్టీసీ బస్సును ఓ ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 మందికి గాయాలు కాగా.. కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం (Khammam) డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు రాజమహేంద్రవరం వైపు బయలుదేరింది. ఈ క్రమంలో అటు నుంచి వస్తోన్న ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. సత్తుపల్లి మండలం కిష్టారం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు క్షతగాత్రులను సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆయిల్ ట్యాంకర్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌ను స్థానికుల సాయంతో బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో సుమారు కి.మీ మేర వాహనాలు నిలిచిపోగా.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ పునరుద్ధరించారు.