Year Ender 2022: 2022లో జరిగిన మెగా కొనుగోళ్లు &విలీనాలు
మన దేశంలో, ఈ కొనుగోళ్లు & విలీన కార్యకలాపాలు 2022 మొదటి తొమ్మిది నెలల్లో $148 బిలియన్ల ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
Year Ender 2022: ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ఎలోన్ మస్క్ ట్విట్టర్ డీల్ దగ్గర నుంచి, దాదాపు 69 సంవత్సరాల తర్వాత ఎయిర్ ఇండియాను టాటా సన్స్ తిరిగి దక్కించుకోవడం వరకు చాలా ఉత్సాహభరిత, ఆసక్తికర కొనుగోళ్లు & విలీనాలు (Mergers & Acquisitions లేదా M&As ) 2022 సంవత్సరంలో జరిగాయి. సాంకేతికత, ఆర్థికం, వినోదం సహా చాలా రంగాల్లో కొత్త సంస్థల కొనుగోళ్లు & విలీనాలు జరిగాయి. భవిష్యత్‌లో ఇవి చాలా మార్పులు తీసుకురానున్నాయి.
మన దేశంలో, ఈ కొనుగోళ్లు & విలీన కార్యకలాపాలు 2022 మొదటి తొమ్మిది నెలల్లో $148 బిలియన్ల ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 2021 మొత్తంలో జరిగిన M&As కంటే ఇది 58.2 శాతం ఎక్కువ. అంతకుముందు, 2018లో జరిగిన M&A డీల్స్ విలువ $132 బిలియన్లుగా, 2021 వరకు ఇదే రికార్డ్ గరిష్టంగా ఉంది. ఫైనాన్షియల్ సొల్యూషన్లను అందించే రీఫినిటివ్ (Refinitiv) ఈ డేటాను రిలీజ్ చేసింది.
2022లో జరిగిన కొన్ని మెగా డీల్స్ ఇవి:
ఎయిరిండియాను తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న వ్యాపార దిగ్గజం రతన్ టాటా ఆశయం 2022లో నెరవేరింది. JRD టాటా 1932లో టాటా ఎయిర్‌లైన్స్‌గా స్థాపించారు. ఆ తర్వాత జాతీయీకరణ వల్ల అది ప్రభుత్వపరం అయింది. దాదాపు 69 సంవత్సరాల తర్వాత దానిని కొనుగోలు చేసిన టాటాలు, తిరిగి టాటా గ్రూప్‌లోకి చేర్చారు. రుణాల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియా కొనుగోలు కోసం 2021 అక్టోబర్‌లో రూ. 18,000 కోట్లకు బిడ్ వేసి టాటా గ్రూప్ నెగ్గింది. 2022 జనవరిలో ఈ కంపెనీని భారత ప్రభుత్వం అధికారికంగా టాటా గ్రూప్‌నకు అప్పగించింది.
అతి పెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటైన ట్విట్టర్‌ను కొంటానని టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ 2022 ఏప్రిల్‌లో ప్రకటించారు. అనేక ట్విస్ట్‌ల మధ్య, కార్పొరేట్ & టెక్ చరిత్రలోనే ఇదొక డ్రామాటిక్ అక్విజిషన్‌గా నిలిచింది. 2022 అక్టోబర్‌లో ఈ డీల్‌ను మస్క్ పూర్తి చేశారు. ట్విట్టర్‌లో ఒక్కో షేరుకు $54.20 చెల్లించి, మొత్తం ధర సుమారు $44 బిలియన్లకు కొనుగోలు చేశారు. ఆ వెంటనే, CEO పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్, లీగల్ అఫైర్స్ & పాలసీ చీఫ్ విజయ గద్దె సహా టాప్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించారు. కొనుగోలు అనంతర ఖర్చులను తగ్గించేందుకు ఈ కంపెనీ అదే నెలలో దాదాపు 3,700 మందిని ఒక్క ఈ-మెయిల్ ద్వారా తొలగించింది.
గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్, న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్‌లో (NDTV) 29.18 శాతం వాటాను కొనుగోలు చేసింది. రెగ్యులేటరీ నిబంధనల ప్రకారం, పబ్లిక్ షేర్‌హోల్డర్ల నుంచి మరో 26 శాతాన్ని పొందేందుకు ఓపెన్ ఆఫర్ చేసింది. ఈ బిడ్‌ను ప్రతిఘటించడానికి ప్రయత్నించిన NDTV ప్రమోటర్లు, చివరకు తమ పదవులకు రాజీనామా చేశారు.
మల్టీప్లెక్స్ దిగ్గజాలు PVR, INOX లీజర్ విలీనాన్ని కూడా ఈ సంవత్సరం చూసింది. విలీనం ద్వారా మన దేశంలోనే అతి పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీగా విలీన సంస్థ అవతరిస్తుంది. సంయుక్త సంస్థకు PVR మరియు INOXగా కొనసాగడానికి ఇప్పటికే ఉన్న స్క్రీన్‌ల బ్రాండింగ్‌ను అలాగే కొనసాగిస్తారు. విలీనం తర్వాత ఓపెన్ అయ్యే కొత్త సినిమా హాళ్లు PVR INOX బ్రాండ్‌తో నడుస్తాయి.
స్విస్ సిమెంట్ మేజర్, ప్రపంచంలోనే అతి పెద్ద సిమెంట్ గ్రూప్ హోల్సిమ్ నుంచి అంబుజా సిమెంట్స్ & మరియు ACCని అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. ఈ కొనుగోలును పూర్తి చేసిన తర్వాత సిమెంట్ స్పేస్‌లో దేశంలో రెండో అతి పెద్ద సిమెంట్ తయారీదారుగా అదానీ గ్రూప్ అవతరించింది. అంబుజా సిమెంట్స్‌లో ఒక్కో షేరుకు రూ. 385 చొప్పున, ఏసీసీలో ఒక్కో షేరుకు రూ. 2,300 చొప్పున అదానీ గ్రూప్ చెల్లించింది. మొత్తం డీల్ విలువ 6.4 బిలియన్ డాలర్లు.
హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పోరేషన్ (HDFC), దాని అనుబంధ సంస్థ HDFC బ్యాంక్‌తో విలీనం మీద చాలా సంవత్సరాల ఊహాగానాలకు స్వస్తి పలికింది. మొదట.. HDFC ఇన్వెస్ట్‌మెంట్స్, HDFC హోల్డింగ్‌ను HDFCలో, ఆ తర్వాత HDFCని HDFC బ్యాంక్‌లో విలీనం చేయడానికి HDFC బ్యాంక్ బోర్డు ఆమోదించింది. ఈ రెండు ఎంటిటీల విలీనం విషయంలో ఏర్పడ్డ నిబంధనల అవరోధాలు ఒక 'కేస్ ఆఫ్ స్టడీ'గా మారాయి. 2023 రెండa త్రైమాసికంలో విలీనం పూర్తవుతుందని అంచనా. దీనివల్ల HDFC బ్యాంక్ దగ్గరున్న 16.7 లక్షల కోట్ల రూపాయల ($202 బిలియన్) ఫండ్స్‌ను వినియోగించుకోవడానికి HDFCకి వీలవుతుంది.