Women Bank Accounts: ఆకాశంలో సగం, బ్యాంకు డిపాజిట్లలో మాత్రం ఐదో వంతే!
మొత్తం డిపాజిట్ల విలువలో మహిళల డిపాజిట్ల విలువ ఐదో వంతు
Women and Men in India 2022: ప్రస్తుత కాలంలో మహిళలు రాజ్యాలేలుతున్నా, పురుషులతో పోలిస్తే ఇప్పటికీ స్త్రీ లోకం కాస్త వెనుకబడే ఉందన్నది కఠిన వాస్తవం. ఈ అసమానత పూర్తిగా తొలగిపోవడానికి మరికొన్ని దశాబ్దాలు పట్టవచ్చేమో!. ఇది అతివల వెనుకబాటు కాదు, పురుషాధిక్య సమాజపు గ్రహపాటు.
భారతదేశం డిజిటల్ ఇండియాగా రూపం మార్చుకుంటున్నా, ఏటా వేల కోట్ల రూపాయల డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నా.. బ్యాంకు ఖాతాల్లో మహిళల ప్రాతినిథ్యం తక్కువగా ఉంది. భారతదేశంలోని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల్లో (SCB) ఆడవారి పేరిట ఉన్న ఖాతాలు, మొత్తం ఖాతాల్లో 35.23% మాత్రమే. అయితే.. గత దశాబ్ద కాలంలో ఇది చాలా మెరుగుపడిందనే చెప్పుకోవాలి. కానీ, మొత్తం డిపాజిట్ల విలువలో మహిళల డిపాజిట్ల విలువ ఐదో వంతు, అంటే 20.07% మాత్రమే.
కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (Ministry of Statistics & Programme Implementation - MoSPI) ఆధ్వర్యంలో పని చేసే సామాజిక గణాంకాల విభాగం (Social Statistics Division - SSD) ఈ వివరాలు వెల్లడించింది. "ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2022 (ఏ స్టాటికల్ కాంపిలేషన్ ఆఫ్ జెండర్ రిలేటెడ్ ఇండికేటర్స్ ఆఫ్ ఇండియా)" పేరిట ఈ నివేదికను రిలీజ్ చేసింది.
రిపోర్ట్‌లోని కీలక అంశాలు:
SCBల వద్ద ఉన్న మొత్తం డిపాజిట్ ఖాతాల్లో మహిళల ఖాతాలు మూడింట ఒక వంతు కాగా, మొత్తం డిపాజిట్ల విలువలో ఆడవారి వాటా ఐదో వంతు మాత్రమే.
జనవరి 2023 చివరి నాటికి, SCBల్లో మొత్తం డిపాజిట్ ఖాతాల సంఖ్య 225.5 కోట్లుగా ఉండగా, వీటిలో 79.44 కోట్లు మహిళల యాజమాన్యంలో ఉన్నాయి.
జనవరి 2023 నాటికి SCBల్లో ఉన్న మొత్తం ఉద్యోగుల ఖాతాల్లో... ఆఫీసర్ల ఖాతాల్లో 22.97%, క్లర్క్‌ల ఖాతాల్లో 30.74%, సబార్డినేట్ల ఖాతాల్లో 16.40% మహిళలవి.
మేనేజర్ స్థాయి పదవుల్లోనూ తగ్గిన వాటా
పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) డేటా ప్రకారం, భారతదేశంలో మేనేజర్ స్థాయి పదవుల్లో పని చేసే మహిళల సంఖ్య తగ్గింది. 2020లో ఇది 18.8% గా ఉండగా, 2021లో 18.1% కు దిగి వచ్చింది. 2021లో, మేనేజర్ స్థాయి పదవుల్లో మహిళల వాటా మిజోరంలో (41.5%) అత్యధికంగా కనిపించింది. ఆ తరువాత సిక్కిం (32.5%), మణిపూర్ (31.19%), మేఘాలయ (30.9%), ఆంధ్రప్రదేశ్ (30.3%) ఉన్నాయి.
పంచాయతీ రాజ్ సంస్థలకు (PRIS) ఎన్నికైన ప్రతినిధులలో 45.6% మంది మహిళలు.
2020లో, మంత్రి మండలిలో స్త్రీల ప్రాతినిధ్యం 14.47%.
వేతనాల్లో అసమానత
PLFS ప్రకారం, జులై 2021 - జూన్ 2022 కాలంలో 16.5% మంది మహిళా కార్మికులు సాధారణ వేతనాలు లేదా జీతాలు అందుకున్నారు. అయితే పురుషుల విషయంలో ఇది 23.6%. అంటే, సాధారణ వేతనాల విషయంలోనూ అసమానతే. అంతేకాదు, జీతం రాని పనుల్లో, పురుషులతో పోలిస్తే, మహిళలు ఎక్కువ సమయం గడిపారు. ఉపాధి రంగంలోనూ మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉంది. ఈ నివేదిక ప్రకారం, పురుషులతో పోలిస్తే పని చేసే మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంది.
కార్మిక జనాభా నిష్పత్తి
2021-2022లో, వర్కర్ పాపులేషన్ రేషియోలో, పురుషులు గ్రామీణ ప్రాంతాల్లో 54.7 శాతం, పట్టణ ప్రాంతాల్లో 55 శాతంగా ఉన్నారు. కానీ మహిళల విషయంలో ఇది వరుసగా 26.6 శాతం, 17.3 శాతానికి పరిమితమైంది.
దేశంలో ఉపాధి పరిస్థితిని అంచనా వేయడానికి WPRని ఒక సూచికగా పరిగణిస్తారు.