Stocks To Watch 23 August 2023: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Brightcom, Jio Fin, Vodafone Idea
మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
Stock Market Today, 23 August 2023: NSE నిఫ్టీ నిన్న (మంగళవారం) 19,396 వద్ద క్లోజ్ అయింది. గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) ఇవాళ (బుధవారం) ఉదయం 8.00 గంటల సమయానికి 48 పాయింట్లు లేదా 0.25 శాతం గ్రీన్ కలర్‌లో 19,361 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
బ్రైట్‌కామ్ గ్రూప్: హైదరాబాద్‌కు చెందిన బ్రైట్‌కామ్ గ్రూప్ CMD సురేశ్ కుమార్ రెడ్డి, CFO నారాయణ్ రాజుపై సెబీ కొరడా ఝుళిపించింది. బ్రైట్‌కామ్ గ్రూప్ లిమిటెడ్ (BGL)లో లేదా దాని అనుబంధ సంస్థల్లో ఏ విధమైన యాజమాన్య హోదా/ డైరెక్టర్ పదవుల్లో కొనసాగకుండా నిషేధం విధిస్తూ రెండో మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది.
SJS ఎంటర్‌ప్రైజెస్: ప్రమోటర్ గ్రూప్‌లో భాగమైన ఎవర్‌గ్రాఫ్ హోల్డింగ్స్, మంగళవారం, కొన్ని బల్క్ డీల్స్ ద్వారా SJS ఎంటర్‌ప్రైజెస్‌లో కొంత స్టేక్‌ను విక్రయించింది. మొత్తం 91.6 లక్షల షేర్లను లేదా కంపెనీలో 29.5%ను సుమారు రూ. 549 కోట్లకు విక్రయించినట్లు ఎక్స్ఛేంజ్ డేటా ద్వారా తెలుస్తోంది. జూన్ త్రైమాసికం ముగింపులో దీనికి 34% వాటా ఉంది. HSBC, మోర్గాన్ స్టాన్లీ, ABSL MF, సుందరం మ్యూచువల్ ఫండ్, ICICI ప్రూ MF వంటి మార్క్యూ ఫండ్స్ ఆ షేర్లను కొన్నాయి.
అదానీ గ్రీన్ ఎనర్జీ: డైరెక్టర్ల బోర్డులో నియామకాలకు సంబంధించి నిబంధనలు సరిగా పాటించనందుకు అదానీ గ్రీన్ ఎనర్జీకి BSE, NSE తలో రూ. 2.24 లక్షల చొప్పున ఫైన్ విధించాయి. ముఖ్యంగా, బోర్డులో మహిళా డైరెక్టర్ లేకపోవడంపై స్టాక్ ఎక్సేంజీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.
హిందాల్కో: ఫ్రైట్ వ్యాగన్లు, కోచ్‌ల ఎక్స్‌ట్రాషన్ ఫెసిలిటీ కోసం, రాగి, ఈ-వేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్ల కోసం మొత్తం రూ. 4,000 కోట్ల పెట్టుబడి పెట్టాలని హిందాల్కో ఇండస్ట్రీస్ ప్లాన్ చేసింది.
BEML: భారత రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి 101 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్ దక్కించుకుంది. ఈ ఆర్డర్‌లో భాగంగా కమాండ్ పోస్ట్ వాహనాలను రక్షణ మంత్రిత్వ శాఖకు ఈ కంపెనీ సరఫరా చేస్తుంది.
పిరమాల్ ఎంటర్‌ప్రైజెస్: ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో డిబెంచర్ల జారీ ద్వారా రూ. 3,000 కోట్ల వరకు సమీకరించేందుకు పిరమాల్ ఎంటర్‌ప్రైజెస్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.
TVS సప్లై చైన్: ఈ నెల 10-14 తేదీల్లో ముగిసిన టీవీఎస్ సప్లై చైన్ ఓపీవో షేర్లు ఇవాళ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అవుతాయి. ఒక్కో షేరును ₹187 నుంచి ₹197 రేంజ్‌లో కంపెనీ కేటాయించింది. ఈ స్టాక్ ఇవాళ ఫ్లాట్‌గా లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.
జియో ఫైనాన్షియల్: సెన్సెక్స్‌తో సహా BSEలోని అన్ని కీలక సూచీల నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌ను తొలగించాలనే నిర్ణయం మరో 3 రోజులు వాయిదా పడింది.
వొడాఫోన్ ఐడియా: అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా, సెప్టెంబర్ నాటికి ప్రభుత్వానికి సుమారు రూ. 2,400 కోట్ల బకాయిలను చెల్లించడానికి ప్లాన్ చేస్తున్నట్లు PTI రిపోర్ట్ చేసింది.
ఇది కూడా చదవండి: సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ఫేస్‌బుక్ మెటా!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.