Fractional Ownership: లక్ష రూపాయల MRF షేర్‌ను రూ.10 వేలకు కూడా కొనొచ్చు, కొత్త కాన్సెప్ట్ గురూ!
స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ SEBI, ఇండియన్ మార్కెట్లలో పాక్షిక యాజమాన్యం (Fractional Ownership) కాన్సెప్ట్‌ను అమలు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తోంది.
Fractional Ownership Of Stocks: మన దేశంలోని ప్రముఖ టైర్ కంపెనీ MRF ఒక్కో షేర్ ధర లక్ష రూపాయల పైనే ఉంది. పేజ్ ఇండస్ట్రీస్ స్టాక్ కూడా దాదాపు రూ. 40,000 వద్ద ట్రేడ్ అవుతోంది. నెస్లే ఇండియా షేరు ప్రైస్ ఇప్పుడు రూ. 23,000 వద్ద ఉంది. ఖరీదైన రేట్ల కారణంగా చిన్న ఇన్వెస్టర్లు ఈ స్టాక్స్ గురించి ఆలోచించడం లేదు, వాటిలో పెట్టుబడలకు దూరంగా ఉంటున్నారు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మరికొన్నాళ్లలో, స్మాల్ ఇన్వెస్టర్లు కూడా MRF, పేజ్ ఇండస్ట్రీస్ వంటి ఖరీదైన షేర్లలో సులభంగా ఇన్వెస్ట్ చేయవచ్చు. స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ SEBI, ఇండియన్ మార్కెట్లలో పాక్షిక యాజమాన్యం (Fractional Ownership) కాన్సెప్ట్‌ను అమలు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఇది ఎగ్జిక్యూట్ అయితే, చిన్న ఇన్వెస్టర్లు కూడా పెద్ద షేర్లను కొనొచ్చు.
ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్ అంటే ఏమిటి?
పాక్షిక యాజమాన్యం కింద, పెట్టుబడిదారు ఏదైనా కంపెనీ షేర్‌లో కొంత భాగాన్ని కొనుగోలు చేయగలడు. ఉదాహరణకు, MRF ఒక్కో షేరు ఇప్పుడు లక్ష రూపాయలు అనుకుందాం. పెట్టుబడిదారు రూ. 25,000 చెల్లించి ఒక షేరులో 25 శాతం కొనుగోలు చేయగలడు. రూ.10,000 ఖర్చు చేస్తే షేరులో 10% అతని సొంతం అవుతుంది. అదేవిధంగా, దాదాపు రూ. 40,000గా ఉన్న పేజ్ ఇండస్ట్రీస్ షేర్‌లో 25 శాతం కొనాలనుకుంటే రూ. 10,000 పెట్టుబడి పెడితే సరిపోతుంది. ఈ కాన్సెప్ట్ వల్ల ఖరీదైన స్టాక్స్ కూడా స్మాల్ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోల్లో భాగం అవుతాయి.
పాక్షిక యాజమాన్యం ఎందుకు అవసరం?
ఇప్పుడు, ఒక పెట్టుబడిదారు వద్ద కేవలం రూ. 10,000 మాత్రమే ఉంది. అతనికి, MRF, పేజ్ ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా లాంటి షేర్లు కొనాలని ఆశ. తన దగ్గర ఉన్న డబ్బుతో ఆ షేర్లను అతను టచ్ చేయలేడు. డబ్బులు ఎక్కువగా ఉన్న ఇన్వెస్టర్లు మాత్రం వాటిని కొనగలరు. అంటే... డబ్బులు ఉన్న వాడికి ఒక విధంగా, డబ్బులు లేని వాడికి మరొక విధంగా మార్కెట్ అందుబాటులో ఉంటోంది. ఈ అసమానతను తగ్గించి అందరికీ సమాన న్యాయం జరిగేలా చూడాలన్నదే ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్ కాన్సెప్ట్ ఉద్దేశం. ఇది అమలైతే, MRF, పేజ్ ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా మాత్రమే కాదు... మారుతి సుజుకి, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా ఎలెక్సీ, టైటన్ షేర్లను కూడా ఏ వ్యక్తయినా తక్కువ పెట్టుబడితో సులభంగా కొనుగోలు చేసే అవకాశం వస్తుంది. ఫలితంగా, బ్లూ చిప్ స్టాక్స్ అతని పోర్ట్‌ఫోలియోలో ప్రత్యక్షం అవుతాయి.
అమెరికాలో అమలవుతున్న ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్ కాన్సెప్ట్
అమెరికాలోని కొన్ని ప్లాట్‌ఫామ్స్‌లో, పాక్షిక యాజమాన్య సౌకర్యం అందుబాటులో ఉంది. అక్కడ, డబ్బు తక్కువగా ఉన్నప్పటికీ ఆపిల్, యునైటెడ్ హెల్త్, మైక్రోసాఫ్ట్, వీసా వంటి ఖరీదైన స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.
ఇక స్టాక్ స్ల్పిట్ అవసరం ఉండదు
షేర్ల ధరలు పైస్థాయికి చేరి, చిన్న పెట్టుబడిదార్లు భరించలేని విధంగా మారినప్పుడు, ఆయా కంపెనీలు స్టాక్స్‌ను విభజించి (స్టాక్ స్ల్పిట్), వాటి ధర తగ్గిస్తుంటాయి. ఇటీవల, మారుతి సుజుకి స్టాక్‌ను విభజించాలని చాలామంది పెట్టుబడిదార్లు డిమాండ్ చేశారు. ఇప్పుడు, మారుతి స్టాక్ ప్రైస్ రూ. 10,400 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం, రూ. 10,000 కంటే ఎక్కువ షేర్ ప్రైస్ ఉన్న కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో 17 ఉన్నాయి. రూ.1,000 కంటే ఎక్కువ ధరలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ 300 ఉన్నాయి. పాక్షిక యాజమాన్యం అమల్లోకి వస్తే, కంపెనీలు తమ షేర్లను విభజించాల్సిన అవసరం ఉండదు. రిటైల్ ఇన్వెస్టర్లు ఆ షేర్లను ఈజీగా కొనగలుగుతారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ఫారిన్ ఇన్వెస్టర్లు పోతే పోనీ అన్నాయ్, మార్కెట్‌లో మన లెక్కలు మనకున్నాయ్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial