SEBI: సెబీ కీలక ఆదేశం - ఇది పాటించకుంటే మీరు ట్రేడ్ చేయలేరు
మీకు మరికొన్ని రోజులు మాత్రమే గడువుంది.
PAN Aadhaar Link: ఇండియన్ స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ 'సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా' (SEBI), మార్కెట్ ఇన్వెస్టర్లు అందరికీ ఒక హెచ్చరిక జారీ చేసింది. మార్చి 31, 2023 లోపు, అంటే ఈ నెలాఖరు లోగా, పాన్ - ఆధార్ నంబర్‌ను లింక్ చేయాలని పెట్టుబడిదార్లను ఆదేశించింది.
సెబీ ఆదేశాన్ని పాటించడంలో ఇన్వెస్టర్ లేదా ట్రేడర్ విఫలమైతే.. ఏప్రిల్ 1, 2023 నుంచి అతను మార్కెట్‌లో ఎలాంటి పెట్టుబడి పెట్టలేడు, రోజువారీ ట్రేడింగ్ కూడా చేయలేడు. SEBI హెచ్చరికలోని ముఖ్యాంశమిది. కాబట్టి, ఇప్పటికీ మీరు పాన్ - ఆధార్ నంబర్ లింక్ (PAN Aadhaar Link) చేయకపోతే, వీలైనంత త్వరగా ఆ పనిని పూర్తి చేయండి, మీకు మరికొన్ని రోజులు మాత్రమే గడువుంది.
నామినేషన్ కూడా పూర్తి చేయాల్సిందే..
అంతేకాదు, మీ డీమ్యాట్ అకౌంట్‌లో నామినేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేయాలని సెబీ ఆదేశించింది. అంటే, మీ డీమ్యాట్ అకౌంట్‌కు నామినీ పేరును మీరు జోడించాలి. దీనికి కూడా ఈ నెలాఖరు వరకే గడువు ఇచ్చింది. నామినీ లేని డీమ్యాట్ అకౌంట్లలో ట్రేడింగ్ నిలిపేస్తామని కూడా సెబీ హెచ్చరించింది.
అంటే, మార్కెట్‌లో మీరు ఉండాలంటే.. మీ పాన్ - ఆధార్ నంబర్‌ను అనుసంధానించాలి, మీ డీమ్యాట్ అకౌంట్ నామినేషన్ పనిని పూర్తి చేయాల్సిందే.
ఆదాయపన్ను విభాగం ఆదేశం కూడా ఇదే
పెట్టుబడిదార్లు మార్చి 31, 2023 లోపు తమ PANను ఆధార్‌తో లింక్ చేయకపోతే, ఆ పాన్‌ను నాన్-కేవైసీగా పరిగణిస్తామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) కూడా స్పష్టం చేసింది. ఈ నెలాఖరులోగా అనుసంధానం పూర్తి చేయకపోతే పాన్ ఇన్-యాక్టివ్ (PAN Inactive) అవుతుందంటూ ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ను ప్రస్తావిస్తూ, పెట్టుబడిదార్లు వీలైనంత త్వరగా వాళ్ల పాన్ - ఆధార్‌ను లింక్ చేయాలని సెబీ కోరింది. ఈ గడువును పొడిగించేది లేదని కూడా స్పష్టం చేసింది.
పెట్టుబడికి పాన్ కార్డ్ అవసరం
ఆదాయపు పన్ను చట్టం, 1961 నియమం ప్రకారం, శాశ్వత ఖాతా సంఖ్యను (PAN) కలిగి ఉన్న వ్యక్తులు UIDAI జారీ చేసిన ఆధార్ వివరాలను నమోదు చేయడం తప్పనిసరి. తద్వారా ఆధార్ - పాన్ లింక్ చేయవచ్చు. ఈ సమాచారాన్ని మార్చి 31, 2023లోపు సమర్పించడం తప్పనిసరి, లేకుంటే PAN నిష్క్రియంగా మారుతుంది. మార్చి 31 లోపు పాన్-ఆధార్ లింక్ చేయాలంటే రూ. 1,000 జరిమానా చెల్లించాలి. మార్చి 31 గడువు దాటిన తర్వాత ఈ పని చేయాలంటే, రూ. 10,000 జరిమానా చెల్లించాలి.
పాన్ & ఆధార్ లింక్ చేయడం ఎలా?
పాన్ - ఆధార్‌ను లింక్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ https://www.incometax.gov.in/iec/foportal/ ని సందర్శించండి.
Home బటన్ కింద Quick Links విభాగం మీకు కనిపిస్తుంది,
ఆ విభాగంలో ఉన్న Link Aadhaar మీద క్లిక్ చేయండి
కొత్త విండో ఓపెన్ అవుతుంది, ఆ విండోలో మీ పాన్, ఆధార్ వివరాలు నమోదు చేయండి.
ఆ తర్వాత, కింద కనిపించే Validate బటన్ మీద క్లిక్ చేయండి
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది, దానిని నమోదు చేసి సమర్పించండి.
జరిమానా చెల్లించిన తర్వాత, మీ పాన్ ఆధార్ నంబర్‌తో లింక్ అవుతుంది