Inflation: జూన్‌లో పెరిగిన రిటైల్ ఇన్‌ఫ్లేషన్ - వడ్డీ రేట్లు పెరిగే అవకాశం
ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే ప్రమాదం కనిపిస్తోంది కాబట్టి, RBI నుంచి ఉపశమనం లభిస్తుందన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి.
Retail Inflation Data For June 2023: దేశంలో, వరుసగా నాలుగు నెలలు తగ్గిన చిల్లర ద్రవ్యోల్బణం (Retail Inflation) మళ్లీ U-టర్న్ తీసుకుంది. ఆహార పదార్థాల ధరల్లో విపరీతమైన పెరుగుదల కారణంగా, ఈ ఏడాది జూన్ నెలలో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ రేట్ పెరిగింది. జూన్‌లో, వినియోగదారు ధరల సూచీ (Consumer Price Index - CPI) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రేట్ 4.81 శాతంగా రికార్డ్ అయింది. అంతకుముందు మే నెలలో ఇది 4.31 శాతంగా ఉంది. దేశంలో ధరలు, ముఖ్యంగా ఆహార పదార్థాల రేట్లు బాగా పెరిగాయి కాబట్టి, జూన్ నెలలో ద్రవ్యోల్బణం పెరుగుతుందని మార్కెట్ ముందుగానే అంచనా వేసింది.
ఖరీదైన ఆహార పదార్థాలు
కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల డేటా ప్రకారం... దేశంలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం రేట్ భారీగా పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం జూన్ నెలలో 4.49 శాతానికి పెరిగింది, మే నెలలో ఇది 2.96 శాతంగా ఉంది. గత ఏడాది జూన్ నెలలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 7.75 శాతంగా ఉంది.
మండుతున్న పప్పులు, కూరగాయల రేట్లు
కందిపప్పు సహా ఇతర పప్పు దినుసుల రేట్లు భారీగా పెరగడమే జూన్ నెలలో ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రధాన కారణం. ఈ ఏడాది మే నెలలో 6.56 శాతంగా ఉన్న పప్పుధాన్యాల ద్రవ్యోల్బణం, జూన్‌లో భారీగా పెరిగి 10.53 శాతానికి ఎగబాకింది. ఆకుకూరలు & కూరగాయల రేట్లు కూడా ద్రవ్యోల్బణం మంటకు ఆజ్యం పోశాయి. ఆకుకూరలు & కూరగాయల ద్రవ్యోల్బణం ఈ ఏడాది మే నెలలో -8.18 శాతంగా ఉంటే, జూన్‌లో -0.93 శాతానికి చేరింది. మసాల దినుసుల ద్రవ్యోల్బణం మే నెలలోని 17.90 శాతం నుంచి జూన్‌లో 19.19 శాతానికి పెరిగింది. మే నెలలో 8.91 శాతంగా ఉన్న పాలు & అనుబంధ ఉత్పత్తుల ధరలు ఇప్పటికీ 8.56 శాతంగా ఉన్నాయి. ఆహార ధాన్యాలు & సంబంధిత ఉత్పత్తుల ద్రవ్యోల్బణం మే నెలలో 12.65 శాతంగా ఉంటే, జూన్‌లో 12.71 శాతం నమోదైంది. అయితే, ఆయిల్ & ఫ్యాట్స్ ఇన్‌ఫ్లేషన్ మేలో -16.01 శాతం నుంచి జూన్‌లో -18.12 శాతానికి తగ్గింది. చక్కెర ఇన్‌ఫ్లేషన్ రేటు 3 శాతంగా ఉంది, ఇది గత నెలలో 2.51 శాతంగా ఉంది.
వడ్డీ రేట్లు పెరిగే అవకాశం
జూన్‌లో 4.81 శాతంగా ఉన్న రిటైల్ రిటైల్ ఇన్‌ఫ్లేషన్, RBI టాలరెన్స్ బ్యాండ్ 2-6 శాతంలోనే ఉంది. ఈ ఏడాది ఉత్తరాదిలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఖరీఫ్ పంటలు, కూరగాయల సాగుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఎల్‌నినో ముప్పు పొంచి ఉంది. ఈ పరిస్థితుల్లో, రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. ద్రవ్యోల్బణంపై యుద్ధం ఇంకా ముగియలేదని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్వయంగా చెప్పారు.
RBI MPC మీటింగ్ ఆగస్ట్ 8-10 తేదీల్లో జరుగుతుంది. వడ్డీ రేట్లపై MPC నిర్ణయం ఏంటన్నది 10వ తేదీ మధ్యాహ్నానికి తెలుస్తోంది. ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే ప్రమాదం కనిపిస్తోంది కాబట్టి, RBI నుంచి ఉపశమనం లభిస్తుందన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి.
మరో ఆసక్తికర కథనం: ‘చాట్‌జీపీటీ’కి పోటీగా మస్క్ మామ కొత్త కంపెనీ, పేరు xAI
Join Us on Telegram: https://t.me/abpdesamofficial