Reliance - METRO: రిలయన్స్-మెట్రో డీల్‌కు లైన్ క్లియర్, CCI ఆమోదం
రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 2,850 కోట్లను జర్మన్ కంపెనీ మెట్రో AGకి చెల్లిస్తుంది.
Reliance - METRO Cash Carry: మెట్రో క్యాష్ & క్యారీని దక్కించుకోవడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు (Reliance Industries) లైన్ క్లియర్ అయింది. జర్మన్ రిటైల్ కంపెనీ మెట్రో AGకి భారతదేశంలో ఉన్న హోల్‌సేల్ వ్యాపారాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేయడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ఆమోదం తెలిపింది.
రూ.2,850 కోట్ల డీల్
మెట్రో క్యాష్ & క్యారీ ఇండియాను ( METRO Cash & Carry India) రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (Reliance Retail Ventures Ltd -RRVL) రూ. 2,850 కోట్లకు కొనుగోలు చేస్తోంది.
రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్, ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అనుబంధంగా పని చేస్తున్న రిటైల్ కంపెనీ. మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో 100 శాతం ఈక్విటీని (మొత్తం కంపెనీని) కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 2,850 కోట్లను జర్మన్ కంపెనీ మెట్రో AGకి చెల్లిస్తుంది.
రిలయన్స్ చేతికి భారీ కస్టమర్ బేస్
భారతదేశంలో క్యాష్ & క్యారీ వ్యాపారాన్ని ప్రారంభించిన మొట్టమొదటి కంపెనీ మెట్రో AG. 2003లో ఈ బిజినెస్ స్టార్టయింది. ఈ కంపెనీకి ప్రస్తుతం 21 నగరాల్లో 31 పెద్ద స్టోర్లు ఉన్నాయి. ఇవన్నీ హోల్‌సేల్ స్టోర్లే. ఈ కంపెనీలో 3500 మంది ఉద్యోగులు ఉన్నారు. మెట్రో స్టోర్లలో పండ్లు, కూరగాయలు, కిరాణా, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, దుస్తులను అమ్ముతుంది. మెట్రో కస్టమర్లలో హోటళ్లు, రెస్టారెంట్లు, కార్యాలయాలు, కంపెనీలు, చిన్న రిటైలర్లు, కిరాణా దుకాణాలు ఉన్నాయి. ఈ కంపెనీ కోనుగోలుతో ఈ కస్టమర్లు, వాళ్ల వివరాలన్నీ రిలయన్స్ గుప్పిటలోకి వస్తాయి. మెట్రో స్టోర్లలో సగం దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి.
2021-22 ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ వరకు మెట్రో ఇండియా అమ్మకాలు రూ. 7,700 కోట్లు. మోర్గాన్ స్టాన్లీ లెక్క ప్రకారం... రిటైల్ రంగంలో మరింత విస్తరించడానికి రిలయన్స్‌కు ఈ కొనుగోలు సహాయపడుతుంది. ముఖ్యంగా, మెట్రో ఉన్న 10 ప్రధాన నగరాల్లోని 8 నగరాల్లో పాతుకుపోవచ్చు. కిరాణా దుకాణాలతో పాటు సంస్థాగత కస్టమర్ల బేస్‌ను దక్కించుకోవడానికి రిలయన్స్‌కు వీలు చిక్కుతుంది కాబట్టి, B2B మార్కెట్‌లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇదే సమయంలో, రిలయన్స్ దేశంలో దాదాపు 16,600 స్టోర్లను కలిగి ఉంది. మెట్రో స్టోర్ల బలమైన హోల్‌సేల్ వ్యాప్తి, రిలయన్స్ స్టోర్ల కార్యకలాపాలను మరింత బలోపేతం చేయగలదు.
ఇటీవలే కాంపా కోలా విడుదల
భారతదేశ రిటైల్ రంగంలో ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో ఉంది. తన కుర్చీ పునాదులను మరింత పటిష్ట పరుచుకునేందుకు అర్గానిక్ (సొంతంగా వృద్ధి చెందడం) మార్గం కంటే ఇన్-ఆర్గానిక్ (ఇతర కంపెనీలను చేజిక్కించుకోవడం ద్వారా వృద్ధి చెందడం) రూట్‌నే రిలయన్స్ నమ్ముకుంది. ఈ ప్లాన్‌లో భాగంగా చాలా కంపెనీలను ఇప్పటికే చేజిక్కించుకుంది, ఆయా విభాగాల్లో ఇప్పటికే పాతుకుపోయిన, ప్రాచుర్యం పొందిన బ్రాండ్లకు పోటీ ఇస్తోంది. ఇదే కోవలో... కొన్ని రోజుల క్రితమే కాంపా కోలాను మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. పెప్సీ (Pepsi), కోక-కోలాకు (Coca Cola) పోటీగా కాంపా బ్రాండ్‌ను తీసుకొచ్చింది.