RBI Report on Banking in India: బ్యాంకులు భళా - మెరుగుపడ్డ బ్యాలెన్స్ షీట్లు, తగ్గిన మొండి రుణాలు
షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ రెండంకెల వృద్ధితో పటిష్టంగా మారిందని కేంద్ర బ్యాంక్ తెలిపింది.
RBI Report on Banking in India: ఏడు సంవత్సరాల తర్వాత దేశంలోని బ్యాంకుల పరిస్థితి ఇప్పుడు మెరుగ్గా ఉందని, మొండి బకాయిలు (Gross Non Performing Assets - GNPAs) బాగా తగ్గాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. బ్యాంకుల ఆర్థిక ఆరోగ్యానికి సంబంధించి 'ట్రెండ్స్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా' (Trend and Progress of Banking in India) పేరిట ఒక నివేదికను కేంద్ర బ్యాంక్ విడుదల చేసింది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల (Scheduled Commercial Banks - SCBs) బ్యాలెన్స్ షీట్ రెండంకెల వృద్ధితో పటిష్టంగా మారిందని కేంద్ర బ్యాంక్ తెలిపింది. రుణ వృద్ధి దీనికి దోహదం చేసిందని తన రిపోర్ట్‌లో రిజర్వ్ బ్యాంక్ (RBI) పేర్కొంది. ఏడేళ్ల తర్వాత ఇలా రెండంకెల వృద్ధిని బ్యాంకులు సాధించినట్లు జరిగింది.
GNPAs తగ్గడం వృద్ధి సూచకం
2017-18 ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠానికి చేరిన భారతీయ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు (GNPAs), 2022 సెప్టెంబర్‌లో ఐదు శాతానికి దిగి వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ తన నివేదికలో తెలిపింది. అయితే... ప్రస్తుత స్థూల ఆర్థిక పరిస్థితులు బ్యాంక్‌ల మీద ప్రభావం చూపించే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. 2021-22 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బ్యాంకుల GNPAs 5.8 శాతంగా ఉందని ఆర్‌బీఐ నివేదిక వెల్లడించింది.
ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణాలను మాఫీ చేయడం GNPAs తగ్గడానికి ప్రధాన కారణం. కాగా, ప్రైవేట్ బ్యాంకుల విషయంలో రుణాల అప్‌గ్రేడ్ కారణంగా పరిస్థితి మెరుగుపడింది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రైవేట్ బ్యాంకుల మొండి బకాయిలు స్థిరంగా తగ్గడానికి కారణం... లోన్ డిఫాల్ట్‌లను తగ్గించడం, రుణాల రికవరీలో వృద్ధి, మొండి బకాయిలను రద్దు చేయడం (రైటాఫ్) వంటివి.
పెరిగిన విదేశీ బ్యాంకుల బ్యాడ్ లోన్స్
RBI నివేదిక ప్రకారం... మెరుగైన ఆస్తుల నాణ్యత, బలమైన మూలధనం కారణంగా భారతీయ బ్యాంకింగ్ రంగం ప్రస్తుతం పటిష్టంగా ఉంది. ఇండియన్ బ్యాంకులకు వ్యతిరేకంగా, 2021-22 ఆర్థిక సంవత్సరంలో విదేశీ బ్యాంకుల మొండి బకాయిలు 0.2 శాతం నుంచి 0.5 శాతానికి పెరిగాయి.
మొత్తం రుణాల్లో.. భారీ రుణం తీసుకునే వాళ్ల సంఖ్య తగ్గింది. రూ. 5 కోట్ల పైన రుణం తీసుకున్న ఖాతాలు 2020-21లో 48.4 శాతంగా ఉండగా, 2021-22లో అవి 47.8 శాతానికి తగ్గాయి. ఇదే కాలంలో... మొత్తం NPAల్లో భారీ రుణ ఖాతాల NPAలు 66.4 శాతం నుంచి 63.4 శాతానికి తగ్గాయి.
పునర్నిర్మాణ ఆస్తుల నిష్పత్తి (Asset Reconstruction Ratio) రుణగ్రహీతలకు 1.1 శాతం, పెద్ద రుణగ్రహీతలకు 0.5 శాతం పెరిగింది. దీనివల్ల వ్యక్తులు & చిన్న వ్యాపారస్తులకు ఇచ్చే రుణాలు (రిటైల్ లోన్స్) పెరిగాయి. రిటైల్ వ్యాపారానికి ఇచ్చిన రుణాల పెరుగుదల పెద్ద రుణగ్రహీతల మీద బ్యాంకులు ఆధారపడటాన్ని తగ్గించింది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య బ్యాంకుల కొత్త శాఖల ఏర్పాటు 4.6 శాతం పెరిగిందని తన నివేదికలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. అంతకుముందు వరుసగా రెండేళ్ల క్షీణత తర్వాత, 2021-22 ఆర్థిక సంవత్సరంలో కొత్త శాఖల ఏర్పాటులో వృద్ధి కనిపించింది.