Bank Locker New Rules: బ్యాంక్ కష్టమర్లకు పెద్ద ఊరట, లాకర్ కొత్త అగ్రిమెంట్ల గడువు పెంపు
అగ్రిమెంట్ చేసుకోని కారణంగా తాత్కాలికంగా నిలిపేసిన ఖాతాదార్ల లాకర్లలో కార్యకలాపాలను తక్షణమే పునరుద్ధరించాలి.
Bank Locker New Rules: బ్యాంక్ లాకర్ కొత్త నిబంధనలకు సంబంధించిన అగ్రిమెంట్ గడువును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పొడిగించింది.
బ్యాంక్ లాకర్లకు సంబంధించి, ఆయా బ్యాంకులు కొన్ని సొంత షరతులను వర్తింపజేస్తున్నాయి. ఆ రూల్స్ దాదాపుగా బ్యాంకులకే అనుకూలంగా ఉన్నాయి, కస్టమర్ ప్రయోజనాలు పరిమితంగా ఉన్నాయి. లాకర్ ఇవ్వాలంటే పెద్ద మొత్తంలో డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని, లేదంటే ఇన్సూరెన్స్ తీసుకోవాలని కొన్ని బ్యాంకులు డిమాండ్ చేస్తున్నాయి. స్వప్రయోజనాల కోసం ఇలాంటి మరికొన్ని రూల్స్‌ను కూడా బలవంతంగా ఖాతాదార్ల నెత్తిన రుద్దుతున్నాయి.
ఇలాంటి ఇబ్బందికర వాతావరణం నుంచి ఖాతాదార్లను కాపాడేందుకు, 2021 ఆగస్టు 8న ఆర్‌బీఐ కొత్త రూల్స్ ఫ్రేమ్ చేసింది. లాకర్ వినియోగించుకుంటున్న ఖాతాదారులతో "కొత్త నిబంధనలతో కూడిన ఒప్పందాలను" ఇకపై బ్యాంకులు కుదుర్చుకోవాలి. దీనికి, 2023 జనవరి 1ని గడువుగా గతంలో రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. అయితే... కొత్త ఒప్పందంపై పెద్ద సంఖ్యలో కస్టమర్లు సంతకాలు చేయలేదని తమ దృష్టికి వచ్చిందని ఆర్బీఐ తెలిపింది. లాకర్లు కొనసాగించాలంటే జనవరి 1, 2023 లోపు కొత్త ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుందని బ్యాంకులు కూడా కొంతమంది కష్టమర్లకు తెలియజేయలేదు. ఈ నేపథ్యంలో, కొత్త అగ్రిమెంట్ చేసుకోవాల్సిన గడువును 2023 డిసెంబరు 31కి పొడిగిస్తున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. ఇందుకోసం, దశల వారీ కార్యక్రమాన్ని బ్యాంకులను సూచించింది.
లాకర్ ఒప్పందాలపై దశల వారీ కార్యక్రమం:
కొత్త అగ్రిమెంట్ చేసుకోవాల్సిన అవసరాన్ని 2023 ఏప్రిల్ 30 లోపు ప్రతి ఖాతాదారుకు బ్యాంక్‌లు తెలియజేయాలి.
2023 జూన్ 30 కల్లా 50 శాతం లాకర్ వినియోగదార్లతో బ్యాంకులు ఒప్పందాలు పూర్తి చేయాలి.
2023 సెప్టెంబరు 30 నాటికి 75 శాతం మందితో ఒప్పందాలు పూర్తి కావాలి.
2023 డిసెంబరు 31 నాటికి 100 శాతం ఒప్పందాలు పూర్తి కావాలి.
ఆర్‌బీఐ నోటిఫికేషన్ ప్రకారం... కొత్త అగ్రిమెంట్ చేసుకోవడానికి స్టాంప్ పేపర్లు ఏర్పాటు చేయడం, ఫ్రాంకింగ్, ఎలక్ట్రానిక్ అగ్రిమెంట్ల అమలు కోసం ఈ-స్టాంపింగ్, కస్టమర్‌లకు అగ్రిమెంట్‌ల కాపీలను అందించడం వంటి వాటిని సులభతరం చేయడానికి బ్యాంకులు మరిన్ని చర్యలు తీసుకోవాలి. జనవరి 1, 2023 నాటికి అగ్రిమెంట్ చేసుకోని కారణంగా తాత్కాలికంగా నిలిపేసిన ఖాతాదార్ల లాకర్లలో కార్యకలాపాలను తక్షణమే పునరుద్ధరించాలి. దీంతో పాటు, లాకర్ నిబంధనల మార్పు గురించి కస్టమర్లకు SMS, ఇతర మార్గాల ద్వారా వెంటనే తెలియజేయాలి.
లాకర్ కొత్త ఒప్పందంలో ఏముంది?
కొత్త ఒప్పందం ప్రకారం.. లాకర్‌లో వినియోగదారు దాచుకున్న వస్తువులు పాడైతే బ్యాంకుదే బాధ్యత. కొత్త నిబంధన ప్రకారం, ఏదైనా నష్టం జరిగితే, ఈ బాధ్యత నేరుగా బ్యాంకుదే మరియు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు ఉద్యోగి మోసం చేయడం వల్ల ఖాతాదారు నష్టపోతే, లాకర్ అద్దెకు 100 రెట్లు బ్యాంకుకు చెల్లించాలి. గతంలో... కస్టమర్ల నుంచి మూడు సంవత్సరాల లాకర్ అద్దెను బ్యాంకులు ఒకేసారి వసూలు చేయవచ్చు. ఇకపై అలా అద్దె వసూలు చేయలేరు. బ్యాంకులు ఖాతాదారులకు ఖాళీ లాకర్ల జాబితా, వెయిటింగ్ లిస్ట్‌ను చూపించాలి. అలాగే లాకర్లు ఉంచే చోట సరైన భద్రత ఏర్పాట్లు ఉండేలా చూసుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనల ప్రకారం, బ్యాంకులు ఎలాంటి అన్యాయమైన నిబంధనలను కస్టమర్ల మీద రుద్దకూడదు. లాకర్ సదుపాయాన్ని తీసుకునే కస్టమర్ మరణిస్తే, కొత్త ఒప్పందం ప్రకారం, నామినీకి లాకర్ సౌకర్యం లభిస్తుంది. దీంతోపాటు.. అవసరమైన సందర్భంలో లాకర్‌లోని వస్తువులను చట్టబద్ధ సంస్థలు స్వాధీనం చేసుకునే అంశం మీద కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి.
బ్యాంకులకు నష్ట బాధ్యత ఉండని సందర్భాలు
కొత్త నిబంధనల ప్రకారం... కొన్ని సందర్భాల్లో కస్టమర్ లాకర్ నష్ట బాధ్యతను బ్యాంకు తీసుకోదు. భూకంపం, తుపాను, కొండ చరియలు విరిగిపడటం వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల లాకర్ ప్రభావితమైతే, ఆ నష్టానికి బ్యాంకు బాధ్యత వహించదు. స్వయంగా ఖాతాదారు వల్ల లాకర్ లేదా లాకర్‌లోని వస్తువులు పాడైతే బ్యాంకు ఎలాంటి బాధ్యత వహించదని కొత్త నిబంధనల్లో RBI పేర్కొంది.