Nykaa shares: పేరుకేమో ఫేమస్ బ్యూటీ కంపెనీ, షేరు కొన్నవాళ్లు బకరాలు
7% పతనంతో రూ. 128.50 వద్ద ఈ షేర్లు 52 వారాల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి, ఇదే ఈ స్టాక్ జీవిత కాల కనిష్ట స్థాయి (all time low level) కూడా.
Nykaa shares: పేరుకేమో ఫేమస్ బ్యూటీ కంపెనీ. ఆ కంపెనీ షేర్లేమో ఇన్వెస్టర్ల మొహానికి మసి పూస్తున్నాయి. మీకు అర్ధమయ్యే ఉంటుంది. నైకా (Nykaa) కంపెనీ గురించే ఈ ఉపోద్ఘాతం. ఈ కంపెనీ, 2021 నవంబర్ 10వ తేదీన స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. లిస్టింగ్ సమయం నుంచి ఇప్పటి వరకు Nykaa షేర్లు అతి భారీగా క్షీణించాయి.
Nykaa బ్రాండ్‌తో బిజినెస్ చేస్తున్న ఎఫ్‌ఎస్‌ఎన్ ఈ-కామర్స్ వెంచర్స్ లిమిటెడ్ (FSN E-Commerce Ventures Ltd) షేర్లు ఇవాళ్టి (బుధవారం, 18 జనవరి 2023) ట్రేడ్‌లో, BSEలో, 7% పతనంతో రూ. 128.50 వద్ద ఈ షేర్లు 52 వారాల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి, ఇన్వెస్టర్ల నోట్ల మట్టి కొట్టాయి. ఇదే ఈ స్టాక్ జీవిత కాల కనిష్ట స్థాయి (all time low level) కూడా.
లిస్టింగ్ సమయం నుంచి పతనమే తప్ప, పెరగడం తెలీని కౌంటర్ నైకా. గత ఐదు రోజుల్లో ఇది 16 శాతం నష్టం కలిగించింది. గత నెల రోజుల్లో 22 శాతం పడిపోయింది.
షేర్లు కొన్నవాళ్లు మటాష్
నైకాలో ప్రి-ఐపీవో పెట్టుబడి సంస్థలు, ఏడాది లాక్-ఇన్ పిరియడ్ తర్వాత, 2022 నవంబర్, డిసెంబర్‌లో నెలల్లో భారీగా అమ్మకాలకు దిగాయి. గోల్డ్‌మన్ సాక్స్, మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ వంటివి బ్లాక్ డీల్స్‌లో ఈ షేర్లను కొన్నాయి. మీడియా నివేదికల ప్రకారం, కొన్ని రోజుల క్రితం, వీటిలో ఒక కంపెనీ 26 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను, ఒక్కో షేరుకు రూ. 148.90 చొప్పున విక్రయించింది. ఈ కంపెనీ షేర్లు ఎప్పటికైనా పెరగకపోతాయా అని ఆశగా ఎదురు చూస్తున్న ఇన్వెస్టర్లు బకరాలుగా మిగిలిపోతున్నారు.
2021 నవంబర్‌లో లిస్ట్ అయిన నైకా షేర్లు, అప్పటి నుంచి ఇప్పటి వరకు 67 శాతం క్షీణించాయి. దీంతో.. పేటీఎం, జొమాటో, PB ఫిన్‌టెక్, డెలివరీ వంటి నష్టజాతక స్టాక్స్ లిస్ట్‌లోకి నైకా కూడా చేరింది.
రెండో త్రైమాసికంలో లాభం
2022 సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ కంపెనీ లాభాలను నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలోని (YoY) రూ. 1 కోటి లాభం నుంచి, Q2లో రూ. 5 కోట్ల లాభాన్ని ఆర్జించింది. GMV (Gross Merchandise Value) కూడా, FY23 రెండో త్రైమాసికంలో 45 శాతం పెరిగి రూ. 2,345.7 కోట్లకు చేరుకుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.