NTPC Green Share Price: ఏకంగా 31 శాతం పడిన ఎన్‌టీపీసీ గ్రీన్ షేర్లు - మొదటిసారిగా ఇష్యూ ధర కంటే దిగువకు పతనం
NTPC Green Energy Stock Price: ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ స్టాక్, IPO లిస్టింగ్ తర్వాత 155.35 రూపాయల వద్ద ఏడాది గరిష్టానికి చేరుకుంది. ఆ స్థాయి నుంచి ఇప్పుడు దిగి వచ్చింది, దాదాపు 31 శాతం పడిపోయింది.

NTPC Green Energy News: రెండు నెలల క్రితం, 27 నవంబర్ 2024న, స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లో ఆర్భాటంగా లిస్ట్ అయి & దూసుకెళ్లిన ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ షేర్లు ఇప్పుడు డీలా పడ్డాయి. మార్కెట్‌లలో లిస్ట్ అయిన తర్వాత మొదటిసారిగా, NTPC గ్రీన్ ఎనర్జీ షేర్ ధర దాని ఇష్యూ ధర కంటే దిగువకు పడిపోయింది. విదేశీ ఇన్వెస్టర్ల (FPIే) భారీ విక్రయాల కారణంగా స్టాక్ మార్కెట్ నేల చూపులు చూస్తుండగా, ఆ వ్యతిరేక పవనాలతో ఎన్‌టీపీసీ0 గ్రీన్ ఎనర్జీ షేర్లు కూడా భారీగా పడిపోయాయి.
లిస్టింగ్ తర్వాత మొదటిసారి ఇష్యూ ధర కంటే దిగువకు..
ఈ రోజు (సోమవారం, 27 జనవరి 2025) ట్రేడింగ్ సెషన్‌లో, NTPC గ్రీన్ ఎనర్జీ 4.38 శాతం క్షీణించి రూ. 107.40 స్థాయికి (ఇంట్రాడే కనిష్ట స్థాయి) చేరుకుంది. దీంతో, NTPC గ్రీన్ ఎనర్జీ షేర్లు లిస్టింగ్ తర్వాత మొదటి ఇష్యూ ధర రూ. 108 కంటే దిగువకు పడిపోయాయి. గత సెషన్‌లో (శుక్రవారం) ఈ షేర్ ప్రైస్ రూ. 112.32 వద్ద ముగిసింది. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ మార్కెట్ విలువ (NTPC Green Energy Market Value Cap) కూడా దాదాపు రూ. 91,000 కోట్లకు పడిపోయింది.
గరిష్ట స్థాయి నుంచి 31 శాతం పతనం
NTPC గ్రీన్ ఎనర్జీ ఐపీవోకు స్టాక్ మార్కెట్‌లో మంచి బజ్ ఏర్పడింది. ఈ ఇష్యూ ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. 27 నవంబర్ 2024న, ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ స్టాక్, రూ. 108 ఇష్యూ ధర కంటే 3.24 శాతం అధికంగా రూ. 111.50 వద్ద స్టాక్ మార్కెట్లలో (NSE & BSE) లిస్ట్ అయింది. లిస్టింగ్ తర్వాతి నుంచి కొనుగోళ్ల జాతరను చూసింది. ఐపీవోలో షేర్లు దక్కించుకోలేకపోయిన ఇన్వెస్టర్లు, లిస్టింగ్ తర్వాత ఈ కంపెనీ షేర్ల కోసం ఎగబడ్డారు, విపరీతంగా కొనుగోళ్లు చేపట్టారు. దీంతో, ఈ స్టాక్ ధర గరిష్టంగా రూ. 155.35 కు (NTPC Green Energy Shares 52-wk high) చేరుకుంది. ఇప్పుడు, ఆ గరిష్ట స్థాయి నుంచి దాదాపు 31 శాతం పడిపోయింది.
ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ, గత ఏడాది ఐపీఓ ద్వారా రూ. 10,000 కోట్లు సమీకరించింది. ఈ IPO 2024 నవంబర్ 19 నుంచి 22 వరకు ఓపెన్‌లో ఉంది. రూ. 10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరు ధరను IPO కోసం రూ. 102-109 గా కంపెనీ నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్లు, ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (Qualified Institutional Buyers) ఆసక్తి ప్రదర్శించారు. దీంతో, ఈ IPO 2.55 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. అయితే.. NTPC గ్రీన్ ఎనర్జీ ఎనర్జీ IPO ప్రైస్ బ్యాండ్ గురించి మార్కెట్‌లో అసహనం వ్యక్తమైంది. చాలా ఎక్కువ వాల్యుయేషన్స్ నిర్ణయించారంటూ ఇన్వెస్టర్లు విమర్శించారు. IPOలో షేర్లు దక్కించుకున్న ఇన్వెస్టర్ల లాభాలు ఇప్పుడు కనుమరుగయ్యాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ట్రంప్ భయాలు పటాపంచలు, చివురిస్తున్న కొత్త ఆశలు - భారత్ నుంచి USకు పెరిగిన ఎగుమతులు





















