Stock Market News in Telugu: డేంజర్ బెల్స్, అలా జరిగితే స్టాక్ మార్కెట్‌లో మహా పతనం, ముందుంది మొసళ్ల పండుగ!
Stock Markets News: ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంలో ఎన్నికలు జరగనున్నందున, $3.7 ట్రిలియన్ల విలువైన భారత స్టాక్ మార్కెట్‌లో (Indian stock market) మార్పులు వచ్చే అవకాశం ఉందని వాల్‌స్ట్రీట్ బ్యాంక్ చెబుతోంది.
Loksabha Elections 2024 Effect On Indian Stock Market: మరో ఆరు నెలల్లో దేశంలో అతి పెద్ద ఈవెంట్ ఉంది, ప్రజలందరి ప్రయోజనాలతో అది ముడిపడి ఉంది. అదే.. ఏప్రిల్-మే 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలు (2024 Loksabha Elections). ఈ ఎన్నికలపై స్టాక్ మార్కెట్‌కు కూడా చాలా ఆసక్తి ఉంటుంది. ఇన్వెస్టర్ల అంచనాలకు అనుగుణంగా ఎన్నికల ఫలితాలు రాకపోతే, మార్కెట్ మీద అతి ప్రతికూల ప్రభావం చూపుతుంది.
మార్కెట్ 30% పతనమయ్యే అవకాశం!
2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మార్కెట్ అంచనాలను అందుకోకపోతే, భారత స్టాక్ మార్కెట్ 30 శాతం వరకు పతనమయ్యే అవకాశం ఉందని మోర్గాన్ స్టాన్లీ (Morgan Stanley) లెక్కగట్టింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంలో ఎన్నికలు జరగనున్నందున, $3.7 ట్రిలియన్ల విలువైన భారత స్టాక్ మార్కెట్‌లో (Indian stock market) మార్పులు వచ్చే అవకాశం ఉందని వాల్‌స్ట్రీట్ బ్యాంక్ చెబుతోంది.
"కాంగ్రెస్ నేతృత్వంలో I.N.D.I.A. పేరిట ఏర్పడిన ప్రతిపక్ష కూటమిలో కుదిరిన సీట్ల ఒప్పందం సార్వత్రిక ఎన్నికల్లో వేడిని చల్లబరుస్తుంది, మే నెలలో వెల్లడయ్యే ఫలితాల అంచనాలను కూడా తగ్గిస్తుంది” అని, మోర్గాన్ స్టాన్లీ స్ట్రాటెజిస్ట్ ఒక నోట్‌లో రాశారు. ఇన్వెస్టర్ల అంచనాలకు విరుద్ధంగా ఫలితాలు వస్తే మార్కెట్ 30 శాతం మేర జారిపోవచ్చని అంచనా వేశారు.
లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రభుత్వం మారితే, పరిపాలన శైలితో పాటు విధాన సంస్కరణల్లోనూ మార్పు ఉంటుందని, ఇది పెట్టుబడిదార్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తుందని మోర్గాన్ స్టాన్లీ స్ట్రాటెజిస్ట్ నోట్‌లో ఉంది. అయితే, మోర్గాన్ స్టాన్లీ మరో అంచనాను కూడా వెలువరించింది. వచ్చే ఎన్నికల్లో, నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ (BJP) మెజారిటీ సంపాదిస్తుందని, దీనివల్ల 2024లో BSE సెన్సెక్స్ 14 శాతం పెరుగుతుందని లెక్కవేసింది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో NDA ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి రాకపోతే మార్కెట్ మట్టికరిచే అవకాశం ఉందని జెఫరీస్‌కు చెందిన క్రిస్టోఫర్ ఉడ్ కూడా గతంలో అంచనా వేశారు. భారత స్టాక్ మార్కెట్ 25 శాతం కుప్పకూలవచ్చని, అయితే అలాంటి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయని ఉడ్ చెప్పారు.
గత ఎన్నికల సమయంలో స్టాక్ మార్కెట్ ఇలా స్పందించింది
2014 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 16 మే 2014న వెలువడ్డాయి. ఓట్ల లెక్కింపు తర్వాత, నరేంద్ర మోదీ నాయకత్వంలో అత్యధిక మెజారిటీతో కేంద్రంలో NDA ప్రభుత్వం ఏర్పడబోతోందని స్పష్టమైంది. ఆ రోజు, తొలిసారిగా, BSE సెన్సెక్స్ 25,000 స్థాయిని విజయవంతంగా దాటింది, 1450 పాయింట్లకు పైగా ఎగబాకింది. NSE నిఫ్టీ కూడా తొలిసారిగా 7,500 స్థాయిని అధిగమించింది.
2019 లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున, నరేంద్ర మోదీ నేతృత్వంలోని NDA ప్రభుత్వం రెండోసారి పగ్గాలు చేపడుతుందన్న సూచనలు వెలువడ్డాక, సెన్సెక్స్ తొలిసారిగా 40,000 మార్కును దాటింది. నిఫ్టీ చారిత్రక రికార్డు స్థాయి 12,000 మార్క్‌ను ఓవర్ టేక్ చేసింది.
గత చరిత్రకు అనుగుణంగా 2024లోనూ ఇండియన్ స్టాక్స్ పెరగవచ్చని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేస్తున్నప్పటికీ, పెట్టుబడిదారుల అంచనాలకు అందని ఫలితం వస్తే ఇండియన్ ఈక్విటీ బెంచ్‌మార్క్స్‌లో 30% పతనం తప్పదని అంటోంది.
కార్పొరేట్ ఆదాయాలు, దేశ ఆర్థిక వృద్ధి కలిసి లోకల్ & గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడంతో, ఈ సంవత్సరంలో (2023) ఇండియన్ స్టాక్స్ 7% పెరిగాయి. ఆసియా మార్కెట్లతోపాటు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లను దాటి ముందుకు వెళ్లాయి. షేర్ ధరల ఒడిదొడుకుల్లోని రిస్క్‌ను సూచించే ఇండియా విక్స్ (India VIX), ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 25% పడిపోయి క్షీణించి చారిత్రక కనిష్ట స్థాయికి చేరుకుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: బికనీర్‌వాలా కాకాజీ కన్నుమూత, ఆయన జీవితం సినిమా స్టోరీకి తగ్గదు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial