LIC IPO: ఎల్‌ఐసీలో.. చైనా పెట్టుబడులు అడ్డుకొనే దిశగా కేంద్రం అడుగులు
ఎల్‌ఐసీలో చైనా ఇన్వెస్టర్లు షేర్లు కొనుగోలు చేయకుండా అడ్డుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇందుకు గల మార్గాలను అన్వేషిస్తున్నట్టు తెలిసింది.
భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీలో చైనా ఇన్వెస్టర్లు షేర్లు కొనుగోలు చేయకుండా అడ్డుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇందుకు గల మార్గాలను అన్వేషిస్తున్నట్టు తెలిసింది. రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించడంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం.
భారత జీవిత బీమా మార్కెట్లో ఎల్‌ఐసీ వాటా దాదాపుగా 60 శాతానికి పైగానే ఉంటుంది. 500 బిలియన్ డాలర్లకు పైగానే ఈ సంస్థకు ఆస్తులు ఉన్నాయి. కొన్నాళ్లుగా ఐఎల్‌సీలో కొంతమేర వాటాను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 12.2 బిలియన్ డాలర్ల విలువతో ఐపీవోకు రానుంది. ఐపీవోకు విదేశీ ఇన్వెస్టర్లనూ అనుమతించాలని అనుకుంటోంది. బడ్జెట్ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు వచ్చే ఏడాది మార్చిలోపు ఎల్‌ఐసీలో 5-10 శాతం వాటా విక్రయించి రూ.900 బిలియన్లు రాబట్టాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే ఎన్ని దశలలో వాటాలు విక్రయిస్తారన్నది తెలియదు.
హిమాలయ పర్వత సానువుల్లో రెండేళ్లుగా చైనా, భారత్ సైన్యాలను మోహరించుకుంటున్న సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య రాజకీయ సంబంధాలు క్షీణించడంతో చైనా ఇన్వెస్టర్లను అడ్డుకోవాలని ప్రభుత్వం అనుకుంటోంది. 'సరిహద్దు వివాదం తర్వాత చైనాతో సంబంధాలు మునుపటిలా లేవు. రెండు దేశాల మధ్య విశ్వాస లోటు ఎక్కువైంది' అని అధికారులు అంటున్నారు. ఎల్‌ఐసీ వంటి కంపెనీల్లో చైనా పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదని వారు పేర్కొంటున్నారు. అయితే చైనీయుల పెట్టుబడులను ఎలా అడ్డుకుంటారు? ఏం చేయనున్నారు? అన్న విషయాలను మాత్రం ప్రభుత్వ వర్గాలు రహస్యంగానే ఉంచుతున్నాయి.
ప్రస్తుత నిబంధనల ప్రకారం ఎల్‌ఐసీలో విదేశీ పెట్టుబడులకు అవకాశం లేదు. అయితే ఎల్‌ఐసీ ఐపీవోలో 20 శాతం వరకు విదేశీ ఇన్వెస్టర్లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. చైనీయులను అడ్డుకోవాలి కాబట్టి ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకురావాలని అనుకుంటోంది. లేదా ఇప్పటికే ఉన్న చట్టంలో కొన్ని సవరణలు చేసే దిశగానూ ఆలోచిస్తోందని అధికారులు తెలిపారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.