Home Buying Tips: ఇల్లు కొనే ముందు ఈ చెక్‌లిస్ట్ పూర్తి చేయండి, లేకపోతే భవిష్యత్ నరకమే
Home Buying Tips | సొంత ఇంటి కల ఉండటం మంచిదే. కానీ ఇల్లు కొనే ఆలోచనలో ఉన్నవారు ఈ తప్పులు చేయకండి. లేకపోతే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతాయి.

Buying Home Tips | చాలా మంది జీవితంలో తమకు జీవితంలో సొంత ఇల్లు కొనాలని కలలు కంటారు. నేడు ఇళ్ల ధరలు పెరగడంతో ప్రజలు తమ జీవితం మొత్తం చేసిన కష్టంతో ఇల్లు కొనుగోలు చేస్తున్నారు. చాలా మంది ఇల్లు కొనడానికి లోన్ తీసుకుంటారు. తరువాత వాయిదాల రూపంలో ప్రతినెలా కొంత మొత్తం నిర్దేశిత లోన్ గడువు వరకు చెల్లిస్తుంటారు.
ఇల్లు కొనుగోలు చేసే ఆనందం, సంతోష సమయంలో ప్రజలు తరచుగా కొన్ని తప్పులు చేస్తారు. దీని కారణంగా వారు ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు ఇల్లు కొనాలని ఆలోచిస్తున్నారా, మీరు ఈ తప్పులను నివారించాలి. తద్వారా భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇల్లు కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే జీవితాంతం ఇబ్బంది పడతారు.
1. మీ బడ్జెట్ ప్రకారం లోన్ తీసుకోవాలి
ఇల్లు కొనడానికి లోన్ (Home Loan) తీసుకునేటప్పుడు మీ ఆర్థిక పరిస్థితి, ఆదాయాన్ని సరిగ్గా అంచనా వేయండి. దీని ప్రకారం లోన్ మొత్తం, కట్టాల్సిన EMIని ఎంచుకోవాలి. ఈ విషయాలను పట్టించుకోకపోవడం వల్ల భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. లోన్ మొత్తాన్ని ఎన్ని సంవత్సరాలలో చెల్లించాలి అనే దానిపై బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీరు లోన్ వ్యవధిని ఎంత కాలం ఉంచుకుంటారనేది మీ ఆదాయం, ఇతర ఖర్చులపై ఆధారపడి ఉంటుంది.
2. మీ ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఇల్లు
మీరు మరింత ఖరీదైన, లగ్జరీ ఇల్లు కొనడానికి ముందు మీ ఆర్థిక పరిస్థితి గురించి అవగాహనతో నిర్ణయాలు తీసుకోవాలి. భవిష్యత్తులో మీరు వాటిని చెల్లించలేకపోతే, అలాంటి ఇంటిని ఎంచుకోవడం మానుకోవాలి.
3. సరైన ప్రాపర్టీని ఎంచుకోవాలి
మీ ఇంటి నుండి ఆసుపత్రి, పాఠశాల, మార్కెట్ వంటి ప్రాథమిక సౌకర్యాలు ఎంత దూరలో ఉన్నాయో చెక్ చేసుకోండి. సరైన లొకేషన్ ఆధారంగా ఆస్తి విలువ కూడా డిసైడ్ చేస్తారు. సౌకర్యాలు లేని చోట ఇల్లు కొనడం వల్ల ప్రస్తుతానికి ప్రయోజనం ఉండకపోవచ్చు. భవిష్యత్తులో కొన్నిసార్లు అలాంటి ప్రాపర్టీ ప్రయోజనం చేకూర్చనుంది.
4. అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి
ఇల్లు కొనే ముందు కనీసం 6 నెలల అత్యవసర నిధి మీ వద్ద ఉండాలి. అంటే మీకు ఎలాంటి ఆదాయం లేకున్నా దాదాపు ఆరు నెలలపాటు మీ నెలవారీ ఖర్చులు, హోమ్ లోన్ EMI ఉండాలి. తద్వారా భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తే, మీరు అత్యవసర నిధి సహాయంతో మీ ఆర్థిక అవసరాలను తీర్చుకోగలిగే స్థితిలో ఉంటే మంచిది.
5. ఇతర ఆస్తులతో పోల్చి చూడండి
ఇల్లు కొనే ముందు, సమీపంలోని ఇతర ఆస్తులతో మీ ఇంటి ధర పోల్చి చూసుకోవాలి. ఇది ఇంటి ధర గురించి మీకు స్పష్టమైన సమాచారాన్ని ఇస్తుంది. మీరు పెట్టే ఖర్చుకు తగ్గ ఇల్లు కొంటున్నారా అనేది క్లారిఫై అవుతుంది. ఇతరులు ఇల్లు కొన్నారని కాదు, మీ ఆర్థిక స్థోమతను బట్టి, ఆదాయం ఆధారంగా చిన్నదో, పెద్దదో ఓ ఇల్లు కొనుక్కోవడం అయితే మంచిది. ముఖ్యంగా నగరాల్లో ఉండే వారైతే నెలవారీ అద్దెకు బదులుగా హోం లోన్ ఈఎంఐ కట్టుకోవడం సరైన నిర్ణయం.






















