Foreign Portfolio Investors: రికార్డ్ సెట్ చేసిన ఫారిన్ ఇన్వెస్టర్లు, 2022లో రూ.1.21 లక్షల కోట్లు విత్ డ్రా
భారతీయ మార్కెట్ల నుంచి ఓవర్‌సీస్ ఇన్వెస్టర్లు రూ.1.21 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కు తీసుకున్నారు, ఇది రికార్డ్.
Foreign Portfolio Investors: కరోనా మహమ్మారి సమయంలో భారత స్టాక్ మార్కెట్ భారీగా పడిపోయింది. స్టాక్ విలువలు అత్యంత ఆకర్షణీయంగా మారాయి. వానలు పడ్డప్పుడు చెరువుల్లోకి కప్పలు చేరినట్లు, తక్కువ ధరకు దొరుకుతున్న నాణ్యమైన షేర్లను దక్కించుకోవడానికి విదేశీ పెట్టుబడిదారులు (Foreign Portfolio Investors - FPIs) భారత్‌కు క్యూ కట్టారు. నోట్ల కట్టల పెట్టెలు పట్టుకువచ్చి, భారతీయ స్టాక్ మార్కెట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. వీళ్లకు దేశీ సంస్థాగత మదుపుదార్లు, రిటైల్ ఇన్వెస్టర్లు కూడా తోడు కావడంతో, మార్కెట్ విలువలు భారీగా పెరిగాయి, 2021 అక్టోబర్ జీవిత కాల గరిష్ట స్థాయులకు (అప్పటికి రికార్డ్) చేరాయి.
రికార్డ్ స్థాయి ఉపసంహరణ
షేర్ల ధరలు బాగా పెరగడంతో, విదేశీ ఇన్వెస్టర్లు ఇక లాభాల స్వీకరణ మొదలు పెట్టారు. భారతీయ మార్కెట్ల నుంచి రికార్డు స్థాయిలో లాభాలతో కలిపి పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఇలా... 2022లో (డిసెంబర్ 29వ తేదీ వరకు) భారతీయ మార్కెట్ల నుంచి ఓవర్‌సీస్ ఇన్వెస్టర్లు రూ. 1.21 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కు తీసుకున్నారు, ఇది రికార్డ్.
అంతకు ముందు, 2008లోని ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో ఇండియన్ మార్కెట్‌లో షేర్లను భారీగా విక్రయించిన ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు దాదాపు రూ. 53 వేల కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. 2022 ముందు వరకు ఇదే రికార్డ్. కానీ, పాత రికార్డ్‌కు (రూ. 53 వేల కోట్లు) - కొత్త రికార్డ్‌కు (రూ. 1.21 లక్షల కోట్లు) మధ్య రెండు రెట్లకుపై వ్యత్యాసం ఉండడం ఇప్పుడు చెప్పుకోదగ్గ అంశం. దీని కంటే ముందున్న భారీ విత్ డ్రాలను పరిశీలిస్తే... 2018లో రూ. 33 వేల కోట్లు, 2011లో రూ. 27 వేల కోట్లు, 1998లో రూ. 740 కోట్లను ఇండియన్ మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్నారు.
2022లో ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంక్‌లు వడ్డీ రేట్లను పెంచుకుంటూ పోవడంతో, FPIలు ప్రపంచంలోని అన్ని స్టాక్ మార్కెట్లలోనూ షేర్లను విపరీతంగా విక్రయించారు. ఆ ప్రభావాన్ని భారతీయ మార్కెట్లు కూడా భారాన్ని భరించవలసి వచ్చింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, కఠినమైన ద్రవ్య విధానం, ముడి చమురు ధరల పెరుగుదల, కమొడిటీ ధరల పెరుగుదల విదేశీ పెట్టుబడుల ఉపసంహరణకు ప్రధాన కారణాలు.
2022కు ముందు భారీ పెట్టుబడులు
2021లో రూ. 25,752 కోట్లు, 2020లో రూ. 1.7 లక్షల కోట్లు, 2019లో రూ. 1.01 లక్షలను భారతీయ మార్కెట్లలోకి ఫారిన్ ఇన్వెస్టర్లు తీసుకొచ్చారు. 2022లో భారతీయ మార్కెట్లలో రూ. 1.21 లక్షల కోట్ల ఫారిన్ పోర్ట్‌ఫోలియోను విక్రయించినప్పటికీ, మన మార్కెట్ ఆరోగ్యం మీద పెద్దగా ప్రభావం పడలేదు. FPIలు తీస్తూ వచ్చిన అగాథాన్ని రిటైల్ ఇన్వెస్టర్లు భర్తీ చేస్తూ వచ్చారు. దీంతో, నష్టం పెద్దగా కనిపించ లేదు.
2022లో (డిసెంబర్ 29వ తేదీ వరకు), విదేశీ మదుపర్లు డెట్ మార్కెట్లలోనూ రూ. 16 వేల కోట్ల విలువైన విక్రయాలు చేశారు.
2022 కంటే 2023లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండే అవకాశం ఉందని అంచనా. కాబట్టి, కొత్త ఏడాదిలో ఇంత పెద్ద స్థాయిలో విదేశీ విక్రయాలు జరిగే అవకాశం ఉండదని నిపుణులు భావిస్తున్నారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.