LPG Cylinder Price: గుడ్‌న్యూస్ - గ్యాస్ ధరలో భారీ కోత, ఏకంగా ₹171.50 తగ్గింపు
వాణిజ్య అవసరాలకు గ్యాస్‌ను ఉపయోగించే వ్యాపారస్తులకు ఇది ఊరట.
LPG Cylinder Price: ప్రపంచ కార్మిక దినోత్సవం అయిన మే 1వ తేదీ నుంచి వంట గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గాయి. దిల్లీ నుంచి చెన్నై వరకు దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ సిలిండర్ రేటు తగ్గాయి. కొత్త రేట్లను గ్యాస్ కంపెనీలు తమ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేశాయి. కాన్పూర్, పట్నా, రాంచీ, చెన్నైలో ఎల్‌పీజీ సిలిండర్ ధర ఒక్కసారే రూ. 171.50 తగ్గింది. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే LPG సిలిండర్ (Commercial LPG Cylinder) విషయంలో ఈ ధర తగ్గింది.
రేటు తగ్గింపు తర్వాత... దిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,856.50కు అందుబాటులో ఉంది. ముంబైలో ధర రూ. 1,808.50, కోల్‌కతాలో ధర రూ. 1,960.50, చెన్నైలో రేటు రూ. 2.021.50 గా ఉంది. వాణిజ్య అవసరాలకు గ్యాస్‌ను ఉపయోగించే వ్యాపారస్తులకు ఇది ఊరట.
అయితే, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) దేశీయ గ్యాస్ సిలిండర్ ధరను స్థిరంగా ఉంచాయి. కోట్లాది కుటుంబాలు వంట కోసం ఉపయోగించే 14.2 కేజీల గృహావసరాల ఎల్‌పీజీ సిలిండర్ ధరలో (domestic gas cylinder price) ఎలాంటి మార్పు లేదు. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు కొన్ని నెలలుగా ఈ రేటును తగ్గించకుండా, స్థిరంగా ఉంచుతూ వచ్చాయి. దీనివల్ల కోట్లాది కుటుంబాలకు ప్రయోజనం లేకపోగా, వంట గ్యాస్ కోసం ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేయాల్సి వస్తోంది.
ఏప్రిల్‌లోనూ తగ్గిన ధరలు
వాణిజ్య, గృహావసరాల LPG సిలిండర్ల ధరలు ప్రతి నెలా 1వ తేదీన మారుతాయి, ఆ నెల మొత్తం అదే రేటు ఉంటుంది. ఏప్రిల్ నెలలో వాణిజ్య సిలిండర్ల ధర తగ్గింది. ఏప్రిల్ 1న దీని ధర రూ. 92 తగ్గింది. అంతకుముందు మార్చి 1న, కమర్షియల్ సిలిండర్ ధర రూ. 350 పెరిగింది. ఏడాది క్రితం, 2022 మే 1న దిల్లీలో LPG వాణిజ్య వినియోగ సిలిండర్ ధర రూ. 2,355.50 గా ఉండగా, నేడు రూ. 1,856.50 కు చేరింది. అంటే, ఏడాది కాలంలో దిల్లీలో రూ. 499 తగ్గింది.
గృహావసరాల ఎల్‌పీజీ ధర
ఇంటి అవసరాలకు ఉపయోగించే డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధర దిల్లీలో రూ. 1103, కోల్‌కతాలో రూ. 1129, ముంబైలో రూ. 1112.5, చెన్నైలో రూ. 1118.5, పట్నాలో రూ. 1201 గా ఉంది.
మెట్రో నగరాలతో పాటు చాలా చోట్ల వంట గ్యాస్ ధరలు తగ్గాయి. IOC వెబ్‌సైట్ ప్రకారం... డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధర శ్రీనగర్‌లో రూ. 1219, ఐజ్వాల్‌లో రూ. 1255, అండమాన్‌లో రూ. 1129, అహ్మదాబాద్‌లో రూ. 1110, భోపాల్‌లో రూ. 1118.5, జబల్‌పూర్‌లో రూ. 1116.5, ఆగ్రాలో రూ. 1115.5, ఇండోర్‌లో రూ. 1131, డెహ్రాడూన్‌లో రూ.1122, చండీగఢ్‌లో 1112.5, విశాఖపట్నంలో రూ.1111.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవి
ఇక, మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. 14.2 కిలోల సిలిండర్‌ను కొనుగోలు చేసేందుకు ఇప్పుడు రూ. 1161 చెల్లించాలి. ఏపీలో ఈ రేటు వర్తిస్తుంది. హైదరాబాద్‌లో చూస్తే.. సిలిండర్ ధర రూ. 1155 వద్ద కొనసాగుతోంది. డెలివరీ ఛార్జీలు కూడా ఈ ధరలోనే కలిసి ఉంటాయి. కాబట్టి, గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే వ్యక్తులకు అదనంగా ఒక్క రూపాయి కూడా అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ, వాళ్లు డబ్బులు డిమాండ్ చేస్తే, మీ గ్యాస్ ఏజెన్సీకి, కంపెనీకి ఫిర్యాదు చేయవచ్చు.