DA Hike News: ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త! - ప్రభుత్వం కరవు భత్యాన్ని ఎంత పెంచుతుందంటే?
DA Hike 2025: ఈ ఏడాది అక్టోబర్ 16న, కేంద్ర ప్రభుత్వం డీఏను 3% పెంచి 53%కు చేర్చింది. ఇప్పుడు, కొత్త పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది.
Central Government May Increase DA For 2025: కొత్త సంవత్సరంలో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు & పింఛనుదార్ల దృష్టి కరవు భత్యం (DA) పెంపుపైనే ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించే డియర్‌నెస్ అలవెన్స్ హైక్ (DA Hike) జనవరి నెల నుంచి అమల్లోకి వస్తుంది. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో, డీఏ పెరుగుదల ధరల వాత నుంచి ప్రభుత్వ ఉద్యోగులు & పెన్షనర్లకు (Government Employees &Pensioners) ఉపశమనం కలిగిస్తుంది. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI) డేటా మీద డీఏ హైక్ ఆధారపడి ఉంటుంది. కరవు భత్యం పెంపుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన ఆలస్యం కావడానికి కారణం ఇదే.
కరవు భత్యాన్ని ఎలా నిర్ణయింస్తారు?
ప్రతి 6 నెలలకు ఒకసారి డియర్‌నెస్ అలవెన్స్‌ను సవరిస్తారు. ఇది AICPI డేటా ఆధారంగా జరుగుతుంది. జనవరి-జూన్ & జులై-డిసెంబర్ డేటాను ప్రభుత్వం సమీక్షిస్తుంది, 12 నెలల సగటు AICPI ఆధారంగా DA పెంపును ప్రకటిస్తుంది.
2024 అక్టోబర్‌లో DA 3% పెంపు
2024 అక్టోబర్ 16న, కేంద్ర ప్రభుత్వం డీఏను 3 శాతం పెంచి 53 శాతానికి చేర్చింది. ఈ పెంపు ఆ ఏడాది జులై నుంచి అమలయింది. దీని వల్ల కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందారు. దీనికి ముందు, 2024 జనవరి DA పెంపును మార్చిలో ప్రకటించారు, అప్పుడు 4 శాతం పెంచి 50 శాతానికి చేర్చారు.
2025 జనవరిలో డియర్‌నెస్ అలవెన్స్ ఎంత పెరుగుతుంది?
2025 జనవరిలో డీఏలో మరో 3 శాతం పెరుగుదల ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. AICPI ప్రస్తుత ట్రెండ్‌ల ఆధారంగా, అక్టోబర్ 2024లో 144.5కి చేరుకుంది & మరింత పెరుగుతుందని అంచనా వేశారు. 2025 జనవరి కోసం DAను 3 శాతం పెంచితే, ఇది మొత్తం 56 శాతానికి చేరుతుంది. ఈ పెంపుదలతో ఉద్యోగుల జీతం, పింఛనుదార్ల పెన్షన్‌పై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది.
మరో ఆసక్తికర కథనం: ఆధార్ కార్డ్ ఉంటే రూ.80,000 బ్యాంక్ లోన్ - గ్యారెంటీ చూపాల్సిన అవసరం లేదు
ఉదాహరణకు, కరవు భత్యాన్ని 3 శాతం పెంచితే, కనీస వేతనం రూ. 18,000 తీసుకుంటున్న ఉద్యోగులు రూ. 540 ప్రయోజనం పొందుతారు. అదే సమయంలో, గరిష్టంగా రూ. 2,50,000 జీతం పొందుతున్న వాళ్లు రూ.7,500 పెరుగుదల చూస్తారు. పెన్షనర్లు కూడా ప్రయోజనం పొందుతారు, వాళ్ల చేతికి వచ్చే పెన్షన్ రూ. 270 నుంచి రూ. 3,750 వరకు పెరగొచ్చు.
8వ వేతన సంఘం ఊసే లేదు
8వ వేతన సంఘం (8th Pay Commission) కోసం ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ప్రస్తుతం దానికి ఎలాంటి ప్రణాళిక లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 8వ వేతన సంఘానికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదన పరిశీలనలో లేదని మంత్రి పంకజ్ చౌదరి ఇటీవలి పార్లమెంటు సమావేశాల్లో వెల్లడించారు.
మరో ఆసక్తికర కథనం: ఏటీఎం కార్డ్, క్రెడిట్ కార్డ్‌పై ఎగిరే పావురం గుర్తు - ఏంటి దీని అర్ధం?