Budget 2022: భారత్‌లో తొలి బడ్జెట్ ఎవరు ప్రవేశ పెట్టారో తెలుసా?
భారత్ బడ్జెట్‌కు చాలా ప్రత్యేకత ఉంది. సమారు 160ఏళ్లకుపైగా చరిత్ర ఉంది. ఇలాంటి ఎన్నో విశేషాలు మీ కోసం
ఇదీ బడ్జెట్ చరిత్ర
భారత్ బడ్జెట్‌ది దాదాపు 162 ఏళ్ల చరిత్ర. తొలిసారిగా ఏప్రిల్ 7,1860లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ తొలి బడ్జెట్ ప్రవేశపెట్టింది జేమ్స్ విల్సన్ (స్కాటిష్). స్వాతంత్ర్య భారత్‌లో తొలి బడ్జెట్ ప్రవేశ పెట్టింది మాత్రం షణ్ముగం చెట్టి. 26-11-1947లో ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు.
సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం
2020 ఫిబ్రవరి1న నిర్మలా సీతారామన్ చేసిన బడ్జెట్ ప్రసంగమే సుదీర్ఘమైంది. ఆమె సుమారు రెండు గంటల నలభై రెండు నిమిషాలు ప్రసంగించారు. అనారోగ్యం కారణంగా రెండు పేజీలను చదవుకుండా వదిలేశారు.
2019లో నిర్మలాసీతారామన్ రెండు గంటల పదిహేడు నిమిషాల పాటు బడ్జెట్ చదివి వినిపించారు.
అతి పెద్ద బడ్జెట్ ఇదే
1991లో పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ ఎక్కువ పదాలు ఉన్న బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఆ బడ్జెట్‌లో 18వేల 650 పదాలు ఉన్నాయి. 2018లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 18,605 పదాలున్న బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఆయన దీన్ని కేవలం గంటా నలభై తొమ్మిది నిమిషాల్లో చదివేశారు.
అతి చిన్న బడ్జెట్ ఇదే
1977లో ప్రవేశ పెట్టిందే అతి చిన్న బడ్జెట్. కేవలం ఎనిమిది వందల పదాలతో ఆర్థికమంత్రి హీరుభాయ్ ముల్జీ భాయ్ పటేల్ ఈ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.
మొరార్జీ దేశాయ్ టాప్
మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ఎక్కువ కాలం ఆర్థిక మంత్రిగా పని చేశారు. 1962-69 మధ్య పదిసార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టారాయన. తర్వాత పీ. చిదంబరం తొమ్మిదిసార్లు, ప్రణబ్ ముఖర్జీ, యశ్వంత్ సిన్హా ఎనిమిది సార్లు మన్మోహన్ సింగ్ ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టారు.
కాలం మారిందప్పుడే
1999 వరకు కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి చివరి పని దినం సాయంత్రం ఐదు గంటలకు ప్రవేశ పెట్టేవాళ్లు ఇది బ్రిటీష్ కాలం నుంచి వచ్చిన సంప్రదాయం. కానీ 1999లో నాటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఈ సంప్రదాయాన్ని మార్చేశారు. ఉదయం 11 గంటలకే ప్రవేశ పెట్టడం స్టార్ట్ చేశారు.
2017లో నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశ పెట్టే తేదీని ఫిబ్రవరి 1వ తేదీకి మార్చారు.
మొదట్నించీ ఇంగ్లీష్‌లోనే
1995వరకు బడ్జెట్‌ను ఇంగ్లీష్‌లో మాత్రమే ప్రచురించేవారు. కానీ ఆ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌ను హిందీ, ఇంగ్లీష్‌లో ప్రచురించడం స్టార్ట్ చేసింది.
పేపర్‌లెస్ బడ్జెట్
కరోనా కారణంగా తొలిసారిగా 2021-22లో కాగితరహిత బడ్జెట్ ప్రవేశపెట్టారు.
బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటి మహిళ
1970-71బడ్జెట్‌ను ఇందిరాగాంధీ ప్రవేశపెట్టి.. తొలి మహిళగా రికార్డు సృష్టించారు. 2019లో నిర్మలాసీతారామన్ రెండో మహిళగా నిలిచారు.
రైల్వే బడ్జెట్
2017 వరకు 92 ఏళ్ల పాటు రైల్వే బడ్జెట్‌ను వేరుగా ఉభయసభల్లో ప్రవేశ పెట్టేవాళ్లు. 2017తర్వాత సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్‌ను కలిపిసి సభకు సమర్పిస్తున్నారు.
Also Read: కరోనాపై భారత్ పోరాటం స్ఫూర్తిదాయకం: ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం