Budget 2025 Highlights:పాత పన్ను విధానానికి సమాధి- కొత్త విధానంలోకి అందర్నీ రప్పించేందుకు కేంద్రం ఎత్తుగడ
Income Tax:ప్రస్తుతం ఉన్న రెండు ఆదాయపు పన్ను చెల్లింపు విధానాల్లో కొత్తదానిపైనే కేంద్రం మొగ్గుచూపుతోంది. అందులోకి అందర్నీ రప్పించేందుకు ఐదేళ్లుగా రాయితీలు ప్రకటిస్తూనే ఉంది.

Income Tax: బడ్జెట్ ప్రసంగంలో 12 లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండబోదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెబుతున్నప్పుడు సభ అంతా ఒక్కసారిగా చప్పట్లతో మారుమోగిపోయింది. నరేంద్ర మోదీ నినాదాలతో దద్దరిల్లింది. ఇది కొత్త పన్ను విధానంలో ఉన్న వారికి వర్తిస్తుందని నిర్మలా సీతారామన్ తర్వాత రిపీట్ చేస్తూ చెప్పారు.
ఉద్యోగుల ఆదాయపు పన్ను చెల్లింపునకు ప్రభుత్వం రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి పాత విధానం, రెండు కొత్త విధానం. పాత పన్ను విధానంలో కొన్ని అనుకూల ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి చాలా మంది అందులో ఉండిపోయారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారికి, బ్యాచిలర్స్‌కు ఈ కొత్త పన్ను విధానం బాగుండటంతో వారు అందులో చేరారు.
Also Read: బడ్జెట్ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?
పాత పన్ను విధానంలో కొన్ని మినహాయింపులు ఉంటాయి. పిల్లల స్కూల్ ఫీజులు, సేవింగ్స్, మెడికల్ బిల్స్, మెడికల్ ఇన్సూరెన్స్‌లు లాంటివి పెట్టుకొని కొంత వరకు పన్ను నుంచి రాయితీ పొంద వచ్చు. కానీ కొత్త పన్ను విధానంలో మాత్రం ఏడు లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండదు. అంతకు మించి ఆదాయం ఉంటే ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. దీని నుంచి మినహాయింపులు ఉండవు. అంటే ఫీజులు, ఇన్సురెన్స్‌లు వగేరా పెట్టుకునే రాయితీ పొందే వీలు లేదు.
దీని కారణంగానే చాలా మంది పాత విధానానికి మొగ్గు చూపుతున్నారు. దీన్ని తగ్గించడానికి ప్రభుత్వం కొత్త ఎత్తుగడ తీసుకొచ్చింది. అందుకే బడ్జెట్‌లో కేంద్రమంత్రి కొత్త పన్ను విధానానికే ఉపశమనం కల్పించారు. 12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది కాబట్టి చాలా మంది కొత్త ఆదాయపు పన్ను విధానంలోకి మారబోతున్నారు.
కొత్త ఆదాయపు పన్ను శ్లాబ్స్‌లో భారీ మార్పులు చేసిన కేంద్రం పాత ఆదాయపు పన్ను జోలికి మాత్రం వెళ్లలేదు. ఇప్పుడు కొత్త పన్ను విధానంలో వచ్చిన మార్పులు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. 12.75 లక్షల వరకు పన్ను లేకపోవడం, తర్వాత విధించే పన్నుల శాతం కూడా పాత పన్ను విధానంతో పోలిస్తే రేటు కూడా తక్కువగా ఉంది. అందుకే కచ్చితంగా ఎక్కువ మంది కొత్త ఆదాయపు పన్ను విధానంలోకి మారబోతున్నారు. దీంతో క్రమంగా పాత పన్ను విధానాన్ని ప్రభుత్వమే పూర్తిగా తీసివేయకుండా నిరుత్సాహపరుస్తోంది.
Also Read: 8 నుంచి 50 లక్షల శాలరీ వచ్చే ఉద్యోగులకు ఎంత పన్ను ఆదా అవుతుందో ఇక్కడ చూడండి
2020 నుంచి ఈ రెండు ఆదాయపు పన్నుల విధానం ఉన్నప్పటికీ పాత పన్ను విధానంపై ఎలాంటి ఉపశమనాలు కల్పించడం లేదు. ఎవరైతే కొత్త పన్ను విధానాన్ని ఎంపిక చేసుకుంటున్నారో వారికి మాత్రమే రాయితీలు కల్పిస్తూ వస్తోంది ప్రభుత్వం. అంతే కాకుండా పాత పన్ను విధానంలో ప్రతి ఏటా ఫైల్ చేయడం, రుజువులు సమర్పించడం వంటి తతంగం ఉంటుంది. నేటి తరం అలాంటి పేపర్ వర్క్‌కు దూరంగా ఉంటారు. ఇలాంటి ఝంజాటం ఎందుకులే అనుకున్న వాళ్లంతా కొత్త విధానాన్ని ఎంపిక చేసుకుంటారు. ప్రభుత్వం విధానాలు చూస్తున్న వారంతా పాత ఆదాయపు పన్ను విధానానికి కేంద్రం మంగళం పాడేసి సమాధి సిద్ధం చేస్తోందని అనుకుంటున్నారు.
పాత పన్ను విధానంలో శ్లాబ్‌లు ఇలా ఉన్నాయి.
0-2.5 లక్షల వరకు - పన్ను లేదు
2.5 నుంచి 5 లక్షల వరకు - 5 శాతం పన్ను
5 నుంచి 10 లక్షల వరకు -20 శాతం పన్ను
పది లక్షలకు మించిన వారందరిపై 30 శాతం పన్ను
కొత్త విధానంలో పాత పన్ను శ్లాబ్‌లు ఇలా ఉంటాయి
3 లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండబోదు
3 నుంచి 7 లక్షల వరకు ఐదు శాతం పన్ను ఉంటుంది.
7 నుంచి 10 లక్షల వరకు 10 శాతం పన్ను
10 నుంచి 12 లక్షల వరకు 15 శాతం పన్ను
12 నుంచి 15 లక్షల వరకు 20 శాతం పన్ను
15 లక్షలకు మించిన ఆదాయం ఉన్న వారిపై 30 శాతం పన్ను విధిస్తారు.
కొత్త పన్ను విధానంలో కొత్త శ్లాబ్‌లు ఇలా ఉన్నాయి.
0-4 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు
4-8 లక్షల మధ్య ఆదాయం ఉన్న వాళ్లపై 5 శాతం పన్ను
8-12 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారిపై 10 శాతం పన్ను
12-16 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారిపై 15 శాతం పన్ను
16-20 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారిపై 20 శాతం పన్ను
20-24 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారిపై 25 శాతం పన్ను
24 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారిపై 30 శాతం పన్ను విధిస్తున్నారు.
ఇప్పటికీ కొందరు పాత పన్ను విధానాన్నే కోరుకోవడానికి కారణం ఏంటీ?
పాత ఆదాయపు పన్ను విధానంలో పీపీఎఫ్, ఎన్‌ఎస్‌సీ, ఎస్‌ఎస్‌బై లాంటి స్కీమ్స్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా లక్షన్నర వరకు రాయితీ పొందవచ్చు. హెచ్‌ఆర్‌ఏ, ఎల్టీఏ మినహాయింపు కూడా ఉంటుంది. 80 సీతో 1.5లక్షల వరకు మినహాయింపు ఉంటుంది. అందుకే కొందరు వీటిని గమనించి పాత విధానం మేలు అనుకుంటూ ఇప్పటి వరకు వచ్చారు. అయితే కొత్త పన్ను విధానంలో ప్రకటించిన ఆకర్షణీయమైన శ్లాబ్‌లతో అటు మారే అవకాలు ఎక్కువగా ఉన్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

