![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ram Mandir: వాటి కోసం ఆన్‌లైన్‌లో తెగ సెర్చింగ్, ఉత్సాహం పెంచిన అయోధ్య ఆలయం
Ram Mandir: అయోధ్య నగరం & అక్కడ నిర్మిస్తున్న రామ మందిరం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
![Ram Mandir: వాటి కోసం ఆన్‌లైన్‌లో తెగ సెర్చింగ్, ఉత్సాహం పెంచిన అయోధ్య ఆలయం Ayodhya ram mandir is attracting more religious tourists according to makemytrip fresh data Ram Mandir: వాటి కోసం ఆన్‌లైన్‌లో తెగ సెర్చింగ్, ఉత్సాహం పెంచిన అయోధ్య ఆలయం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/13/7cf7b878bba53ec3af4a46ed9b95d6051705121808165545_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో అత్యంత సుందరంగా నిర్మించిన రామాలయంలో (Ayodhya Rama Temple), శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్టను అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 22న (22 జనవరి 2024) ప్రాణప్రతిష్ట జరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి తరలివచ్చే లక్షలాది మంది ప్రజలు, ప్రముఖులకు భోజనం, మంచినీళ్లు, బస కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రోన్లు, 10 వేలకు పైగా సీసీటీవీ కెమెరాలతో భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు.
హిందూ మతపరంగా అత్యంత విశిష్టమైన ఈ కార్యక్రమం, దేశంలోని పర్యాటక రంగానికి కొత్త బాటలు పరిచింది. మతపరమైన ప్రదేశాలను సందర్శించాలనుకునే (Religious Tourism) వారి సంఖ్య ఇప్పుడు వేగంగా పెరుగుతోంది. ఆన్‌లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్ మేక్ మై ట్రిప్ (MakeMyTrip) డేటా ప్రకారం, గత రెండేళ్లలో, మతపరమైన ప్రదేశాల కోసం ఆన్‌లైన్‌లో శోధించే (online searching) వారి సంఖ్య దాదాపు 97 శాతం పెరిగింది. 2021 - 2023 మధ్య కాలంలో, యాత్రల కోసం ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లడానికి ప్రజలు ప్రాధాన్యత ఇస్తున్నారు. వీటిలో అయోధ్య నగరం & అక్కడ నిర్మిస్తున్న రామ మందిరం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
అయోధ్య గురించి ఎక్కువ శోధన
మేక్ మై ట్రిప్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం, గత రెండేళ్లలో ప్రజల టూరిజం ప్రిఫరెన్స్‌లు మారాయి. మతపరమైన ప్రయాణాలు చేయడంలో జనం ఆసక్తి వేగంగా పెరిగిందని ట్రావెల్ అగ్రిగేటర్ డేటా చూపిస్తోంది. అయోధ్యలో రామమందిరం నిర్మాణంతో ఈ ఆలోచన మరింత బలపడింది. అయోధ్య గురించి ప్రజలు ఆన్‌లైన్‌లో ఎక్కువగా శోధిస్తున్నారు, ఈ సంఖ్య రెండేళ్లలో 585 శాతం పెరిగింది.
టూరిజం ప్లాట్‌ఫామ్ వెల్లడించిన ప్రకారం, 2021 - 2023 మధ్య కాలంలో, అయోధ్యతో పాటు ఉజ్జయిని (359 శాతం), బద్రీనాథ్ (343 శాతం), అమర్‌నాథ్ (329 శాతం), కేదార్‌నాథ్ (322 శాతం), మధుర (223 శాతం), ద్వారక (193 శాతం), షిర్డీ (181 శాతం), హరిద్వార్ (117 శాతం), బోధ గయ (114 శాతం) కోసం ప్రజలు తెగ సెర్చ్ చేశారు.
2023 డిసెంబర్ 30న అత్యధిక సెర్చింగ్
మేక్ మై ట్రిప్ ప్రకారం, అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలని నిర్ణయించిన తర్వాత, ఆ స్థలం గురించి తెలుసుకోవాలనుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. రామాలయ ప్రారంభోత్సవ తేదీ సమీపిస్తున్న కొద్దీ, అయోధ్య చరిత్ర గురించి వెతుకుతున్న వారి సంఖ్య 1806 శాతం పెరిగింది. 2023 డిసెంబరు 30న అయోధ్య గురించి అత్యధిక శోధన జరిగింది. ఈ రోజున అయోధ్య విమానాశ్రయాన్ని (Ayodhya Airport - Maharishi Valmiki International Airport) ప్రారంభించారు. అయోధ్యలో పునర్నిర్మించిన రైల్వే స్టేషన్ నుంచి రెండు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ (Amrit Bharat Express) రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) జెండా ఊపి ప్రారంభించారు.
అయోధ్యలోని రామ మందిర ప్రతిధ్వని విదేశాలకు కూడా చేరింది. భారత సరిహద్దుల ఆవల నుంచి కూడా అయోధ్య గురించి వెతుకులాట జరుగుతోంది. పర్యాటక సంస్థ సమాచారం ప్రకారం, అమెరికా నుంచి 22.5 శాతం, గల్ఫ్ దేశాల నుంచి 22.2 శాతం శోధనలు జరిగాయి. కెనడా, నేపాల్, ఆస్ట్రేలియా దేశాల్లోని ప్రజలు కూడా అయోధ్య, రామమందిరం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ నెల 22న, ప్రాణప్రతిష్ట రోజున దాదాపు 11 వేల మంది ప్రముఖులు అయోధ్యకు చేరుకుంటారని సమాచారం.
మరో ఆసక్తికర కథనం: 4 నెలల గరిష్టానికి ద్రవ్యోల్బణం, పెరిగిన ఆహార ధరలే కారణం, EMI ఆశలపై నీళ్లు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)