(Source: ECI/ABP News/ABP Majha)
Apple Jobs: ఆపిల్ సంస్థ బంపరాఫర్ - భారత్‌లో వచ్చే మూడేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు!
భారత్‌లో ఆపిల్ ఉత్పత్తుల తయారీని వచ్చే 5 సంవత్సరాల్లో దాదాపు 40 బిలియన్ డాలర్లకు (3.32 లక్షల కోట్ల రూపాయలు) తీసుకెళ్లాలని ఈ టెక్ జెయింట్ భావిస్తోంది.
Apple May Hire Over 5,00,000 Employees In India: మన దేశంలో ఉద్యోగాల వేటలో ఉన్న వాళ్లకు పెద్ద గుడ్ న్యూస్. ప్రపంచంలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఆపిల్ (Apple Inc), భారత్ కోసం భారీ ప్లాన్ సిద్ధం చేసింది. ఐఫోన్ (iPhone) తయారీ కంపెనీ, వచ్చే మూడేళ్లలో మన దేశంలో దాదాపు 5 లక్షల ఉద్యోగాలను సృష్టించబోతోంది. ఆపిల్ వెండార్స్ ద్వారా ఈ ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం ఆపిల్ వెండార్లు, సరఫరాదార్లు భారత్‌లో 1.5 లక్షల మందికి ఉపాధి కల్పించారు.
టాటా ఎలక్ట్రానిక్స్ నుంచి గరిష్ట సంఖ్యలో ఉద్యోగాలు
ఆపిల్ మన దేశంలో నియామకాలను వేగంగా పెంచబోతోందని ఒక ప్రభుత్వ సీనియర్ అధికారి చెప్పినట్లు పీటీఐ రిపోర్ట్ చేసింది. ఈ గ్లోబల్ కంపెనీ ద్వారా భారత్‌లో వచ్చే మూడేళ్లలో దాదాపు 5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నట్లు ఆ అధికారి వెల్లడించారు. ఆపిల్ ఉత్పత్తుల కోసం మన దేశంలో రెండు తయారీ ప్లాంట్లు నడుపుతున్న టాటా గ్రూప్ కంపెనీ (Tata Group) టాటా ఎలక్ట్రానిక్స్ (Tata Electronics) ప్రస్తుతం గరిష్ట సంఖ్యలో ఉద్యోగాలు సృష్టిస్తోంది.
మరో ఆసక్తికర కథనం: హెచ్‌డీఎఫ్‌సీ సిబ్బందికి బంపర్ ఆఫర్ - రూ.1500 కోట్లు ఇస్తున్న బ్యాంక్
అయితే, ఈ ఉద్యోగాల గణాంకాలపై స్పందించడానికి ఆపిల్ కంపెనీ నిరాకరించింది.
భారత్‌లో ఉత్పత్తిని 5 రెట్లు పెంచాలని యోచన
మన దేశంలో ఉత్పత్తిని (Apple Production) 4 నుంచి 5 రెట్లు పెంచాలని ఆపిల్ ప్లాన్ చేసింది. భారత్‌లో ఆపిల్ ఉత్పత్తుల తయారీని వచ్చే 5 సంవత్సరాల్లో దాదాపు 40 బిలియన్ డాలర్లకు (3.32 లక్షల కోట్ల రూపాయలు) తీసుకెళ్లాలని ఈ టెక్ జెయింట్ భావిస్తోంది. ఉత్పత్తిని ఇంత భారీ స్థాయిలో పెంచాలంటే ఆపిల్‌కు చాలా మ్యాన్ పవర్ అవసరం. కాబట్టి, చాలా ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంటుందని ప్రభుత్వ సీనియర్ అధికారి చెప్పారు. కొవిడ్ 19 మహమ్మారి సమయంలో, చైనాలోని తయారీ యూనిట్ల నుంచి ఆపిల్ చాలా సమస్యలు ఎదుర్కొంది. ఆ తర్వాత చైనా ప్లస్ స్ట్రాటెజీని అనుసరించి, భారత్ మీద దృష్టి పెట్టింది.
భారత్ నుంచి అత్యధిక ఆదాయం పొందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఆపిల్
2022-23 ఫైనాన్షియల్ ఇయర్‌లో, ఆపిల్ కంపెనీ భారత్ నుంచి అత్యధిక ఆదాయాన్ని పొందిందని మార్కెట్ రీసెర్చ్ కంపెనీ కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ (Counterpoint Research) తెలిపింది. అయితే, యూనిట్ల నంబర్ విషయంలో మాత్రం శాంసంగ్ (Samsung) ముందంజలో ఉంది. ఆపిల్ భారత్ నుంచి పది మిలియన్లకు పైగా (కోటికి పైగా) ఫోన్లను ఎగుమతి (Apple Products Export From India) చేసింది. దీంతోపాటు, భారత్‌లో ఎక్కువ ఆదాయం ఆర్జించిన స్మార్ట్‌ఫోన్ కంపెనీగా తొలిసారి అవతరించింది. 2023-24 సంవత్సరంలో ఐఫోన్ ఎగుమతుల ద్వారా ఆపిల్ సంస్థ భారతదేశం నుంచి 12.1 బిలియన్ డాలర్ల ఆదాయం సంపాదించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం 6.27 బిలియన్ డాలర్లుగా ఉంది. 2022-23లో ఇది దాదాపు 100 శాతం పెరిగింది.
మరో ఆసక్తికర కథనం: అమిత్ షా పోర్ట్‌ఫోలియోలో 180 కంపెనీలు - స్టాక్ మార్కెట్‌పై ఇంత పట్టుందా?