(Source: ECI/ABP News/ABP Majha)
Adani-Hindenburg Case: అదానీకి గట్టి షాకిచ్చిన కేంద్ర సర్కారు - కమిటీ ఏర్పాటుకు సిద్ధమని ప్రకటన
నియంత్రణను మరింత పటిష్టంగా మార్చేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సోమవారం నాటి విచారణలో సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు.
Adani-Hindenburg Case: గౌతమ్ అదానీకి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేసేందుకు తమకేమీ అభ్యంతరం లేదని సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో, త్వరలోనే ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) రిలీజ్ చేసిన నివేదికపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ఒక విచారణ కమిటీని వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం విచారణ జరిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ (Chief Justice D Y Chandrachud) నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఎదుట ఈ కేసులో విచారణ జరిగింది. న్యాయవాదులు విశాల్ తివారీ, ఎంఎల్ శర్మ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను కలిపి, ధర్మాసనం విచారణ జరిపింది.
అదానీ గ్రూప్ మీద హిండెన్‌బర్గ్ నివేదిక ఇచ్చిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో అదానీ గ్రూప్ స్టాక్స్ (Adani Group Stocks) సహా మొత్తం స్టాక్ మార్కెట్‌లో లక్షల కోట్లు రూపాయల సంపద ఆవిరి కావడంపై, గత శుక్రవారం జరిగిన విచారణలో సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. భారత మదుపర్ల సొమ్మును రక్షించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. భారతీయ పెట్టుబడిదార్లకు రక్షణ ఎలా కల్పించాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీని (SEBI) కూడా సర్వోన్నత న్యాయస్థానం అప్పుడు ప్రశ్నించింది. ప్రస్తుతం ఉన్న ఈక్విటీ ఇన్వెస్టింగ్ విధానాన్ని పటిష్టం చేయడానికి ఏం చేయాలనే అంశంపై తగిన సూచనలతో సోమవారం జరిగే విచారణకు హాజరు కావాలని సొలిసిటర్ జనరల్‌కు సుప్రీంకోర్టు సూచించింది.
కమిటీ ఏర్పాటుకు సిద్ధమన్న కేంద్ర ప్రభుత్వం
ఈ నేపథ్యంలో.., స్టాక్ మార్కెట్ లావాదేవీలను, నియంత్రణను మరింత పటిష్టంగా మార్చేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సోమవారం నాటి విచారణలో సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. సెబీ & కేంద్ర ప్రభుత్వం తరపున ఆయన విచారణకు హాజరయ్యారు. కొన్ని కారణాల వల్ల, ఆ కమిటీలో ఉండే నిపుణుల పేర్లు, కమిటీ విచారణ పరిధి ఎంత అనే విషయాలను సీల్డ్ కవర్‌లో అందజేస్తామని కోర్టుకు తెలిపారు. హిండెన్‌బర్గ్ నివేదిక వల్ల ఉత్పన్నమైన ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోవడానికి సెబీ సహా ఇతర చట్టబద్ధ సంస్థలు సిద్ధంగా ఉన్నాయాని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా త్రి సభ్య ధర్మాసనానికి వివరించారు. అనంతరం, ఈ రెండు వ్యాజ్యాలపై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.
ఇన్వెస్టర్లను శాంతపరిచే వ్యూహం
మరోవైపు, అదానీ కంపెనీలపై ఒకదాని తర్వాత ఒకటి నెగెటివ్ వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఇన్వెస్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు, వారిని శాంతపరిచేందుకు అదానీ గ్రూప్ ఓ ప్రకటన విడుదల చేసింది. గ్రూప్‌లోని పోర్ట్‌ఫోలియో కంపెనీలు పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని ఇస్తాయని ఆ ప్రకటనలో అదానీ గ్రూప్ ప్రతినిధి హామీ ఇచ్చారు.
గ్రూప్‌లోని అన్ని పోర్ట్‌ఫోలియో కంపెనీల బ్యాలెన్స్ షీట్ చాలా బాగుందని, అభివృద్ధి సామర్థ్యాల్లో పరిశ్రమలో అగ్రగామిగా ఉన్నామని పేర్కొన్నారు. బలమైన కార్పొరేట్ గవర్నెన్స్‌తో, సురక్షిత ఆస్తులు, బలమైన నగదు ప్రవాహాలు, మా వ్యాపార ప్రణాళికలన్నింటికీ తగినన్ని నిధులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు స్థిమిత పడిన తర్వాత, తమ అన్ని పోర్ట్‌ఫోలియో కంపెనీలు తమ క్యాపిటల్ మార్కెట్ వ్యూహాన్ని సమీక్షిస్తాయని ఆ ప్రకటనలో తెలిపారు.