(Source: ECI/ABP News/ABP Majha)
Moonlighting: మూన్ లైటింగ్ లాంటివే మరో 10 పదాలున్నాయి, వాటి అర్థాలు తెలుసా?
తమ ఉద్యోగులు కూడా మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్నారని TCS ప్రకటించింది. అయితే హెచ్చరికలతో సరిపెట్టింది.
Moonlighting: సెప్టెంబర్ మాసానికి సంబంధించి ఐటీ కంపెనీల ఫలితాలు వెల్లడవుతున్న నేపథ్యంలో మూన్‌లైటింగ్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీకి చెప్పకుండా, అదే సమయంలో రహస్యంగా వేరే కంపెనీలోనూ ఉద్యోగం చేయడాన్ని మూన్ లైటింగ్ (Moonlighting) అంటారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా, ఒకేసారి రెండు కంపెనీల్లో పనిచేయడం, రెండు జీతాలు తీసుకోవడం అని అర్థం. గతంలో ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లేవాళ్లు కాబట్టి మూన్‌లైటింగ్ సాధ్యపడలేదు. కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం వచ్చాక మూన్‌లైటింగ్ కల్చర్ పెరిగింది.
ఐటీ మేజర్ విప్రో, మూన్‌లైటింగ్ కారణంగా ఇటీవలే 300 మంది ఉద్యోగులను తీసేసింది. తమ ఉద్యోగులు కూడా మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్నారని TCS ప్రకటించింది. అయితే హెచ్చరికలతో సరిపెట్టింది. మూన్‌లైటింగ్‌కు పాల్పడడం అనైతికమని, ఉద్యోగమిచ్చిన కంపెనీని మోసం చేయడమేనని చెప్పింది.
మూన్ లైటింగ్‌కు పాల్పడితే ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తామని IBM కూడా తన ఉద్యోగులను హెచ్చరించింది.
మూన్ లైటింగ్ అంటే చాలామందికి కొత్త పదమేగానీ, కార్పొరేట్ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు తెలిసిన పదమే ఇది. ఇలాంటివే 10 పదాలు కార్పొరేట్ ఆఫీసుల్లో తరచూ వినిపిస్తుంటాయి. ఆ పదాలకు అర్థాలు ఇవి:
మూన్‌లైటింగ్ (Moonlighting): పగలు ఒక కంపెనీలో, రాత్రిపూట మరో కంపెనీలో ఉద్యోగం చేయడం అనే అర్ధంలో గతంలో దీన్ని ఉపయోగించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాక, ఏకకాలంలో రెండు ఉద్యోగాలు చేయడం అనే అర్ధంలోనూ వాడుతున్నారు.
క్వైట్ క్విటింగ్ (Quiet Quitting): క్వైట్ క్విటింగ్ అంటే అసలైన అర్థం తెలివిగా తప్పించుకోవడం. కార్పొరేట్ పరిభాషలో.. పని గంటల తర్వాత ఒక్క నిమిషం కూడా అదనంగా పని చేయకపోవడం, పని భారాన్ని తగ్గించుకోవడం. కేవలం తమ పాత్ర వరకే పరిమితం కావడం వంటి అర్ధాల్లో ఉపయోగిస్తున్నారు. ఇది దాదాపు చాలామంది ఉద్యోగుల్లో కనిపిస్తుంది.
క్వైట్ ఫైరింగ్ (Quite Firing): పొమ్మనలేక పొగబెట్టడమే క్వైట్ ఫైరింగ్. ఉద్యోగికి సరైన పని లేదా సరైన బాధ్యతలు అప్పగించకుండా; తక్కువ స్థాయి పనులు అప్పగించడం లేదా ఖాళీగా కోర్చోబెట్టడం ద్వారా, ఉద్యోగులు తమంతట తామే ఉద్యోగాలను మానేసేలా చేయడాన్ని క్వైట్ ఫైరింగ్ అంటారు. ఈ కాన్సెప్ట్ కూడా ఎప్పట్నుంచో ఉంది.
ది గ్రేట్ రిజిగ్నేషన్ (The Great Resignation): ఈ పదం కరోనా తర్వాత పుట్టుకొచ్చింది. కరోనా తర్వాత వేలాది మంది ఉద్యోగులు రాజీనామాలు చేశారు. ఆకర్షణీయ జీతాలు, ప్యాకేజీలు ఇస్తామని కంపెనీలు భరోసా ఇచ్చినా, ధైర్యంగా కొలువులు వదిలేసి కొత్త మార్గాలను అన్వేషించారు. దీన్నే ‘ది గ్రేట్ రిజిగ్నేషన్’గా పిలుస్తారు.
లో హ్యాంగింగ్ ఫ్రూట్ (Low Hanging Fruit): ఏదైనా లక్ష్యాన్ని లేదా ఒక పనిని సులువుగా చేయవచ్చన్న అర్ధంతో ఈ పదాన్ని వాడుతారు. సులభంగా పూర్తయ్యే పనిని ఒక ఉద్యోగి ఎంచుకున్నప్పుడు, ఆ పనిని ఈ పదంతో పిలుస్తారు.
బైట్ ద బుల్లెట్ (Bite The Bullet): కష్టమైన పనిని చేయాలని సూచించేటప్పుడు ఈ పదాన్ని వాడుతున్నారు.
గివ్ 110% (Give 110%): నూటికి నూరు శాతం పని చేయడం అంటే పూర్తి సామర్థ్యంతో పని చేయడం అని అర్ధం. సామర్థ్యానికి మించి ఒక పనిని చేయాలని చెప్పాలనుకున్నప్పుడు కార్పొరేట్ కంపెనీల్లో ఈ పదాన్ని వాడుతుంటారు.
కోర్ కాంపిటెన్సీ (Core Competency): ఒక వ్యక్తి లేదా ఒక కంపెనీకి ఉన్న గొప్ప సామర్థ్యం ఇదీ అని చెప్పే సందర్భంలో కోర్ కాంపిటెన్సీ పదాన్ని వాడతారు. ఒక విధంగా స్పెషల్ టాలెంట్ అని కూడా అనుకోవచ్చు.
డ్రిల్ డౌన్ (Drill Down): ఒక పని లేదా ఒక విషయాన్ని మరింత లోతుగా విశ్లేషించాలి లేదా మరింత లోతుగా ఆలోచించాలి అన్న సందర్భంలో ఈ పదాన్ని వాడుతున్నారు. ఒక పనిని విజయవంతం చేయాలంటే సాధారణం కన్నా మరింత లోతైన అవగాహన పెంచుకోవాలని చెప్పే సందర్భంలో ఈ పదాన్ని సూచిస్తున్నారు.
నీ డీప్ (Knee Deep): మోకాలి లోతు నీటిలో ఉన్నారన్న అసలైన అర్థం. ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకున్నామనే అర్థంలో కార్పొరేట్ కంపెనీల్లో ఉపయోగిస్తున్నారు.