2-Seater Electric Car: ఇద్దరికి మాత్రమే సరిపోయే బుల్లి ఎలక్ట్రిక్ కార్ - ఫుల్ ఛార్జ్‌తో 177km రేంజ్
Microlino Electric Car: ప్రపంచంలోనే అతి చిన్న రెండు సీట్ల ఎలక్ట్రిక్ కార్ 'మైక్రోలినో'. కేవలం 2 గంటల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది, 177 km వరకు ప్రయాణించగలదు.

Microlino Electric Car Price, Range And Features In Telugu: యూరోపియన్ రోడ్ల మీద తిరుగుతున్న 'మైక్రోలినో' ఒక ప్రత్యేకమైన 2-సీటర్ ఎలక్ట్రిక్ కార్. దీనిని 8 సంవత్సరాల క్రితం పరిచయం చేశారు, అప్పటి నుంచి అప్‌డేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అతి చిన్న ఎలక్ట్రిక్ కార్. ఈ బండి డిజైన్ ఆకర్షణీయంగా ఉంటుంది & ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో కూడా పదే పదే కనిపిస్తుంది. ఇటీవల, కొత్త వేరియంట్ "మైక్రోలినో స్పియగ్గినా" (Microlino Spiaggina) లాంచ్ చేశారు. రెట్రో లుక్ & అడ్వాన్స్‌డ్ టెక్ అద్భుతమైన కలయిక ఈ కార్‌లో కనిపిస్తుంది.
మైక్రోలినో కార్ పనితీరు (Microlino Electric Car Performance)
వాస్తవానికి, మైక్రోలినో ఒక సాంప్రదాయ కారు కాదు. ఐరోపాలో ఇది 'క్వాడ్రిసైకిల్' కేటగిరీ కిందకు వస్తుంది. అంటే, ప్యాసింజర్ కార్లకు ఉంటే రూల్స్ దీనికి వర్తించవు. అంతకంటే చాలా సులభమైన నిబంధనల ప్రకారం రిజిస్టర్ చేసుకోవచ్చు. పేరుకే ఇది సైకిల్ కేటగిరీ, ఆక్సిలేటర్‌ను గట్టిగా తొక్కితే గంటకు 90 కి.మీ. వేగంతో దూసుకెళ్తుంది. బుల్లి కార్ అయినప్పటికీ భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడలేదు. ఆటోమోటివ్-గ్రేడ్ డిజైన్ ఆధారంగా దీని ఛాసిస్ తయారు చేశారు, కాబట్టి కార్ నిర్మాణం స్ట్రాంగ్‌గా & సురక్షితమైన కాక్‌పిట్ ఫీల్ ఇస్తుంది. ఓపెన్-టాప్‌తో కొత్త స్పియగ్గినా వెర్షన్ తీసుకొచ్చారు, సైడ్ & రియర్ విండోలు తొలగించారు. అవసరమైతే ఫాబ్రిక్ పైకప్పు ఏర్పాటు చేసుకోవచ్చు.
ఇంజిన్, బ్యాటరీ, ఛార్జింగ్ టైమ్, రేంజ్ (Microlino Electric Car Battery, Charging Time & Range)
మైక్రోలినో 12.5 kW ఎలక్ట్రిక్ మోటారుతో పవర్ తీసుకుంటుంది, ఇది గరిష్టంగా గంటకు 90 కి.మీ. వేగాన్ని అందిస్తుంది. ఈ వెర్షన్‌లో 10.5 kWh బ్యాటరీని అమర్చారు, దీనిని పూర్తిగా ఛార్జ్ చేస్తే 177 కి.మీ వరకు డ్రైవ్ రేంజ్ అందించగలదు. ఛార్జింగ్ కోసం 2.2 kW ఛార్జర్ ఇచ్చారు, దీనిని ఇంట్లోనే సులభంగా ఛార్జ్ చేయవచ్చు. హై-పవర్ ఛార్జర్‌ను ఉపయోగిస్తే ఈ కారును 2 నుంచి 4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.
సైజ్ & స్టోరేజ్(Microlino Electric Car Size & Storage)
మైక్రోలినో కేవలం 2.5 మీటర్లు (8 అడుగుల 3 అంగుళాలు) పొడవు ఉంటుంది, అతి చిన్న పార్కింగ్ స్థలంలో ఈజీగా ఒదిగిపోతుంది. ఈ 2-సీటర్ కార్ వెనుక భాగంలో 230 లీటర్ల (8 క్యూబిక్ అడుగులు) స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు, షాపింగ్ బ్యాగులు లేదా రోజువారీ ఉపయోగించే వస్తువులను నిల్వ చేయడానికి సరిపోతుంది.
మైక్రోలినో కార్ ధర (Microlino Electric Car Price)
మైక్రోలినో బేస్ మోడల్ రేటు యూరప్‌లో 17,000 పౌండ్లు (సుమారు 19,000 డాలర్లు లేదా రూ. 15.7 లక్షలు) నుంచి ప్రారంభం అవుతుంది. ప్రీమియం లుక్ & స్విస్ డిజైన్ కారణంగా ఈ కార్ స్టైల్ స్టేట్‌మెంట్‌గా మారింది. ధర ఎక్కువగా ఉన్నప్పటికీ దీనికోసం క్యూ కడుతున్నారు. ఈ కంపెనీ నుంచి ఇంకాస్త తక్కువ రేటులోనూ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.





















