TVS Record Sales: ఒకే నెలలో 5 లక్షలకు పైగా యూనిట్లు విక్రయించిన టీవీఎస్, అధిక డిమాండ్ ఉన్న బైకులివే
TVS మోటార్ ఆగస్టు నెలలో కొత్త రికార్డు సృష్టించింది. ఒక నెలలో 5 లక్షలకు పైగా టూ వీలర్స్ విక్రయించింది. అత్యధికంగా అమ్ముడైన టీవీఎస్ బైక్లు, స్కూటర్లు ఇవే.

TVS Motor Company | ఆగస్టు 2025లో టీవీఎస్ మోటార్స్ కొత్త రికార్డును నెలకొల్పింది. కంపెనీ మొదటిసారిగా ఒక నెలలో 5 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలను (Two Wheelers) విక్రయించింది. ఈ టైంలో మొత్తం 5,09,536 యూనిట్ల అమ్మకాలు జరిపింది. ఇది ఆగస్టు 2024తో పోలిస్తే దాదాపు 30 శాతం ఎక్కువ అని కంపెనీ తెలిపింది. ఇది TVS చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక నెలవారీ విక్రయాల రికార్డుగా నిలిచింది.
ద్విచక్ర వాహనాల విభాగంలో వృద్ధి
TVS ద్విచక్ర వాహనాల విభాగం అద్భుతమైన పనితీరును కనబరిచింది. ఆగస్టు 2024లో కంపెనీ టీవీఎస్ కంపెనీ 3,78,841 యూనిట్లను విక్రయించింది. ఆగస్టు 2025లో ఈ సంఖ్య ఏకంగా 4,90,788 యూనిట్లకు చేరింది. ఇందులో 30 శాతం వృద్ధి కనిపించింది. దేశీయ మార్కెట్లో కంపెనీ రికార్డు స్థాయిలో విక్రయాలు చేస్తోంది. 2024లో 2,89,073 ద్విచక్ర వాహనాల విక్రయాలు జరిగాయి. అయితే 2025లో ఈ సంఖ్య 3,68,862 యూనిట్లకు (Two Wheelers) పెరిగింది. అంటే దేశీయ మార్కెట్లో 28 శాతం వృద్ధి నమోదైంది.
బైక్, స్కూటర్లకు డిమాండ్
ఆగస్టు 2025లో TVS బైక్, స్కూటర్ రెండు విభాగాలలో మంచి వృద్ధిని సాధించింది. టీవీఎస్ కంపెనీ 2,21,870 మోటార్‌సైకిల్స్ విక్రయించింది, ఇది గత సంవత్సరంతో పోలిస్తే 30 శాతం ఎక్కువ. అదే సమయంలో స్కూటర్ల 2,22,296 యూనిట్లు అమ్మకం జరిగింది. ఇందులో 36 శాతం వృద్ధి కనిపించింది. TVS Apache సిరీస్, Jupiter, Raider 125ల పెరుగుతున్న డిమాండ్ కంపెనీ విక్రయాలను కొత్త శిఖరాలకు చేర్చుతోంది.
ఎలక్ట్రిక్ స్కూటర్లతో నంబర్ 1
TVS EV విభాగంలో తన స్థానాన్ని నిరూపించుకుంది. ఆగస్టు 2025లో కంపెనీ 25,138 ఎలక్ట్రిక్ వాహనాల్ని విక్రయించింది. ఇది గత ఆగస్టు 2024లో 24,779 యూనిట్ల కంటే ఎక్కువ. ఇటీవల కంపెనీ TVS Orbiter అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ఈవీ స్కూటర్ రూ. 1 లక్ష కంటే తక్కువ ధరలోనే కొనుగోలు చేయవచ్చు.
రికార్డు స్థాయిలో అమ్మకాల సీక్రెట్ ఇదే
TVS విజయం సాధించడానికి ప్రధాన కారణం దాని ఉత్పత్తితో పాటు కాలానికి తగ్గట్లుగా వాహనాలు తీసుకురావడం. టీవీఎస్ కంపెనీ బైక్‌లు, స్కూటర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు అన్ని విభాగాలలో మంచి పనితీరుతో దూసుకెళ్తోంది. దేశీయ మార్కెట్లు, అంతర్జాతీయ మార్కెట్లలో టీవీఎస్ కంపెనీ పట్టు మరింత బలపడుతోంది.
పండుగ సీజన్ సమీపిస్తోంది మరోవైపు కేంద్ర జీఎస్టీ తగ్గింపు చేస్తామని శుభవార్త చెప్పింది. టీవీఎస్ కంపెనీ త్వరలోనే అనేక కొత్త లాంచింగ్స్ ఉన్నాయి. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో TVS మోటార్ కంపెనీ అభివృద్ధికి మరిన్ని అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు 2025లో రికార్డు స్థాయిలో విక్రయాలు ద్విచక్ర వాహనాల పరిశ్రమలో టీవీఎస్ కంపెనీని స్ట్రాంగ్ మేకర్‌గా నిలబెట్టాయి.






















