Tesla Car: భారతీయ రోడ్లపై టెస్లా ప్రత్యక్షం, ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ఎలక్ట్రిక్ కారు ట్రయల్ రన్
Tesla Road Testing On Indian Roads: టెస్లా కంపెనీ త్వరలో భారతీయ మార్కెట్‌లోకి ప్రవేశించవచ్చన్న వార్తల నడుమ, మన దేశ రోడ్ల మీద ఈ కారు పరీక్ష కూడా ప్రారంభమైంది.

Tesla Model Y On Mumbai-Pune Expressway: భారతదేశంలో, టెస్లా కార్ల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. కొనగలిగిన సంపన్నులే కాదు, కొనలేని సామాన్యులు కూడా టెస్లా కార్‌ను ఒకసారి ప్రత్యక్షంగా చూడాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు, టెస్లా కార్లను త్వరలో భారతీయ రోడ్లపై చూడవచ్చని మనం నమ్మవచ్చు. ఇటీవల, ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే మీద టెస్లా మోడల్ Y టెస్టింగ్ మ్యూల్ కనిపించింది. దీనిని బట్టి, కంపెనీ CEO ఎలాన్ మస్క్ (Elon Musk), భారతదేశ రోడ్లపై టెస్లా కార్లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారని భావించవచ్చు.
ముంబై వీధుల్లో టెస్లా
ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే మీద మనకు కనిపించింది టెస్లా మోడల్ Y ఫేస్‌లిఫ్ట్ వెర్షన్. ఈ కారుకు జునిపర్ (Juniper) అనే కోడ్‌నేమ్ పెట్టారు. ఈ ఎలక్ట్రిక్ కారు యునైటెడ్ స్టేట్స్ (అమెరికా), కెనడా మార్కెట్లలో ఇప్పటికే సేల్ అవుతోంది. ఫేస్‌లిఫ్ట్ సహా మరికొన్ని అప్‌డేషన్స్‌తో భారతదేశంలోకి ఈ కారు రాబోతోందని తెలుస్తోంది.
టెస్లా కారు లుక్
టెస్లా కారులో సి-ఆకారపు టెయిల్ లైట్లు (C-shaped taillights) ఉన్నాయి. ఈ కారులో పొడవైన వంపు తిరిగిన రూఫ్ లైన్ & ట్విన్ స్పోక్ అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి. ఈ కారులో టెస్లా సిగ్నేచర్ గ్లాస్ రూఫ్‌ను కూడా ఫిక్స్ చేశారు. ఈ టెస్లా కారు ఆరు కలర్ ఆప్షన్స్‌తో భారతదేశంలోకి రావచ్చు. పెర్ల్ వైట్ (Pearl White), స్టెల్త్ గ్రే (Stealth Grey), డీప్ బ్లూ మెటాలిక్ (Deep Blue Metallic), అల్ట్రా రెడ్ (Ultra Red), క్విక్ సిల్వర్ (Quick Silver), డైమండ్ బ్లాక్ (Diamond Black) రంగులలో అందుబాటులోకి రావచ్చు.
టెస్లా కారు సింగిల్ ఛార్జ్ పరిధి
టెస్లా మోడల్ Y ఎలక్ట్రిక్ కారు లాంగ్ రేంజ్ బ్యాటరీతో రాబోతోంది, తద్వారా ఈ కారును ఎక్కువ దూరం సులభంగా నడపవచ్చు. టెస్లా మోడల్ Y ఎలక్ట్రిక్ కారు సింగిల్ ఛార్జింగ్‌లో 526 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వగలదు. ఈ ఎలక్ట్రిక్ SUV 4.6 సెకన్లలో 0 నుంచి 96 kmph వేగాన్ని అందుకోగలదు. ఈ కారు గరిష్ట వేగం గంటకు 200 కిలోమీటర్లు అని కంపెనీ ప్రకటించింది.
భారత్‌లో టెస్లా మొదటి కారు ఎప్పుడు లాంచ్ అవుతుంది?
టెస్లా మోడల్ Y ఎలక్ట్రిక్ కారులో 15.4 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అమర్చారు. ఈ కారులో వెనుక సీట్‌లో కూర్చున్న ప్రయాణీకుల కోసం 8 అంగుళాల స్క్రీన్ కూడా ఉంది. వెంటిలేటెడ్ సీట్లు, ADAS ఫీచర్, వైర్‌లెస్ ఛార్జింగ్ సహా అనేక అత్యాధునిక ఫీచర్లను టెస్లా మోడల్ Yలో చూడవచ్చు. భారతదేశంలో టెస్లా మొదటి కారు ఎప్పుడు లాంచ్ అవుతుందన్న విషయాన్ని ఆ కంపెనీ ఇంకా ప్రకటించలేదు. మనకు అందిన సమాచారం ప్రకారం, టెస్లా భారతదేశంలో లాంచ్ చేయబోయే మొదటి కారు మోడల్ Y కావచ్చు.



















