Tata Car: టాటా కారు కొంటే టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు! సర్కారు వారి రాయితీ
Road Tax on Electric Vehicles: దక్షిణ భారతదేశంలోని ఒక రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు పన్ను విధానంలో సవరణలు చేసింది. ఇప్పుడు టాటా కారు కొనడం అక్కడ చాలా చవకగా మారింది.

Road Tax Exemption on Tata Harrier EV: భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఈ వాహనాలను ప్రోత్సహించడంలో ప్రభుత్వాలతో పాటు ఆటోమొబైల్ కంపెనీలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో పాటు దాదాపు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి కొత్త విధానాలను రూపొందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కర్ణాటక ప్రభుత్వం రోడ్డు పన్ను విధానంలో కొన్ని సవరణలు చేసింది. దీనివల్ల, ఆ రాష్ట్రంలో టాటా హారియర్ EVని కొనుగోలు చేయడం చాలా చవకగా మారింది, ఒక్కో కొనుగోలుపై రూ. 2.50 లక్షలు ఆదా అవుతాయి.
రోడ్డు పన్ను విధానంలో కర్ణాటక ప్రభుత్వం చేసిన మార్పుల ప్రకారం.. రూ. 25 లక్షల కంటే ఎక్కువ ఎక్స్-షోరూమ్ ధర కలిగిన ఎలక్ట్రిక్ కార్లు వాటి ఎక్స్-షోరూమ్ ధరలో 10 శాతానికి సమానమైన రోడ్డు పన్ను మొత్తాన్ని చెల్లించాలి. టాటా హారియర్ లాంగ్ రేంజ్ వేరియంట్‌ను కొనుగోలు చేయడానికి ఈ మార్పు అనుకూలంగా మారింది.
ఎన్ని లక్షల రూపాయలు ఆదా అవుతాయి?
టాటా హారియర్ లాంగ్ రేంజ్ వేరియంట్ అయిన "ఫియర్‌లెస్+ 75kWh వేరియంట్" ఎక్స్-షోరూమ్ ధర (Tata Harrier EV ex-showroom price) రూ. 24.99 లక్షలు. సవరించిన నిబంధనల ప్రకారం ఈ మోడల్ 10 శాతం రోడ్డు పన్ను నుంచి మినహాయింపు పొందుతుంది. అంటే ఈ కారును కొనుగోలు చేయడం వల్ల ప్రతి కస్టమర్‌కు రూ. 2.50 లక్షలు ఆదా అవుతుంది. దీంతో పాటు.. టాటా మోటార్స్, హారియర్ EV కొనుగోలు చేసే ప్రస్తుత EV కస్టమర్లకు 1 లక్ష రూపాయల ప్రత్యేక లాయల్టీ ప్రయోజనాన్ని అందిస్తోంది. కస్టమర్‌కు ఈ రూపంలోనూ బెనిఫిట్ అందుతుంది.
టాటా హారియర్ EV ఫీచర్లు
ఫ్యూచరిస్టిక్ & స్మార్ట్ SUV అనుభవాన్ని అందించేలా టాటా హారియర్ EVని (Tata Harrier EV Features) రూపొందించారు. ఈ బండి డిజైన్ అటు ఫ్యామిలీలను & ఇటు కుర్రకారును అందరినీ ఆకట్టుకుంటుంది. ఇంటీరియర్‌లో.. డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్ & ప్రీమియం ఫినిషింగ్ ఉంటుంది. దీనివల్ల కారులో కూర్చున్న వాళ్లకు లగ్జరీ ఫీలింగ్ కలుగుతుంది. పెద్ద 36.9 సెం.మీ QLED టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కారులో అమర్చారు, ప్రయాణం కొనసాగింత సేపు వినోదానికి కొదవ ఉండదు. పనోరమిక్ సన్‌రూఫ్ కూడా అద్భుతమైన ప్రయాణ అనుభూతిని అందిస్తుంది.
డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, కీలెస్ ఎంట్రీ, ఫోన్ యాక్సెస్ వంటి ఫీచర్లు హారియర్ EVని ఒక స్మార్ట్ కారును మార్చాయి. డ్రైవింగ్ మరింత సురక్షితంగా & సౌకర్యవంతంగా ఉండడానికి 540-డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా & E-iRVM (ఎలక్ట్రానిక్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్) వంటి ఫీచర్లను టాటా మోటార్స్ యాడ్ చేసింది.





















