Renault Kwid ఎలక్ట్రిక్ కారు కొత్త ఫేస్‌లిఫ్ట్ లాంచ్ - కొత్త డిజైన్, మెరుగైన సేఫ్టీతో వచ్చిన E-Tech EV
Renault Kwid E-Tech ఎలక్ట్రిక్ కారు బ్రెజిల్‌లో అధికారికంగా ఆవిష్కరించింది. కొత్త డిజైన్, మెరుగైన ఫీచర్లు, భద్రతా సాంకేతికతలతో 180 కి.మీ. రేంజ్ అందిస్తుంది.

Renault Kwid Electric Facelift Range Features: రెనాల్డ్ కంపెనీ, తన అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు “క్విడ్ ఈ టెక్” (Renault Kwid E-Tech)ను కొత్త ఫేస్‌లిఫ్ట్ రూపంలో ఆవిష్కరించింది. ఈ కొత్త వెర్షన్... డిజైనింగ్, సేఫ్టీ ఫీచర్లు, పనితీరు అన్నింటిలోనూ పాత మోడల్ కంటే మెరుగ్గా ఉంది. రెనాల్డ్ కంపెనీ ఈ కారును బ్రెజిల్‌లో ఆవిష్కరించింది. అక్కడి మార్కెట్లో దీని ధర సుమారు ₹12.7 లక్షలు (టెక్నో వేరియంట్)గా ఉంది.
కొత్త లుక్ - అర్బన్ స్టైల్‌తో ఆకట్టుకునే డిజైన్
కొత్త క్విడ్ ఈ-టెక్‌ను, రెనాల్డ్ తాజా డిజైన్ థీమ్ ఆధారంగా రూపొందించారు. కారు ముందు, వెనుక భాగాల్లో పియానో బ్లాక్ & మ్యాట్ ఫినిష్ టచ్‌లు ఇవ్వడం వల్ల కారు చాలా ఆధునికంగా కనిపిస్తోంది. కొత్త LED DRLs, కారు ఓవరాల్ లుక్స్‌కు షార్ప్‌నెస్ తెచ్చాయి. బ్లాక్ బంపర్లు, తీర్చిదిద్దిన బోనెట్, డోర్ల వద్ద ప్లాస్టిక్ క్లాడింగ్ - ఇవన్నీ SUV తరహా ఫీలింగ్ ఇస్తున్నాయి.
కొత్త క్విడ్ ఈ-టెక్ పొడవు 3,701 మిల్లీమీటర్లు, వెడల్పు 1,767 మిల్లీమీటర్లు, ఎత్తు 1,534 మిల్లీమీటర్లు. వీల్‌బేస్ 2,423 మిల్లీమీటర్లు కాగా, బూట్ స్పేస్ 290 లీటర్లు ఉంది - ఈ కారు సైజులో ఇది పెద్ద ప్లస్ పాయింట్.
ఇంటీరియర్ - పాత స్టైల్‌కి కొత్త టచ్
కారు లోపలకి అడుగు పెట్టినప్పుడు ఓల్డ్ స్టైల్ డ్యాష్‌బోర్డ్ కనిపించినా, కొత్త టెక్నాలజీ ఫీచర్లు కస్టమర్లను ఆకట్టుకుంటాయి. 7 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ప్రధాన ఆకర్షణ. ఇది ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేస్తుంది. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్, సిల్వర్ గార్నిష్ వెంట్స్, మాన్యువల్ క్లైమేట్ కంట్రోల్ డయల్స్ వంటివన్నీ సింపుల్‌గా, యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నాయి.
భద్రత - ADASతో లెవల్ అప్
కొత్త క్విడ్ ఈ టెక్ సేఫ్టీ విభాగంలో కూడా అప్‌డేట్ అయింది. ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ముందు-వెనుక పార్కింగ్ సెన్సర్లు, క్రూయిజ్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ ఉన్నాయి. అదనంగా, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీపింగ్ అసిస్ట్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ వంటి 11 ADAS ఫీచర్లు కూడా ఇచ్చారు.
పనితీరు - 180 కి.మీ. రేంజ్
ఈ కారు 26.8 kWh లిథియం అయాన్ బ్యాటరీతో వస్తుంది. 48 kW (65 hp) శక్తినిచ్చే మోటార్‌తో ఇది 130 kmph గరిష్ట వేగాన్ని అందిస్తుంది. 0-100 kmph వేగం అందుకోవడానికి సుమారు 14.6 సెకన్లు పడుతుంది. INMETRO టెస్ట్ ప్రకారం దీని డ్రైవింగ్ రేంజ్ 180 కి.మీ.గా ఉంది. అంటే, ఫుల్ ఛార్జింగ్‌తో 180 కి.మీ. దూరాన్ని కవర్ చేయవచ్చు. AC ఛార్జింగ్ 7 kW వరకు, DC ఫాస్ట్ ఛార్జింగ్ 30 kW వరకు సపోర్ట్ చేస్తుంది.
కొత్త రెనాల్డ్ క్విడ్ ఈ-టెక్. బ్రెజిల్ ఎలక్ట్రిక్ మార్కెట్‌కి మరింత బలాన్నిచ్చే మోడల్‌గా నిలిచింది. లుక్, ఫీచర్లు, సేఫ్టీ, ఛార్జింగ్ సామర్థ్యం - అన్నీ కలిపి ఈ చిన్న కారు ఇప్పుడు మరింత స్మార్ట్‌గా మారింది. అయితే ఈ మోడల్ భారత మార్కెట్లోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.





















