Diesel Vehicles Ban: డీజిల్ వాహనాలపై నిషేదం? కేంద్రం ముందుకు కీలక ప్రతిపాదన!
కేంద్ర ప్రభుత్వం ముందుకు కీలక ప్రతిపాదన వచ్చింది. 2027 నాటికి ఫోర్-వీలర్ డీజిల్ వాహనాలను పూర్తిగా నిషేధించాలని కేంద్రం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఈ నివేదిక అందించింది.
వాహనాల నుంచి వచ్చే కాలుష్యాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. 2027 నాటి దేశంలో డీజిల్‌తో నడిచే ఫోర్-వీలర్ వాహనాల వినియోగాన్ని పూర్తి స్థాయిలో నివారించాలని భావిస్తోంది. వాహనాల నుంచి విడుదలయ్యే ఉద్గారాలను తగ్గించేందుకు వినియోగదారులు ఎలక్ట్రిక్, గ్యాస్ తో నడిచే వాహనాలకు మారేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని చమురు మంత్రిత్వ శాఖ ప్యానెల్ సూచించింది.
భారత్ లో ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఉద్గారాలను వెదజల్లే వాహనాల వినియోగాన్ని చాలా వరకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 2070 నాటికి దేశంలో ఉద్గారాలను వెదజల్లే వాహనాలు లేకుండా చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఏర్పాటు చేసిన చమురు శాఖ మాజీ కార్యదర్శి తరుణ్ కపూర్ నేతృత్వంలోని ఇంధన పరివర్తన సలహా కమిటీ కీలక సిఫార్సులు చేసింది. 2030 నాటికి, పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ సిటీ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలి సూచించింది. 2024 నుంచి ఎక్కువ జనాభా ఉన్న నగర రవాణా కోసం డీజిల్ బస్సులను వినియోగించకూడదనే నిబంధనను తీసుకురావాలని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ఈ నివేదికను పొందుపరిచింది. అయితే, ఈ కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడానికి పెట్రోలియం మంత్రిత్వ శాఖ క్యాబినెట్ ఆమోదం పొందుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
ఇంధన కమిటీ చేసిన సిఫార్సులు ఇవే!
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు, ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ స్కీమ్ (FAME) కింద ఇచ్చిన ప్రోత్సాహకాల గడువును పెంచాలని ఇంధన పరివర్తన సలహా కమిటీ కోరింది. 2024 నుంచి విద్యుత్‌తో నడిచే సిటీ డెలివరీ వాహనాలకు మాత్రమే కొత్త రిజిస్ట్రేషన్‌లను అనుమతించాలని ప్యానెల్ సూచించింది. కార్గో తరలింపు కోసం రైల్వేలు, గ్యాస్‌తో నడిచే ట్రక్కులను మాత్రమే ఎక్కువగా వినియోగించాలని వెల్లడించింది. రెండు మూడేళ్లలో రైల్వే నెట్‌వర్క్ పూర్తిగా ఎలక్ట్రిక్‌గా మారనున్నట్లు తెలిపింది. డీజిల్‌తో నడిచే కార్లు, ట్యాక్సీలను నెమ్మదిగా నిషేధించాలని కోరింది. వీటిలో సగం వాహనాలను ఇథనాల్ కలిపిన పెట్రోల్‌తో నడిపే వాహనాలతో భర్తీ చేయాలని సూచించింది. మిగిలిన 50 శాతం వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలతో భర్తీ చేయాలన్నది. ఎలక్ట్రిక్ వాహనాలకు మారేంత వరకు సీఎన్‌జీని ప్రత్యామ్నాయ ఇంధనంగా వినియోగించాలని సూచించింది.
2070 టార్గెట్ గా కేంద్రం కీలక చర్యలు
వాస్తవానికి కర్బన ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేసే దేశాల్లో భారత్ ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతోంది. 2030 నాటికి దేశాన్ని కర్బన ఉద్గార రహిత దేశంగా మార్చేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ దిశగా కీలక చర్యలు చేపడుతోంది. 2030 నాటికి దేశంలో వినియోగించే మొత్తం ఇంధనంలో 50 శాతం పునరుత్పాదక ఇంధనం ఉండేలా చూసుకునేందుకు భారత్ టార్గెట్ గా పని చేస్తోంది. 2070 నాటికి నెట్ జీరో సాధించడానికి అసవరం అయిన అన్ని చర్యలను చేపడుతోంది.
Read Also: సమ్మర్‌లో మీ కారును జాగ్రత్తగా కాపాడుకోవాలంటే, ఈ టిప్స్ తప్పకుండా పాటించాల్సిందే!