Nissan Honda Tie Up: చేతులు కలపనున్న నిస్సాన్, హోండా - చైనా కంపెనీల దూకుడుకు చెక్ పెట్టడానికే!
Nissan Honda: ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో చైనా కంపెనీల ఆధిపత్యానికి చెక్ పెట్టడం కోసం హోండా, నిస్సాన్ చేతులు కలపనున్నాయి.
Nissan and Honda: ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో చైనా కంపెనీల ఆధిపత్యానికి ఎదురుదెబ్బ తగలనుంది. ఇందుకోసం పలు ఆటోమొబైల్ కంపెనీలు చేతులు కలిపేందుకు అంగీకరించాయి. చైనీస్ కార్లతో పోలిస్తే చవకైన, మెరుగైన కార్లను మార్కెట్లోకి తీసుకురావడమే కంపెనీల లక్ష్యం. ఇందుకోసం హోండా, నిస్సాన్‌లు కూడా చేతులు కలుపుతున్నాయి.
నిక్కీ ఆసియా నివేదిక ప్రకారం జపాన్‌కు చెందిన నిస్సాన్, హోండా కలిసి రావాలని నిర్ణయించుకున్నాయి. తద్వారా మార్కెట్లో చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ తగ్గుతుంది. ఈ కంపెనీలతో కలిసి రావడం వెనక ఉద్దేశ్యం కార్ల తయారీ వ్యయాన్ని తగ్గించడం. దీని ద్వారా మరింత చవకైన కార్లను మార్కెట్లో విడుదల చేయవచ్చు.
నిస్సాన్ మొదటి ఎలక్ట్రిక్ కారు లీఫ్‌ను 2009 సంవత్సరంలో విడుదల చేసింది. దీని తర్వాత ప్రజలు నిస్సాన్‌కు సంబంధించిన అరియా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఇష్టపడ్డారు. కానీ అప్పటి నుంచి మార్కెట్లో కంపెనీకి చెందిన మరే ఇతర ఎలక్ట్రిక్ కారు ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయింది. అదే సమయంలో హోండా కూడా ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయింది. హైబ్రిడ్ వాహనాలను మార్కెట్లోకి తీసుకురావడంపై హోండా ఎక్కువ శ్రద్ధ చూపింది. ఇప్పుడు ఈ రెండు కార్ల తయారీదారులు తక్కువ ధరలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడంపై దృష్టి సారిస్తున్నారు.
చైనా కంపెనీలకు చెక్ పెట్టడం కోసం...
చైనాయేతర కంపెనీలతో కలసి రావడం వెనుక చాలా కారణాలున్నాయి. కారు ధర విషయంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీదారుల మధ్య పోటీ నెలకొంది. చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు బీవైడీ, ఎన్ఐవో నిరంతరం మార్కెట్లోకి కార్లను విడుదల చేస్తున్నాయి. చైనాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీల కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ కారణంగా ఇతర కంపెనీలు ఏకతాటిపైకి రావడానికి సిద్ధమవుతున్నాయి.