New Maruti Brezza: మారుతి బ్రెజా కొత్త మోడల్ వస్తోంది, ఫీచర్స్ మామూలుగా లేవుగా
మారుతి సుజుకీ బ్రెజా సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ నెల 30 నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.
మారుతి బ్రెజా కొత్త మోడల్‌లో అదిరిపోయే ఫీచర్లు
మారుతి నుంచి వచ్చిన మోడల్స్‌లో ఈ మధ్య కాలంలో మార్కెట్‌లో మంచి డిమాండ్ సొంతం చేసుకుంది విటారా బ్రెజా. నగరాల్లో ఎక్కడ చూసినా ఇప్పుడివే కార్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడిదే సిరీస్‌లో మరో కొత్త బ్రెజాను విడుదల చేస్తోంది మారుతి సంస్థ. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, సన్‌ప్రూఫ్ లాంటి కొత్త ఫీచర్లతో న్యూ మోడల్‌ని తయారు చేసింది. బుకింగ్స్ కూడా ప్రారంభించింది. భారత్‌లో ఈ నెల 30వ తేదీన ఈ కార్ లాంచ్ చేయనున్నారు. ఈ కొత్త బ్రెజా మోడల్‌ని సొంతం చేసుకోవాలనుకునేవారు రూ.11,000 వేలు కట్టి బుక్ చేసుకోవచ్చు. అంతకు ముందు మోడల్‌తో పోల్చి చూస్తే.. ఈ కొత్త బ్రెజాలోని ఇంజిన్‌లో కొన్ని మార్పులు చేశారు. 6-స్పీడ్ ఆటోమెటిక్ టార్క్ కన్‌వర్టర్ గేర్‌బాక్స్‌తో కొత్త మోడల్ ఇంజిన్‌ను తయారు చేశారు. స్టాండర్డ్‌గా మాన్యువల్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. వీటితో మరో కొత్త ఫీచర్ యాడైంది.
ఫ్యుయెల్ ఎఫీషియెన్సీని పెంచేందుకు వీలుగా ఐడిల్ స్టార్ట్, స్టాప్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా ఫ్యుయెల్ ఎక్కువగా ఖర్చు కాకుండా ఉంటుంది. పాత బ్రెజాకి విటారా బ్రెజా అని పేరు పెట్టిన సంస్థ కొత్త మోడల్‌కి మాత్రం సింపుల్‌గా బ్రెజా అని మాత్రమే ఉంచింది. ఎలక్ట్రిక్ సన్‌ప్రూఫ్, 6ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ లాంటి ఫీచర్లనూ జోడించింది. ఇంటీరియర్‌లోనూ చాలానే మార్పులు ఉంటాయని సంస్థ చెబుతోంది. ఈ మోడల్‌లో డీజిల్ వెహికిల్ లేదన్న లోటుని హైబ్రిడ్ పెట్రోల్ పవర్‌ట్రైన్ ఫీచర్ తీరుస్తుందని అంటోంది మారుతీ కంపెనీ. లుక్ పరంగానూ మార్పులు చేర్పులు చేశారు. బలెనో, XL6, ఎర్టిగా తరవాత మారుతీ సుజుకీ సంస్థ రిలీజ్ చేస్తున్న మోడల్ ఇదే. ఎరీనా డీలర్‌షిప్స్ ద్వారా వీటిని విక్రయిస్తున్నట్టు సంస్థ ప్రకటించింది.