Maruti e Vitara కొత్త లాంచ్ డేట్ వచ్చింది, ఈ కారులో ఎలాంటి స్మార్ట్ ఫీచర్లు ఉంటాయో తెలుసా?
Maruti First Electric SUV India: ఇ విటారా రెండు బ్యాటరీ ఎంపికలతో అందుబాటులోకి వస్తుంది, అవి: 48.8 kWh & 61.1 kWh. ఈ కారు 500 కి.మీ.ల పరిధిని కలిగి ఉంటుందని అంచనా.

Maruti e Vitara Latest Launch Date And Features: మారుతి సుజుకి తొలి ఎలక్ట్రిక్ కారు, ఇ-విటారా కోసం ప్రజలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి, ఈ ఎలక్ట్రిక్ SUV ని 2025 సెప్టెంబర్ 3న లాంచ్ చేయాలని కంపెనీ గతంలో నిర్ణయించింది. మారుతి తొలి ఎలక్ట్రిక్ SUV ఎలా ఉంటుందో చూడాలని సెప్టెంబర్ 3 వరకు వాహన ప్రియులు ఆసక్తిగా ఎదురు చూసినప్పటికీ, వారికి నిరాశ ఎదురైంది. ఆ రోజున ఈ EV లాంచ్ కాలేదు, దీనికి కారణాలు తెలియరాలేదు. ఇప్పటికీ, భారతదేశంలో ఈ కారు ఖచ్చితమైన లాంచ్ తేదీ అధికారికంగా ఇంకా తెలియదు, కొన్ని అనధికారిక తేదీలు మాత్రం వినవస్తున్నాయి. ఇప్పుడు, భారతదేశం వెలుపల (విదేశీ మార్కెట్లలో), ఈ వాహనం లాంచ్ గురించిన వివరాలను మారుతి సుజుకీ షేర్ చేసింది. మారుతి సుజుకి వెల్లడించిన ప్రకారం, ఇ-విటారా జనవరి 16, 2026న ఓవర్సీస్ మార్కెట్లలో లాంచ్ అవుతుంది. ఈ కారును గుజరాత్‌లోని హన్సల్‌పూర్ ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు.
మారుతి ఇ-విటారా బ్యాటరీ ప్యాక్
మారుతి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఇ-విటారాను ప్రీమియం ఫీచర్లతో తయారు చేస్తున్నారు. LED హెడ్‌లైట్లు, DRLs (డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్) & టెయిల్ ల్యాంప్‌లు వంటి ఫీచర్లను కంపెనీ అందించవచ్చు. ఈ SUV లో 18-అంగుళాల చక్రాలు & యాక్టివ్ ఎయిర్ వెంట్ గ్రిల్ కూడా ఉంటాయి, ఇది ఏరోడైనమిక్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఈ-విటారా రెండు బ్యాటరీ ఎంపికలతో అందుబాటులోకి వస్తుందని కంపెనీ గతంలోనే పెల్లడించింది, అవి: 48.8 kWh బ్యాటరీ ప్యాక్ & 61.1 kWh బ్యాటరీ ప్యాక్. ఈ కారు 500 కి.మీ. డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేసింది. వాస్తవ పరిధి డ్రైవింగ్ శైలి & ట్రాఫిక్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
మారుతి ఇ-విటారా కీ ఫీచర్లు
మారుతి ఇ-విటారాలో పనోరమిక్ సన్‌రూఫ్, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్ & 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ & 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి డిజిటల్ ఫీచర్లు ఉంటాయి. ఈ సిస్టమ్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు మద్దతు ఇస్తుంది.
మారుతి ఇ-విటారా సేఫ్టీ ఫీచర్లు
ప్రయాణీకుల భద్రత కోసం మారుతి ఇ-విటారా చాలా భద్రత సాంకేతికతలతో వస్తుందని భావిస్తున్నారు. లేన్ కీప్ అసిస్ట్ & అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి అధునాతన భద్రత లక్షణాలను అందించవచ్చు. డ్రైవర్ & ప్రయాణీకుల భద్రత కోసం 7 ఎయిర్ బ్యాగ్‌లను ఏర్పాటు చేయవచ్చు. ఇ-విటారా ఇతర భద్రతా లక్షణాలలో - బ్లైండ్ స్పాట్ మానిటర్, టైర్ ప్రెజర్ మానిటర్, 360-డిగ్రీ కెమెరా, ముందు & వెనుక పార్కింగ్ సెన్సార్లు ఉంటాయి.
మారుతి ఇ-విటారా ధర
మారుతి సుజుకి ఇ-విటారా ప్రారంభ ధర రూ. 17 లక్షల నుంచి రూ. 18 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుందని అంచనా. టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 25 లక్షల వరకు ఉండవచ్చు.





















