Hyundai Affordable EV: త్వరలో హ్యుండాయ్ చవకైన ఎలక్ట్రిక్ కారు - ప్రకటించిన కంపెనీ అధికారి!
హ్యుండాయ్ మనదేశంలో త్వరలో చవకైన ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసే అవకాశం ఉంది.
హ్యుండాయ్ మనదేశంలో చిన్న, చవకైన ఎలక్ట్రిక్ కారును రూపొందిస్తుందని తెలుస్తోంది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో పట్టు సాధించడానికి హ్యుండాయ్ ఈ కారును రూపొందిస్తుందని సమాచారం. త్వరలో దీనికి సంబంధించిన ప్రీమియం మోడళ్లు కూడా రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
చార్జింగ్ ఎకో సిస్టం, సేల్స్ నెట్‌వర్క్, తయారీ, అసెంబుల్ చేయడం ఇలా వేర్వేరు విభాగాలు దీనిపై పని చేస్తున్నాయని హ్యుండాయ్ ఇండియా సేల్స్, మార్కెటింగ్, సర్వీస్ డిపార్ట్‌మెంట్ల డైరెక్టర్ తరుణ్ గర్గ్ తెలిపారు. వీలైనంత లోకలైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. విడి భాగాలు కూడా ఇక్కడే తయారైతే ధరలు మరింత తగ్గుతాయని తరుణ్ గర్గ్ అభిప్రాయపడ్డారు.
ఈ కారును ఎప్పుడు లాంచ్ చేస్తారో తెలుపలేదు కానీ సరైన టైమింగ్‌లో, సరైన ధరతో దీన్ని అందుబాటులోకి తీసుకువస్తామని తరుణ్ గర్గ్ వెల్లడించారు. దీనికి సంబంధించిన ఎకో సిస్టం, ముఖ్యంగా సరిపడా చార్జింగ్ స్టేషన్లు సిద్ధం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు.
మనదేశంలో రూ.400 కోట్ల పెట్టుబడులను హ్యుండాయ్ పెట్టనుంది. అందులో భాగంగానే ఈ కారును రూపొందిస్తుంది. 2028 నాటికి ఆరు ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేయాలనేది హ్యుండాయ్ లక్ష్యం. ప్రస్తుతం మనదేశంలో కార్ల మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల షేర్ కనీసం ఒక్క శాతం కూడా లేదు. 2030 నాటికి దీన్ని 30 శాతానికి తీసుకెళ్లాలనేది ప్రభుత్వం లక్ష్యం.
ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో ఎంట్రీ ఇచ్చే లోపు హ్యుండాయ్ అయోనిక్ 5 లాంటి ఎలక్ట్రిక్ క్రాస్ ఓవర్ కార్లను లాంచ్ చేసే అవకాశం ఉంది. అయోనిక్ 5 ప్రస్తుతానికి అమెరికాలో అందుబాటులో ఉంది. అక్కడ దీని ధర 44 వేల డాలర్లుగా (సుమారు రూ.34 లక్షలు) నిర్ణయించారు. 480 కిలోమీటర్ల రేంజ్‌ను ఇది అందించనుంది.
హ్యుండాయ్ 2019లో మనదేశంలో కోనా ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేసింది. మార్కెట్‌ను పరీక్షించడానికి ఈ కారు లాంచ్ అయింది. అయితే దీని ధర ఎక్కువ కావడం, పబ్లిక్ చార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తక్కువగా ఉండటంతో ఇది ఆశించిన స్థాయిలో అమ్ముడుపోలేదు.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?