మీ బైక్, కారులో E20 ఇంధనం పోస్తే బీమా కవరేజ్ రద్దువుతుందా? ఐసీఐసీఐ లాంబార్డ్ క్లారిటీ!
E20 పెట్రోల్ వాడితే వాహన బీమా రద్దవుతుందన్న వార్తలు వ్యాపించిన నేపథ్యంలో, ఈ విషయంపై ఐసీఐసీఐ లాంబార్డ్ ఒక స్పష్టత ఇచ్చింది.

E20 Petrol Insurance: దేశవ్యాప్తంగా పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న E20 ఇంధన విధానం నేపథ్యంలో, వాహనదారుల్లో ఇటీవల ఒక సందేహం తలెత్తింది. ముఖ్యంగా 2023 ఏప్రిల్‌కు ముందు తయారైన కార్లు, బైక్‌లలో E20 పెట్రోల్ వాడితే వాహన బీమా (Vehicle Insurance) చెల్లదని, ప్రమాదం జరిగినా క్లెయిమ్‌లు తిరస్కరిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ ప్రచారం లక్షలాది మంది వాహనదారుల్లో ఆందోళనకు కారణమైంది.
ఈ వార్తలపై ప్రముఖ బీమా సంస్థ ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ (ICICI Lombard) కీలక స్పష్టత ఇచ్చింది. E20 పెట్రోల్ వాడటం వల్ల మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలు రద్దు కావని, క్లెయిమ్‌లపై ఎలాంటి ప్రభావం ఉండదని సంస్థ స్పష్టం చేసింది.
అసలు ఈ గందరగోళమంతా ఎందుకు వచ్చింది?
E20 అంటే 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ మిశ్రమంతో తయారయ్యే ఇంధనం. దేశంలో చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడం కోసం కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రోత్సహిస్తోంది. అయితే, E20 ఇంధనానికి పూర్తిగా అనుకూలంగా లేని పాత వాహనాల్లో ఇంజిన్ భాగాలపై ప్రభావం పడే అవకాశం ఉందని కొన్ని నివేదికలు వెలువడ్డాయి. దీంతో "E20 వాడితే ఇంజిన్ దెబ్బతింటుంది... బీమా కంపెనీలు క్లెయిమ్‌లు తిరస్కరిస్తాయి" అనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఐసీఐసీఐ లాంబార్డ్ ఏం చెప్పింది?
ఈ ప్రచారంపై స్పందించిన ఐసీఐసీఐ లాంబార్డ్, E20 ఇంధనం వినియోగించినా మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ చెల్లుబాటుకు ఎలాంటి భంగం కలగదని తెలిపింది. అంతేకాకుండా, పాత వాహనాల్లో E20 వాడటాన్ని సంస్థ నిర్లక్ష్యంగా పరిగణించబోదని స్పష్టం చేసింది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రగతిశీల చర్యగా E20 ఇంధనాన్ని చూస్తున్నామని పేర్కొంది.
ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు దేని ఆధారంగా ఇస్తారు?
మోటార్ ఇన్సూరెన్స్ అనేది పాలసీ నిబంధనల ప్రకారం పనిచేస్తుంది. సాధారణంగా ఈ కింది సందర్భాల్లో క్లెయిమ్‌లు మంజూరు అవుతాయి:
రోడ్డు ప్రమాదాలు
వాహన దొంగతనాలు
థర్డ్ పార్టీ నష్టపరిహారం
ఓనర్-డ్రైవర్ వ్యక్తిగత ప్రమాద కవరేజ్
ప్రయాణికుల ప్రమాద కవరేజ్
వాహనంలో పెట్రోల్, డీజిల్, CNG లేదా E20 ఏ ఇంధనం వాడుతున్నారన్న అంశానికి బీమా క్లెయిమ్‌తో ప్రత్యక్ష సంబంధం లేదని సంస్థ స్పష్టం చేసింది.
ఇంజిన్ పాడైతే బీమా వస్తుందా?
ఇక్కడ ఒక విషయం వాహనదారులు గుర్తుంచుకోవాలి. ప్రమాదం కారణంగా వాహనానికి నష్టం జరిగితే సాధారణ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. కానీ కాలక్రమేణా ఇంజిన్‌లో ఏర్పడే అరుగుదల, సహజ నష్టం లేదా ఇంధన ప్రభావంతో ఏర్పడే సమస్యలు సాధారణ బీమా పరిధిలోకి రావు. E20 పెట్రోల్‌కే కాదు, సాధారణ పెట్రోల్ వాడినా ఇదే నిబంధన వర్తిస్తుంది. అలాంటి సందర్భాల్లో "ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్" వంటి అదనపు యాడ్-ఆన్ పాలసీలు తీసుకుంటే మాత్రమే ప్రయోజనం ఉంటుంది.
వాహనదారులు ఏం చేయాలి?
నిపుణుల సూచన ప్రకారం, E20 పెట్రోల్‌పై అనవసర భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ వాహనానికి సరైన బీమా పాలసీ ఉందా లేదా అనేది మాత్రమే పరిశీలించాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంధన విధానాలకు అనుగుణంగానే బీమా సేవలు కొనసాగుతాయని బీమా రంగ నిపుణులు చెబుతున్నారు.
మొత్తానికి, E20 పెట్రోల్ వాడితే ఇన్సూరెన్స్ రద్దవుతుంది, క్లెయిమ్‌లు రావు అనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టమైంది. వాహన బీమా పాలసీ నిబంధనల ప్రకారమే క్లెయిమ్‌లు మంజూరవుతాయి. ICICI Lombard ఇచ్చిన క్లారిటీతో, దేశవ్యాప్తంగా లక్షలాది మంది వాహనదారుల సందేహాలకు తెరపడినట్టైంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















