కొత్త ఏడాది ప్రారంభం నుంచే షాక్: 2026 జనవరి నుంచి కార్ల ధరలు పెంపు - ఏ బ్రాండ్ ఎంత పెంచుతోందంటే?
2026 జనవరి 1 నుంచి మన దేశంలో కార్ల ధరలు పెరగనున్నాయి. హోండా, నిస్సాన్, ఎంజీ, బీవైడీ, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ ధరల పెంపు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Car Price Hike India 2026: కొత్త సంవత్సరం దగ్గరపడుతున్న వేళ, 2026లో కారు కొనాలనుకునే వారికి కారు తయారీ కంపెనీలు పెద్ద షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. భారత్‌లో మాస్ సెగ్మెంట్ నుంచి లగ్జరీ సెగ్మెంట్ వరకు, కార్ల ధరలను పెంచుతున్నట్లు ఇప్పటి వరకు ఆరు ప్రముఖ కంపెనీలు అధికారికంగా ప్రకటించాయి. ఈ కొత్త ధరలు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
ప్రతి సంవత్సరం ప్రారంభంలో జరిగే వార్షిక ధరల సవరణలో భాగంగానే ఈ పెంపులు చేస్తున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి. ముడి పదార్థాల ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం, ఫారెక్స్ మార్పులు, ప్రపంచ సరఫరా గొలుసు అంతరాయాలు వంటి అంశాలే ప్రధాన కారణాలని కార్ తయారీ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. మిగతా బ్రాండ్లు కూడా త్వరలోనే ఇదే బాటలో ధరల పెంపు ప్రకటించే అవకాశం ఉంది.
2026 జనవరి నుంచి పెరిగే కార్ ధరలు – బ్రాండ్ వారీగా
Honda
హోండా కార్స్ ఇండియా, తన ప్యాసింజర్ వాహనాల ధరలు 2026 జనవరి నుంచి పెంచనున్నట్లు తెలిపింది. ధరల పెంపు శాతం ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా... అమేజ్, సిటీ, ఎలివేట్ వంటి మోడళ్లకు 1 నుంచి 2 శాతం వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. వేరియంట్‌ను బట్టి ధరల పెంపు మారవచ్చు.
Nissan
నిస్సాన్ ఇండియా తన కార్ల ధరలను 3 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం భారత్‌లో నిస్సాన్ మాగ్నైట్, ఎక్స్‌ట్రెయిల్ SUVలను విక్రయిస్తోంది. ఈ రెండు మోడళ్లకూ జనవరి 1, 2026 నుంచి కొత్త ధరలు వర్తిస్తాయి.
MG (JSW MG Motor India)
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా, తన ప్యాసింజర్ వాహనాల ధరలను 2 శాతం వరకు పెంచనుంది. మోడల్, వేరియంట్‌ను బట్టి ధరల పెంపు మారుతుంది. ఎంజీ హెక్టర్, ఆస్టర్, జెడ్ఎస్ EV వంటి మోడళ్లపై దీని ప్రభావం ఉండనుంది.
BYD
బీవైడీ ఇండియా, తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ SUV సీలయన్ 7 ధరను పెంచనున్నట్లు ప్రకటించింది. అయితే డిసెంబర్ 31 లోపు బుకింగ్ చేసిన వారికి ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధరలే వర్తిస్తాయి. ధర ఎంత పెరుగుతుందనే వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
Mercedes-Benz
లగ్జరీ సెగ్మెంట్‌లో మెర్సిడెస్ బెంజ్ ఇండియా తన మొత్తం మోడల్ రేంజ్‌పై 2 శాతం వరకు ధరల పెంపు ప్రకటించింది. 2026 జనవరి నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. అంతేకాదు, భవిష్యత్తులో త్రైమాసిక ధరల సవరణలపై కూడా ఆలోచనలో ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
BMW
బీఎండబ్ల్యూ ఇండియా తన లగ్జరీ కార్ల ధరలను 3 శాతం వరకు పెంచనుంది. మోడల్, వేరియంట్‌ను బట్టి ధరల పెంపు మారుతుంది. జనవరి 1, 2026 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి.
కొనుగోలుదారులకు సూచన
మీరు 2026లో కొత్త కారు కొనాలనుకుంటే, ఈ నెల ముగిసే లోగా (డిసెంబర్ 31, 2025 లోగా) బుక్ చేయడం ద్వారా కొంత డబ్బు ఆదా చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా లగ్జరీ కార్లు లేదా ప్రీమియం మోడళ్లపై ధరల పెంపు ప్రభావం ఎక్కువగా ఉండనుంది. కాబట్టి కారు కొనుగోలు ప్లాన్ ఉన్నవారు ముందే నిర్ణయం తీసుకుంటేనే మంచిది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















