వైట్, యెల్లో, గ్రీన్, బ్లూ - నంబర్ ప్లేట్ రంగులు ఏం చెబుతాయి?
మన దేశంలో కార్ నంబర్ ప్లేట్ రంగులు వాహనం ఉపయోగాన్ని ఎలా చెబుతాయి? ప్రైవేట్, కమర్షియల్, ఎలక్ట్రిక్, డిప్లొమాట్, ఆర్మీ వాహనాల నంబర్ ప్లేట్ రంగుల పూర్తి వివరాలు తెలుసుకోండి.

Details Behind Car Number Plate Colours India: మన చుట్టూ రోజూ కనిపించే కార్లు, బైక్‌లలో ఎక్కువగా తెలుపు లేదా పసుపు రంగు నంబర్ ప్లేట్‌లే మన కంట పడతాయి. కానీ భారతదేశంలో వాహనాలకు ఉపయోగించే నంబర్ ప్లేట్ రంగులు ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని వాహనాలకు నంబర్ ప్లేట్‌పై ఉండే అక్షరాల రంగు కూడా మారుతుంది. నంబర్ ప్లేట్ రంగు, అక్షరాల రంగును బట్టి ఆ వాహనం ఏ ఉపయోగం కోసం రోడ్డుపై నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు. .
ప్రైవేట్ వాహనాలు
వైట్ ప్లేట్ - బ్లాక్ లెటర్స్
భారతదేశంలో అత్యధికంగా కనిపించే నంబర్ ప్లేట్ ఇది. వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించే కార్లు, బైక్‌లు అన్నీ ఈ కేటగిరీలోకి వస్తాయి. ఈ వాహనాలను వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించకూడదు.
గ్రీన్ ప్లేట్ - వైట్ లెటర్స్
ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఇచ్చే ప్రత్యేక గుర్తింపు. బ్యాటరీ ఆధారంగా నడిచే కార్లు, స్కూటర్లు ఈ ప్లేట్‌తో ఉంటాయి. గతంలో హైడ్రోజన్ ఆధారిత వాహనాలకు కూడా ఇలాంటి ప్లేట్‌లు వాడిన సందర్భాలు ఉన్నాయి.
కమర్షియల్ వాహనాలు
యెల్లో ప్లేట్ - బ్లాక్ లెటర్స్
టాక్సీలు, ఆటోలు, సామగ్రిని తరలించే వాహనాలు, బస్సులు అన్నీ ఈ ప్లేట్‌తోనే రోడ్డుపై తిరుగుతాయి. ఈ వాహనాలు నడపడానికి ప్రత్యేక డ్రైవింగ్ లైసెన్స్, RTO అనుమతులు అవసరం.
బ్లాక్ ప్లేట్ - యెల్లో లెటర్స్
సెల్ఫ్ డ్రైవ్ కార్లు, రెంటల్ కార్లు ఈ కేటగిరీలోకి వస్తాయి. ముఖ్యంగా డ్రైవర్ లేకుండా అద్దెకు ఇచ్చే కార్లకు ఈ ప్లేట్ ఉంటుంది. వీటిని నడపడానికి కమర్షియల్ లైసెన్స్ అవసరం ఉండదు.
గ్రీన్ ప్లేట్ - యెల్లో లెటర్స్
కమర్షియల్ ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ ప్రత్యేక కలర్ కోడ్ ఇస్తారు. పచ్చ రంగు వాహనం పర్యావరణహితమైనదని చెబుతుంటే, యెల్లో అక్షరాలు వాణిజ్య వినియోగాన్ని సూచిస్తాయి.
తాత్కాలిక రిజిస్ట్రేషన్ వాహనాలు
యెల్లో ప్లేట్ - రెడ్ లెటర్స్
కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ వచ్చే వరకు తాత్కాలిక నంబర్ ప్లేట్ ఇస్తారు. ఇది సాధారణంగా ఒక నెల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ లోపు RTOలో పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
కొన్ని సందర్భాల్లో రెడ్ ప్లేట్ - వైట్ లెటర్స్ కూడా కనిపిస్తాయి. ఇవి సాధారణంగా టెస్ట్ వాహనాలకు ఉపయోగిస్తారు.
దౌత్యవేత్తల వాహనాలు
బ్లూ ప్లేట్ - వైట్ లెటర్స్
భారతదేశంలో ఉన్న విదేశీ దౌత్య కార్యాలయాలకు చెందిన అధికారులు, ఐక్యరాజ్యసమితి ప్రతినిధులకు ఈ ప్లేట్ ఇస్తారు. అదే బ్లూ ప్లేట్‌పై యెల్లో అక్షరాలు ఉంటే, ఆ వాహనం కాన్సులేట్‌లో పని చేసే అధికారికి చెందినదిగా గుర్తిస్తారు.
భారత సాయుధ దళాల వాహనాలు
బ్లాక్ ప్లేట్ - వైట్ లెటర్స్ & గుర్తులు
మన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ వాహనాలకు ప్రత్యేక గుర్తింపులు ఉంటాయి. నంబర్ ప్లేట్‌పై పైకి చూపించే బాణం గుర్తు కనిపిస్తుంది. అదనంగా ఆర్మీకి రెడ్ మీద స్టార్స్, ఎయిర్‌ఫోర్స్‌కు స్కై బ్లూ, నేవీకి నేవీ బ్లూ గుర్తులు వాడుతారు.
నంబర్ ప్లేట్ రంగు అనేది కేవలం డిజైన్ కాదు. అది ఆ వాహనం పాత్ర, ఉపయోగం, నియమాల్ని స్పష్టంగా చెబుతుంది. ఇకపై రోడ్డుపై కనిపించే ప్రతి నంబర్ ప్లేట్ వెనుక అర్థం ఇకపై మీకు ఈజీగా అర్థమవుతుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.



















