2025 రీక్యాప్: భారత ఆటోమొబైల్ రంగాన్ని ప్రభావితం చేసిన విధానాలు, లాంచ్‌లు, మైలురాళ్లు
2025లో భారత కార్ ఇండస్ట్రీని ప్రభుత్వ విధానాలు, GST మార్పులు, E20 ఇంధనం, EV దూకుడు, ప్రముఖ కార్ల వార్షికోత్సవాలు పూర్తిగా మార్చేశాయి. ముఖ్యమైన ఘటనల సమీక్ష ఇది.

Indian Car Industry 2025: 2025 సంవత్సరం భారత ఆటోమొబైల్ రంగానికి సాధారణ సంవత్సరం కాదు. ప్రభుత్వ విధానాలు, పన్ను సంస్కరణలు, ఇంధన మార్పులు, ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి, పాపులర్ కార్ల మైలురాళ్లు - ఇవన్నీ కలిసి కార్ ఇండస్ట్రీ దశను కొత్త దిశలోకి మళ్లించాయి. వినియోగదారుల నిర్ణయాలపై ఈ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపించింది.
బడ్జెట్ ఇచ్చిన ఊపిరి
2025 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో, 1600cc లోపు ఇంజిన్ ఉన్న మోటార్‌సైకిళ్లపై దిగుమతి సుంకాన్ని 100 శాతం నుంచి 50 శాతానికి తగ్గించారు. లిథియం అయాన్ బ్యాటరీ సెల్స్, కీలక ఖనిజాలపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఇచ్చారు. దీనివల్ల దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ఊతం లభించింది.
వింటేజ్ కార్ల దిగుమతులకు సడలింపు
ఫిబ్రవరిలో వింటేజ్ కార్ల దిగుమతి నిబంధనలను ప్రభుత్వం సడలించింది. 50 ఏళ్లు దాటిన వాహనాలను లైసెన్స్ లేకుండానే దిగుమతి చేసుకునే అవకాశం కల్పించింది. ఖర్చు ఎక్కువైనా, కార్ ప్రేమికులకు ఇది పెద్ద శుభవార్తగా మారింది.
ఏప్రిల్ నుంచి E20 ఇంధనం
ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ అమల్లోకి వచ్చింది. ఇది ఇంధన దిగుమతులను తగ్గించడంలో సహాయపడినా, మైలేజ్‌పై ప్రభావం చూపింది. వాస్తవ వినియోగంలో ఇంధన సామర్థ్యం మరింత తగ్గిందని అనుభవాలు చెబుతున్నాయి. పాత వాహనాలకు E20 అనుకూలతపై ఇంకా సందేహాలు కొనసాగుతున్నాయి.
చెన్నై ప్లాంట్‌పై రెనాల్ట్ పూర్తి నియంత్రణ
ఏప్రిల్‌లో, నిస్సాన్ తన వాటాను విక్రయించడంతో చెన్నై ప్లాంట్‌పై రెనాల్ట్ పూర్తి నియంత్రణ సాధించింది. ఆధునిక డిజైన్ సెంటర్‌ను కూడా ప్రారంభించి, భారత మార్కెట్‌పై తన ఫోకస్ మరింత పెంచింది.
ఇండియా - యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్
జులైలో ఇండియా - UK మధ్య FTA కుదరడం కార్ల రంగానికి కీలకంగా మారింది. లగ్జరీ కార్లపై దిగుమతి సుంకం క్రమంగా తగ్గనుంది. దీంతో బ్రిటన్‌లో తయారయ్యే ప్రీమియం కార్ల ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు, ఇండియాలో తయారయ్యే ఎలక్ట్రిక్ కార్లకు యూకే మార్కెట్ తెరుచుకోనుంది.
ప్రముఖ కార్ల వార్షికోత్సవాలు
హ్యుందాయ్ క్రెటా 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. టయోటా ఇన్నోవా 20 ఏళ్లు, మారుతి స్విఫ్ట్ 20 ఏళ్లు, మారుతి ఆల్టో 25 ఏళ్లు పూర్తి చేసి 50 లక్షల అమ్మకాల మైలురాయిని చేరుకుంది. మహీంద్రా బొలెరో కూడా 25 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసింది.
గ్లోబల్ EV బ్రాండ్ల ఎంట్రీ
జులైలో, ప్రపంచ ప్రఖ్యాత టెస్లా కంపెనీ, తన మోడల్ Yతో ఇండియాలోకి అడుగుపెట్టింది. సూపర్‌చార్జర్ నెట్‌వర్క్‌తో EV రంగంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పింది. నవంబర్‌లో వియత్నాం సంస్థ విన్ఫాస్ట్ VF6, VF7 ఎలక్ట్రిక్ SUVలను లాంచ్ చేసింది.
GST 2.0 సంస్కరణలు
సెప్టెంబర్‌లో అమలైన GST మార్పులు వాహనాల ధరలను తగ్గించాయి. చిన్న కార్లు, ద్విచక్ర వాహనాలకు ఇది పెద్ద ఊరటగా మారింది. మార్కెట్‌లో డిమాండ్ పెరగడానికి ఇదే ప్రధాన కారణంగా నిలిచింది.
కఠినమైన ఉద్గార నిబంధనలు
CAFE 3 ప్రతిపాదనలు కార్ల కంపెనీలను ఎలక్ట్రిక్, హైబ్రిడ్ మోడళ్ల వైపు మరింత మళ్లించాయి. ఇంధన సామర్థ్య లక్ష్యాలు భవిష్యత్ కార్ల రూపకల్పనను ప్రభావితం చేస్తున్నాయి.
మిడ్‌సైజ్ SUV సెగ్మెంట్‌లో యుద్ధం
అనేక బ్రాండ్లు కొత్త లాంచ్‌లు లేదా కీలక అప్‌డేట్లను ప్రవేశపెట్టడంతో మిడ్‌సైజ్ SUV విభాగంలో పోటీ పెరిగింది. మారుతి సుజుకి విక్టోరిస్, టాటా సియెర్రా వచ్చాయి. కియా నెక్స్ట్-జెన్ సెల్టోస్ పరిచయమైంది, ఇది జనవరి 2026లో లాంచ్ అవుతుంది. ప్రత్యేకమైన డిజైన్ మార్పులతో డస్టర్ తిరిగి వస్తుందని రెనాల్ట్ ధృవీకరించింది.
పాత వాహనాలపై ఆంక్షలు
దిల్లీ NCRలో పాత వాహనాలపై ఆంక్షలు, ఫిట్‌నెస్ ఫీజుల పెంపు వాహనదారులకు భారంగా మారింది. కాలుష్య నియంత్రణే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
మొత్తంగా 2025 సంవత్సరం కార్ ఇండస్ట్రీకి మార్పుల సంవత్సరం. ప్రభుత్వ విధానాలు, మార్కెట్ స్పందన, వినియోగదారుల అభిరుచులు - ఇవన్నీ కలిసి భారత ఆటోమొబైల్ రంగాన్ని కొత్త దిశలో నడిపించాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















