2026 జనవరిలో లాంచ్‌కు సిద్ధమైన కొత్త కార్లు - ఆల్ న్యూ మోడళ్ల లిస్ట్ ఇదిగో
జనవరిలో కార్ మార్కెట్‌లో కొత్త మోడళ్ల సందడి మొదలుకాబోతోంది. న్యూ జనరేషన్ Kia Seltos, Maruti e Vitara, Tata Harrier & Safari పెట్రోల్, Renault Duster, Nissan Gravite వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

New Car Launches January 2026: కొత్త సంవత్సరం మొదలవుతూనే ఇండియన్ కార్ మార్కెట్‌లో భారీ హంగామా కనిపించబోతోంది. జనవరి 2026 నెలను ఆటోమొబైల్ కంపెనీలు ఖాళీగా వదలడం లేదు. ధరల ప్రకటనల నుంచి పూర్తిగా కొత్త మోడళ్ల వరకు వరుసగా లాంచ్‌లు ప్లాన్ చేశాయి. మీరు కొత్త కారు కొనాలనుకుంటే, జనవరిలో వచ్చే మోడళ్ల కోసం కాస్త వెయిట్ చేయండి.
Kia Seltos Second Generation
కియా సెల్టోస్ కొత్త జనరేషన్ మోడల్ ఇప్పటికే గ్లోబల్‌గా అరంగేట్రం చేసింది. ఇప్పుడు అదే మోడల్ భారత మార్కెట్‌లోకి జనవరి 2న ధరల ప్రకటనతో ఎంట్రీ ఇవ్వబోతోంది. కొత్త సెల్టోస్ డిజైన్ మరింత షార్ప్‌గా మారింది. కార్ సైజ్ పెరిగింది. లోపల కేబిన్‌లో టెక్నాలజీ, కంఫర్ట్ అంశాలు మరింత మెరుగయ్యాయి. ప్రస్తుతం ఉన్న సెల్టోస్ ఎక్స్-షోరూమ్ ధర ₹10.79 లక్షల నుంచి ₹19.81 లక్షల వరకు ఉంది. కొత్త మోడల్ ధరలు కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది.
Maruti Suzuki e Vitara
మారుతి సుజుకి నుంచి వచ్చే తొలి ఎలక్ట్రిక్ SUV ఇదే కావడం వల్ల ఈ మోడల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. e Vitara 61 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తోంది. ఒక్కసారి చార్జ్‌లో 543 కి.మీ. రేంజ్ ఇస్తుందనే ARAI అంచనా కుటుంబ వినియోగదారులను ఆకర్షిస్తోంది. కేబిన్ స్పేస్, స్టైలిష్ లుక్, మారుతి విస్తృతమైన సర్వీస్ నెట్‌వర్క్ ఈ కారుకు ప్లస్ పాయింట్లు. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో చార్జింగ్ సదుపాయాల విస్తరణ ఈ కారుకు బలంగా మారనుంది.
Tata Harrier Petrol & Tata Safari Petrol
టాటా హారియర్, సఫారి SUVలకు ఎట్టకేలకు పెట్రోల్ ఆప్షన్ అందుబాటులోకి రానుంది. 1.5 లీటర్ T GDI టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో ఈ మోడళ్లు వస్తున్నాయి. పెద్ద SUVలకు సరిపోయేలా ఈ ఇంజిన్‌ను టాటా ప్రత్యేకంగా ట్యూన్ చేసింది. డీజిల్‌పై పరిమితులు ఉన్న ప్రస్తుత టైమ్‌లో ఈ వెర్షన్లు కీలకంగా మారనున్నాయి. ధరలు సుమారు ₹13.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Renault Duster
ఒకప్పుడు ఇండియాలో కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌కు గుర్తింపు తీసుకొచ్చిన రెనాల్ట్ డస్టర్ రీఎంట్రీ ఇస్తోంది. జనవరి 26, 2026న కొత్త జనరేషన్ డస్టర్ లాంచ్ కానుంది. ఈసారి డిజైన్ పూర్తిగా కొత్తగా ఉంటుంది. లోపల ఇంటీరియర్ మరింత అప్‌మార్కెట్‌గా మారుతుంది. డీజిల్‌కి బదులుగా పెట్రోల్ ఇంజిన్‌లపై కంపెనీ దృష్టి పెట్టింది. అయినా డస్టర్‌కు ఉన్న రగ్గడ్ స్వభావాన్ని కొనసాగిస్తుందనే ఆశ అభిమానుల్లో ఉంది.
Nissan Gravite
నిస్సాన్ ఇండియాలో తన లైనప్‌ను విస్తరించేందుకు కొత్త MPVను తీసుకొస్తోంది. దీనికి ‘గ్రావైట్’ అనే పేరు ఖరారు చేశారు. రెనాల్ట్ ట్రైబర్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడినా... డిజైన్, ఇంటీరియర్ పూర్తిగా భిన్నంగా ఉండబోతున్నాయి. 7 సీట్లు, 4 మీటర్ల లోపు పొడవు ఈ కారును ఫ్యామిలీ వినియోగానికి అనువుగా మారుస్తాయి. పూర్తి ధరల వివరాలు తర్వాత వెల్లడించే అవకాశం ఉంది.
2026 Skoda Kushaq Facelift
అత్యధిక ప్రజాదరణ పొందిన స్కోడా కుషాక్.. జనవరి ప్రారంభంలో ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది మెకానికల్ మార్పుల కంటే కాస్మెటిక్ ట్వీక్‌లు, అప్‌డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. కాబట్టి ఇంజిన్ విషయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టమవుతోంది.
Mahindra XUV 7XO
మహీంద్రా XUV 7XO జనవరి 5న లాంచ్ అవుతుంది. ఇది XUV700కు రీబ్రాండెడ్ వెర్షన్. ఇది రిఫ్రెష్డ్ స్టైలింగ్ & ఇంటీరియర్ అప్‌డేట్‌లతో ప్రీమియం లుక్ పొందుతుంది. అయితే, ఇంజిన్ పరంగా పెద్దగా మార్పులు ఏమీ ఉండవని సమాచారం. మూడు వరుసల SUV కోసం చూస్తున్న కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని కంపెనీ ఈ కారును లాంచ్ చేయనుంది.
మొత్తంగా చూస్తే, జనవరి 2026 నెల కొత్త కార్ల కొనుగోలుదారులకు నిజంగా ఉత్సాహభరితంగా ఉండబోతోంది. SUVలు, ఎలక్ట్రిక్ కార్లు, ఫ్యామిలీ MPVలు… ప్రతి సెగ్మెంట్‌లోనూ కొత్త ఎంపికలు సిద్ధంగా ఉన్నాయి. మీరు ఏ కార్ కోసం ఎదురుచూస్తున్నారు?.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















