Ola, Uber, Rapido Ban: మహారాష్ట్రలోనూ ఉబెర్, ర్యాపిడో నిషేధం! - బైక్ టాక్సీలకు ఎందుకు బ్రేకులు పడుతున్నాయి?
Bike Taxi Ban: బెంగళూరు తర్వాత ముంబై కూడా బైక్ టాక్సీ సేవలపై కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. మహారాష్ట్ర పోలీసులు ఉబెర్ & ర్యాపిడోపై కేసు నమోదు చేశారు.

Ban On Bike Taxi In Maharashtra: ముంబై వంటి మహా రద్దీ మెట్రోపాలిటన్ సిటీలో ప్రయాణీకులకు బైక్ టాక్సీలు చాలా ఉపయోగపడతాయి. కానీ ఇప్పుడు ఈ సేవలపై చట్టపరమైన కత్తి వేలాడుతోంది. పర్మిట్ లేకుండా బైక్ టాక్సీలు నడుపుతున్నందుకు ఉబెర్, ర్యాపిడో వంటి పెద్ద కంపెనీలపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ణాటక తర్వాత, మహారాష్ట్రలో కూడా బైక్ టాక్సీ సేవలను నిషేధించే సూచనలు కనిపిస్తున్నాయి.
అసలు విషయం ఏంటి?
ముంబై పోలీసులు & RTO అధికారులు కలిసి ఉబెర్, ర్యాపిడో సర్వీసులపై ఒకరకమైన స్టింగ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. అధికారులు స్వయంగా రైడ్ బుక్ చేసుకున్నారు & తెల్ల నంబర్ ప్లేట్‌లు (వ్యక్తిగత ఉపయోగం కోసం మాత్రమే ఉద్దేశించిన వాహనాలు) ఉన్న బైక్‌లను ప్రయాణీకుల రైడ్‌లకు, అంటే వాణిజ్యపరంగా ఉపయోగిస్తున్నట్లు నిర్ధారించుకున్నారు. తెల్ల నంబర్ ప్లేట్ ఉన్న వాహనాలను వాణిజ్యపరంగా ఉపయోగించడం చట్టవిరుద్ధం. ఇది మోటారు వాహనాల చట్టం నిబంధనలను ఉల్లంఘించడమేనని అధికారులు తేల్చారు.
బైక్ టాక్సీకి ఆదరణ ఎందుకు పెరుగుతోంది?
పెద్ద మహానగరాలలో బైక్ టాక్సీలకు డిమాండ్ చాలా వేగంగా పెరిగింది. దీనికి కారణాలు - ట్రాఫిక్ తప్పించుకోవడం, తక్కువ ఛార్జీలు, మెట్రో స్టేషన్ లేదా ఆఫీసుకు త్వరగా చేరుకునే సౌలభ్యం, యువతలో ప్రజాదరణ. ముఖ్యంగా.. ముంబై వంటి నగరాల్లో ప్రతిరోజూ వేలాది మంది బైక్ టాక్సీలో ప్రయాణిస్తారు, ఇది చౌకైన & మెరుగైన రవాణా మార్గం.
చట్టం ఏం చెబుతోంది?
భారతదేశంలో బైక్ టాక్సీలకు ఇంకా స్పష్టమైన చట్టపరమైన వర్గీకరణ లేదు. ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం, తెల్లటి నంబర్ ప్లేట్ ఉన్న బైక్‌ను ఏదైనా వాణిజ్య చర్య కోసం ఉపయోగించడం చట్టవిరుద్ధం. ఉబెర్ & ర్యాపిడో వంటి కంపెనీలు తమను తాము కేవలం "టెక్నాలజీ ప్లాట్‌ఫామ్"గా అభివర్ణించుకుంటున్నప్పటికీ, చట్టపరంగా ఈ వాదన కోర్టులో చెల్లదు.
'పార్శిల్ ట్రిక్' ఇక పని చేయదు
ర్యాపిడో వంటి కంపెనీలు నిబంధనలను బేఖాతరు చేయడానికి ఒక మార్గాన్ని కనుగొన్నాయి, అవి రైడ్‌ను "పార్శిల్"గా ప్రకటించి, తాము పార్శిల్ డెలివరీలు మాత్రమే చేస్తున్నామని చెప్పుకుంటున్నాయి. కానీ ప్రభుత్వం & కోర్టులు ఈ రకమైన మోసాన్ని కనిపెట్టాయి.
ఆటో, టాక్సీ సంఘాల నిరసన
ఆటో, టాక్సీ డ్రైవర్లు వాణిజ్య పన్ను, బీమా, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, పర్మిట్ ఫీజులు చెల్లిస్తుంటే బైక్ టాక్సీ రైడర్లు ఈ మినహాయింపు ప్రయోజనాన్ని ఎందుకు పొందాలని యూనియన్లు ప్రశ్నిస్తున్నాయిు?. ఆటో, టాక్సీ యూనియన్ల ఒత్తిడి కారణంగా కర్ణాటక ప్రభుత్వం బైక్ టాక్సీలపై కఠిన చర్యలు తీసుకుంది & ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అదే దిశలో చర్యలు తీసుకుంటోంది.
ఇప్పుడు ఏం జరుగుతుంది?
బైక్ టాక్సీ సేవలకు స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని కొన్ని రాష్ట్ర హైకోర్టులు ఇప్పటికే ప్రభుత్వాలను ఆదేశించాయి. కానీ, ఆ పని చాలా నెమ్మదిగా ఉంది. ఇప్పుడు రెండు రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవడంతో మిగతా రాష్ట్రాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఫలితంగా అక్కడ కూడా చర్యలు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవచ్చు.





















