Daily Office Cars: డైలీ ఆఫీస్‌కు వెళ్లేవాళ్లకు 5 స్టైలిష్ కార్లు - 35 km మైలేజ్, ధర తక్కువ, ట్రాఫిక్‌తో నో టెన్షన్!
Best cars for daily office use: మీరు రోజూ ఆఫీసుకు వెళ్లిరావడానికి తక్కువ రేటులో మంచి మైలేజ్ ఇచ్చే 5 కార్లు ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయి. మీరు కొనడమే ఆలస్యం.

Affordable Office Cars 2025: హైదరాబాద్, విజయవాడ వంటి పెద్ద నగరాల్లో ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లడం అంత తేలికైన పని కాదు. భారీ ట్రాఫిక్, కొండెక్కి కూర్చున్న ఇంధనం ధరలు & పార్కింగ్ సమస్యలు అన్నీ ఒక పద్మవ్యూహాన్ని తలపిస్తాయి. ఈ పద్మవ్యూహాన్ని ఛేదించడానికి, అభినవ అభిమన్యులు తక్కువ ధరలో మంచి మైలేజీని ఇచ్చే & తక్కువ నిర్వహణ ఉన్న కారును కోరుకుంటారు.
ఎక్కువ మైలేజీ ఇచ్చే & సేవింగ్స్‌పై తక్కువ ప్రభావం చూపే 5 కార్లు
మారుతి సుజుకి సెలెరియో
Maruti Suzuki Celerio చిన్న, అందుబాటులో ధరలో & అధిక మైలేజ్ కారు కోరుకునే వారి కోసం ప్రత్యేకంగా లాంచ్ అయింది. కంపెనీ డేటా ప్రకారం.. దీని 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ లీటర్‌కు 25.24 కి.మీ. మైలేజీని ఇస్తుంది, CNG వేరియంట్ కిలోగ్రాముకు 35 కి.మీ. వరకు మైలేజీని ఇవ్వగలదు. ఈ కారులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పుష్-బటన్ స్టార్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్ & 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనిలోని 313-లీటర్ బూట్ స్పేస్ & మారుతి నమ్మకమైన సర్వీస్ నెట్‌వర్క్ ఈ కారును ఆఫీసు ప్రయాణానికి సూపర్ ఆప్షన్‌గా మార్చాయి. తెలుగు రాష్ట్రాల్లో మారుతి సుజుకి సెలెరియో ప్రారంభ ధర రూ. 5.64 లక్షలు (ఎక్స్-షోరూమ్).
రెనాల్ట్ క్విడ్
SUV స్టైల్ డిజైన్ & అందుబాటు ధర కారణంగా Renault Kwid బాగా పాపులర్ అయింది. దీని 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ లీటరుకు 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీ ఇస్తుంది. 8-అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు & అధిక గ్రౌండ్ క్లియరెన్స్ వంటి ఫీచర్లు క్విడ్‌లో అందుబాటులో ఉన్నాయి. స్టైలిష్ డిజైన్ & ప్రీమియం క్యాబిన్ యువతను ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. రెనాల్ట్ క్విడ్ ప్రారంభ ధర రూ. 4.70 లక్షలు (ఎక్స్-షోరూమ్), ఇది బడ్జెట్ కార్ల జాబితాలో అత్యంత తక్కువ ధర కారు.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్
స్టైల్ & ఫీచర్ల కలయికను కోరుకునే వారి కోసం వచ్చింది Hyundai Grand i10 Nios. దీని ధర రూ. 5.92 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ప్రీమియం క్యాబిన్, బలమైన నిర్మాణ నాణ్యత & సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఇది అందిస్తుంది. దీనికి 1.2-లీటర్ పెట్రోల్ & CNG ఇంజిన్ ఎంపికలు రెండూ ఉన్నాయి. ఇంటీరియర్‌లో వైర్‌లెస్ ఛార్జర్, కూల్డ్ స్టోరేజ్, రియర్ AC వెంట్స్ & 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి అధునిక ఫీచర్లు ఉన్నాయి. స్టైల్ & ఫీచర్ల కలయిక కారణంగా ఈ కారు నగర/పట్టణ వినియోగదారులకు ఇష్టమైన వాహనంగా ప్రాచుర్యం పొందింది.
టాటా టియాగో
Tata Tiago అతి పెద్ద బలం దాని బలమైన నిర్మాణ నాణ్యత & భద్రత. ఈ కారు GNCAP క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ రేటింగ్‌ను పొందింది. 1.2-లీటర్ పెట్రోల్ & CNG ఇంజిన్ ఆప్షన్స్‌లో టియాగో అందుబాటులో ఉంది. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, హర్మాన్ సౌండ్ సిస్టమ్ & ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి మోడ్రన్ ఫీచర్లతో ఇంటీరియర్‌ను అమర్చారు. రూ. 5 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో, ఈ కారు బడ్జెట్-ఫ్రెండ్లీ & సురక్షితమైన ఎంపిక.
మారుతి సుజుకి స్విఫ్ట్
Maruti Suzuki Swift చాలా ఏళ్లుగా తెలుగువాళ్ల ఎంపిక. దీని స్పోర్టీ డిజైన్, నమ్మకమైన పనితీరు & గొప్ప మైలేజ్ రోజువారీ ఆఫీసు ప్రయాణానికి చాలా అనుకూలం. దీనికి 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది, ఇది లీటరుకు 23 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది. CNG వేరియంట్, ARAI క్లెయిమ్ చేసిన ప్రకారం, 32.85 కి.మీ/కి.గ్రా. మైలేజీ ఇస్తుంది. ఈ కారులో పుష్-బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ & 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఆఫీసుకి వెళ్ళడానికి ఏ కారు బెటర్?
రోజూ ఆఫీసు ప్రయాణానికి ఆర్థికం అందుబాటులో ఉండే, అధిక మైలేజీ ఇచ్చే & తక్కువ నిర్వహణ కలిగిన కారు కావాలంటే.. మారుతి సెలెరియో & టాటా టియాగో మీకు ఉత్తమ ఎంపికలు కావచ్చు. స్టైల్ & ఫీచర్లపై ఎక్కువ ఫోకస్ పెడితే, హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ & మారుతి స్విఫ్ట్ సరైన ఎంపిక. SUV లాంటి లుక్స్‌ను ఇష్టపడే వారికి రెనాల్ట్ క్విడ్ 'డబ్బుకు తగిన విలువ ఇచ్చే ప్యాకేజీ' అవుతుంది.




















